ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద భద్రతను మరింత పటిష్టం చేశారు. రూ.2 కోట్ల వ్యయంతో అత్యాధునిక భద్రతా పరికరాలను కొనుగోలు చేశారు.
ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లే దారిలో చెక్ పోస్ట్ లు ఉంటాయి. ఇప్పుడు వాటితో పనిలేకుండా పూర్తి సాంకేతిక పరిజ్ణానంతో టైర్ కిల్లర్స్, బొల్లార్డ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు 45 సీసీ కెమెరాలను ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేయగా వాటి సంఖ్యను 65కు పెంచారు. టైర్ కిల్లర్స్, బొల్లార్డ్స్ ను మూడు సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేయాల్సి ఉంది.
అయితే కరోనా కారణంగా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లే దారిలో ఆక్రమణల తొలగింపు, రహదారి నిర్మాణానికి మరో ఏడాది సమయం పట్టింది.
భద్రతా పరికరాల ఏర్పాటు వ్యవహారాన్ని ప్రభుత్వం ప్రయివేటు సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ ప్రస్తుతం ట్రయల్ రన్ కొనసాగిస్తోంది. మరో రెండురోజుల్లో భద్రతా పరికరాలను ప్రయివేటు సంస్థ నుంచి అధికారుల చేతుల్లోకి రానున్నాయి.
సున్నితమైన ప్రాంతంలో జగన్ ఇల్లు
రక్షణ పరంగా చాలా సున్నితమైన ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్ ఇల్లు ఉంది. ఆ ఇంటి పక్కనే రైవస్ కాల్వ ఉంది. సమీపంలో చెన్నై-కోల్ కతా జాతీయ రహదారి ఉంది. దీంతో 24 గంటల సెక్యూరిటీ
అప్రమత్తంగా ఉంటుంది. అసాంఘిక శక్తులు, అల్లరి మూకలు ముఖ్యమంత్రి ఇంటివైపు కూడా చూసేందుకు వీల్లేకుండా భద్రతను పర్యవేక్షిస్తారు. అందుకే రూ.2 కోట్లు వెచ్చించి దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనివిధంగా ఇంటిచుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.
0 Comments:
Post a Comment