గొడిచెర్లలో 25 మంది ఉపాధ్యాయులకు షోకాజ్
ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు సూచనలిస్తున్న డీఈఓ లింగేశ్వరరెడ్డి
నక్కపల్లి మండలం గొడిచెర్ల ఉన్నత పాఠశాలకు చెందిన 25 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి వెల్లడించారు.
పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులకు వెళ్లి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు వచ్చిన విషయమై మాట్లాడారు. వీటిని చక్కగా వినియోగించుకోవాలన్నారు. దీంతో పాటు మిగిలిన తరగతులకు వెళ్లి ఇంతవరకు బోధించిన పాఠాలను అడిగి తెలుసుకుని పలు ప్రశ్నలు వేశారు.
వారి చదువుతీరుపై డీఈఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెనుకబడిన విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ప్రణాళిక, బోధన పరంగా ప్రత్యేక కార్యక్రమాలతో పాటు, ఎఫ్.ఎ.1, ఎఫ్.ఎ.2 పరీక్షలకు సంబంధించి విద్యార్థుల ప్రగతి, స్థాయి విశ్లేషణ రికార్డుల నిర్వహణ సరిగా లేదని అసహనం వ్యక్తం చేశారు. బోధనపై బాధ్యతారాహిత్యంగా ఉన్నందుకు ప్రధానోపాధ్యాయుడు సహా 25 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఎంఈఓ డి.వి.డి.ప్రసాద్‌తో మాట్లాడుతూ తుది పరీక్షలకు గడువు దగ్గర పడుతున్న వేళ తగిన ప్రణాళికతో చదివేలా చూడాలన్నారు.
అన్ని పాఠశాలల్లోనూ ఇది కచ్చితంగా అమలు చేయించాలన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నాడు-నేడు పనులు త్వరగా జరిగేలా చూడాలని, నాణ్యతపై దృష్టి పెట్టాలన్నారు. బోధనలో నూతన, సరళ విధానాలను పాటించడం ద్వారా సత్ఫలితాలు వస్తాయని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కాగా ఇక్కడ భోజన నిర్వహణ కమిటీ ఏర్పాటు విషయమై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేశారు. కార్యక్రమంలో డీఈఓ సహాయకుడు వెంకటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment