పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంపుపై ప్రభుత్వ నిర్ణయం
ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నిర్దేశించిన వయోపరిమితిని అయిదేళ్లు పెంచాలంటూ నిరుద్యోగులు డిమాండు చేస్తున్నా..
రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లే పెంచింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నాలుగేళ్ల తర్వాత నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో ఈ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు.. వయోపరిమితి రీత్యా తాము దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కోల్పోతున్నామని, అయిదేళ్లు పెంచాలంటూ గత కొన్ని రోజులుగా డిమాండు చేస్తున్నారు.
వారికి మద్దతుగా యువజన, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలూ ఆందోళన చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం పెంపు రెండేళ్లకే పరిమితం చేసింది. దీని వల్ల్ల తాము నష్టపోతున్నామని కొందరు అభ్యర్థులు వాపోతున్నారు.
ఎస్సై ఉద్యోగాలకు 29.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు 26 ఏళ్లు
రెండేళ్ల వయోపరిమితి పెంపు వల్ల కానిస్టేబుల్ ఉద్యోగాలకు.. జనరల్ విభాగంలో 18-26 ఏళ్ల వయసున్న వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులైతే 18-31 ఏళ్ల వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
ఎస్సై ఉద్యోగాలకు జనరల్ విభాగంలో 21-29 ఏళ్ల వయసున్న వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులైతే 21-34 ఏళ్ల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
కానిస్టేబుల్ పోస్టులకే పెంపు అంటూ తొలుత ప్రకటన..
రెండేళ్ల వయోపరిమితి పెంపు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికే వర్తిస్తుందంటూ తొలుత శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
కానిస్టేబుల్, ఎస్సై పోస్టులు రెండింటికీ వయోపరిమితి రెండేళ్లు పెంచుతున్నట్లు రాత్రికి ప్రకటన విడుదల చేశారు. 'పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలంటూ అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవించారు.
దీనిపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సీఎంవో అధికారులతో సమావేశమయ్యారు. వయోపరిమితి పెంచాలని ఆదేశాలిచ్చారు' అని ఆ ప్రకటనలో వివరించారు.
0 Comments:
Post a Comment