Voter Id Aadhar Link: మన దేశంలో ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్కూల్లో అడ్మిషన్ నుంచి బ్యాంకు వరకు ప్రతి పనికి ఆధార్ కార్డు తప్పనిసరి అయింది.
ఈ నేపథ్యంలోనే పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇలా చేయకుంటే పాన్ కార్డు రద్దవుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఎన్నికల సంఘం కూడా పౌరులను కోరింది.
ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో ఓటర్ ఐడీతో ఆధార్‌ను లింక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. మరి ఓటర్ ఐడీకి ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే ఓటరు జాబితా నుంచి పేరు తొలగిస్తారా..? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
ఈ ప్రశ్నకు శుక్రవారం లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో అనుసంధానించకపోతే.. ఓటరు జాబితా నుంచి పేరు తొలగిపోదన్నారు.
ఎన్నికల చట్టాల (సవరణ) చట్టం 2021లో ఆధార్ కార్డును ఓటర్ ఐడీకి లింక్ చేయవచ్చని నిబంధన ఉందని.. అయితే అది పౌరుడు లింక్ చేసినా చేయకున్నా అతని ఇష్టంపై ఆధారపడి ఉంటుందని మంత్రి తెలిపారు.
ఓటరు గుర్తింపుకార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ఓటర్ల పేరు కూడా జాబితా నుంచి తొలగిపోదని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు దేశంలో దాదాపు 95 కోట్ల మంది ఓటర్లలో 54 కోట్ల మంది ఓటర్లు తమ ఆధార్‌ను ఓటర్ ఐడీతో అనుసంధానం చేసుకున్నారు.
మీరు కూడా మీ ఆధార్‌ను ఓటర్ ఐడితో లింక్ చేయాలనుకుంటే.. మీరు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను సందర్శించండి. లేదా ఎన్నికల అధికారిని సంప్రదించడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
0 Comments:
Post a Comment