10 లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీ : లోక్‌సభలో కేంద్ర మంత్రి.
రైల్వేలోనే 2,93,943 ఖాళీలు
రక్షణ రంగంలో 2,64,706, హోం శాఖలో 1,43,536 పోస్టులు ఖాళీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్లలో 10 లక్షలకుపైగానే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
2021 మార్చి 1 నాటికి 78 కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లలో 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో అత్యధికంగా రైల్వేలో 2,93,943 పోస్టులు, రక్షణ రంగంలో 2,64,706 పోస్టులు, కేంద్ర హోం శాఖలో 1,43,536 పోస్టులు, పోస్టల్‌లో 90,050 పోస్టులు, రెవెన్యూలో 80,243 పోస్టులు, ఇండియన్ ఆడిట్, అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ లో 25,934 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 40,35,203 పోస్టులకు గానూ, దాదాపు పది లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు స్పష్టమైంది. ఏడాదిన్నర కిందటి సమాచారమిది. ఈ కాలంలో మరిన్ని ఖాళీలు ఏర్పడ్డాయి.
చేనేతకు జిఎస్‌టి 12% పెంపు నిర్ణయం వాయిదా
చేనేతకు జిఎస్‌టి 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలనే 46వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం వాయిదా పడిందని, ప్రస్తుతం 5 శాతమే కొనసాగుతోందని కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి దర్శన్ జర్దోష్ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందువల్ల గార్మెంట్స్, బట్టలపై 5 శాతం జిఎస్‌టినే కొనసాగుతోందని తెలిపారు.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ రుణాలకు సగటు వడ్డీ 8.34 శాతం
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ తీసుకున్న రుణాలకు సగటు వడ్డీ 8.34 శాతం ఉందని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే తెలిపారు. టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర స్టీల్ సహాయ మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఏపి ఎంపి, ఎమ్మెల్యేలపై 10 సిబిఐ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపి, ఎమ్మెల్యేలపై పది సిబిఐ కేసులు నమోదయ్యాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. వైసిపి, టిడిపి, జనసేనకు చెందిన వారిపై ఈ కేసులు ఉన్నాయని తెలిపారు. బుధవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2017 నుంచి 2022 (2022 అక్టోబర్ 31) వరకు దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపి, ఎమ్మెల్యేలపై 56 సిబిఐ కేసులు నమోదయ్యాయని, అందులో అత్యధికంగా ఏపికి చెందిన ఎంపి, ఎమ్మెల్యేపైనే పది కేసులు నమోదయ్యాయని తెలిపారు. 56 కేసుల్లో ఇప్పటికే 22 కేసులకు సంబంధించి చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.
భేటీ పడావో ప్రకటనల ఖర్చు రూ.401 కోట్లు - బాలికలకు ఖర్చు చేసింది రూ.373 కోట్లే
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భేటీ పడావో కార్యక్రమం ప్రకటనలకు రూ.401.04 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. 2014-15 నుంచి ఇప్పటి వరకు భేటీ పడావో కార్యక్రమానికి రూ.1,270 కోట్లు కేటాయించగా, అందులో రూ.774.25 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఖర్చు చేసిన మొత్తంలో రూ.373.21 కోట్లు బాలికల కార్యక్రమాలకు ఖర్చు చేసినట్లు తెలిపారు.
0 Comments:
Post a Comment