Andhra Pradesh: సీపీఎస్ సమావేశాన్ని బహిష్కరించిన ఏడు ఉద్యోగ సంఘాలు
Andhra Pradesh: అమరావతి సచివాలయంలో సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం సమావేశమైంది. బ్లాక్ 2లో ఆర్ధిక శాఖ కాన్ఫరెన్స్ హాలులో ఈ సమావేశం జరుగుతోంది.ఈ సమావేశానికి జీవోఎం సభ్యులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. అటు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాసరావు, సూర్య నారాయణ, వెంకట్రామి రెడ్డి, ఇతర నేతలు సీపీఎస్ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 13 ఉద్యోగ సంఘాలు ఈ కీలక సమావేశానికి హాజరుకాగా ఏడు సంఘాలు దూరంగా ఉన్నాయి.
అటు APCPSEA రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పలరాజు, కె.పార్థసారథి మాట్లాడుతూ.. పాత పెన్షన్ పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వ సాచివేత ధోరణిని నిరసిస్తూ సీపీఎస్‌పై చర్చలను బహిష్కరించామని తెలిపారు. జీపీఎస్‌పై గత కొన్ని నెలలుగా రాష్ట్రప్రభుత్వం చర్చలు పేరుతో సమస్యను సాగతీస్తుందని ఆరోపించారు. గత చర్చలలో పాత పెన్షన్ పునరుద్ధరణ మాత్రమే తమకు అంగీకారం అని రాతపూర్వకంగా తెలిపామన్నారు. పాత పెన్షన్ పునరుద్ధరణపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సమావేశం పెట్టడం సమంజసం కాదన్నారు. ఒక వైపు సెప్టెంబర్ 1వ తేదీ మిలియన్ మార్చ్ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ క్రిమినల్ కేసులను తక్షణం తొలగించాలని అప్పలరాజు, కె.పార్థసారథి డిమాండ్ చేశారు.
అటు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు మాట్లాడుతూ.. సీపీఎస్‌తో పాటు పెండింగ్ అంశాలపై చర్చ ఉందని జీఏడీ కార్యదర్శి నుంచి మెసేజ్ రావటంతోనే సమావేశానికి వచ్చామన్నారు. కొత్త డీఏలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగులకు హెల్త్ స్కీం, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు పదవీ విరమణ 62 ఏళ్ళకు పెంచటం అనే అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. ఓపీఎస్ అయితేనే చర్చిస్తామని.. జీపీఎస్‌పై చర్చించేది లేదన్నారు. ఈ సమావేశంలో 12వ పీఆర్సీ కమిటీ ప్రకటన కూడా కోరతామన్నారు.
0 Comments:
Post a Comment