APCOS: సర్టిఫికెట్లు అప్లోడ్ చేయండి.. లేదంటే జనవరి జీతం కట్..
ఏపీ పొరుగుసేవల సంస్థ ఆదేశం
ఆందోళనలో 90వేల మంది ఉద్యోగులు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న పొరుగుసేవల ఉద్యోగుల ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోతే జనవరి నెల జీతం నిలిపివేస్తామంటూ ఏపీ పొరుగుసేవల సంస్థ ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 90,609 మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. వీరిలో చాలా మంది విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రాలు లేవని పేర్కొంది. వీటిని వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేసి పంపించాలని ఆదేశించింది. పొరుగుసేవల సిబ్బందిని తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఒక పక్క ఆరోపణలు వస్తుండగా..
ఇప్పుడు కార్పొరేషన్ ఆదేశాలు ఇవ్వడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగంలో చేరిన కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు వీటిని అడగడం గమనార్హం. వర్క్స్, అకౌంట్స్ డైరెక్టరేట్ పరిధిలో ఇటీవల 17మందిని తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వడం.. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో దాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో భాగంగా... కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగుల కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, పదోతరగతి మార్కుల జాబితా, విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించింది. గ్రాడ్యుయేషన్ లేకుండా రూ.18 వేల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న ఉద్యోగుల వివరాలు, పోస్టు ప్రభుత్వ ఆర్డర్ ప్రకారం భర్తీ చేశారా? బోర్డు అనుమతి ప్రకారం చేశారా? సాధారణ ఖాళీల్లోనే పోస్టు ఉందా? అనే వివరాలను పంపించాలని అన్ని కార్యాలయాలను ఆదేశించింది.
0 Comments:
Post a Comment