World Population 2022: 'అమెరికా లో డాలర్లు పండుతాయి. ఇండియాలో సంతానం ఉత్పత్తి అవుతుంది. ఏ ఏటికి ఆ ఏడు ఇండియా ఈనుతున్నది.. ఆస్ట్రేలియా అంత జనాభానూ' మనదేశంలో జనాభా పెరుగుదలకు సంబంధించి మహాకవి శ్రీశ్రీ చలోక్తిగా రాసిన కవితలు ఇవి..
ఒక ఇండియానే కాదు ప్రపంచం మొత్తం ఇప్పుడు జనాభా విస్ఫోటన కేంద్రంగా మారింది. నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్ల మైలురాయికి చేరుకోబోతోంది. 48 సంవత్సరాల తర్వాత పోలిస్తే ఇది రెట్టింపు. ఐదు దశాబ్దాలలోపే ఇంతటి జనాభా పెరగడానికి కారణాలు అనేకం.
World Population 2022
సౌకర్యవంతంగా జీవించ గలదా?
మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన.. ఈ సామెత ఊరికే పుట్టలేదు. అలాగే జనం ఎక్కువైతే ఈ భూమిపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది. ఆరోగ్య సంరక్షణ మరుగున పడుతుంది. వనరులపై ఒత్తిడి పెరుగుతుంది.
భూతాపం అంతకంతకు పెచ్చరిల్లుతుంది. విపత్తులు విరుచుకుపడతాయి. కరువులు విజృంభిస్తాయి. నీటి కొరత ముప్పేట దాడి చేస్తుంది. తినేందుకు తిండే కాదు… తాగేందుకు నీరు కూడా కరువవుతుంది.
ఫలితంగా మనుషులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనుషులంతా సుస్థిరమైన లక్ష్యాలతో పుడమిని కాపాడే ఉమ్మడి బాధ్యత తీసుకోవాలి.
గతంలో ఇలా..
క్రీస్తు పూర్వం 8000 సంవత్సర ప్రాంతంలో ప్రపంచ జనాభా 50 లక్షలుగా ఉండేది. క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికి అది 20 కోట్లకు చేరింది. కొన్ని అంచనాలు 30 కోట్లు, 60 కోట్లు అని చెబుతున్నాయి. 1804 సంవత్సరంలో ప్రపంచ జనాభా వంద కోట్లకు చేరుకుంది. పరిశ్రమల ఏర్పాటు తో ఉపాధి అవకాశాలు పెరిగాయి.
వైద్యంలో విప్లాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా ఆకాల మరణాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా ఇవి శిశువుల్లో బాగా తగ్గిపోయాయి. సగటు ఆయుర్దాయం పెరిగింది. ఇది జనాభా పెరుగుదలకు దారి తీసింది. వాస్తవానికి ప్రపంచ జనాభా 200 కోట్లకు చేరడానికి 126 ఏళ్లు పట్టింది.
300 కోట్ల మార్కు కు 30 ఏళ్లు, 400 కోట్లకు 14 ఏళ్లు, 500 కోట్ల మార్కుకు 13 ఏళ్లు పట్టింది. 600 కోట్ల మార్కుకు చాలా వేగంగా 11 ఏళ్ళే పట్టింది. 700 కోట్లకు, 800 కోట్లకు ఇదే సమయం పట్టింది.
World Population 2022
ముప్పు తప్పదు
జనాభా పెరుగుదల ఇలానే ఉంటే 2030 నాటికి 850 కోట్లు, 2050 నాటికి 970 కోట్లు, 2080 నాటికి 1040 కోట్లకు చేరుకుంటుందని ఐరాస వెల్లడించింది. గత 50 ఏళ్ళల్లో జనాభా బాగా పెరిగింది.
ఇదే సమయంలో అడవుల్లో క్షీరదాలు, సరిసృపాలు, ఉభయ చరాలు మాత్రం సరాసరి మూడింట రెండొంతల వంతు తగ్గిపోయాయి. మనుషుల అవసరాల కోసం అడవులు నరికి వేయడంతో జంతువుల సంఖ్య తగ్గింది. గత 60 ఏళ్లల్లో అటవీ విస్తీర్ణం 81.7 మిలియన్ హెక్టార్ల మేర తగ్గింది. భూమి పై మూడు వంతుల ప్రాంతం, సాగరాల్లో రెండు వంతుల భాగం మార్పులకు గురయింది.
మానవ చర్యల వల్ల 10 లక్షలకు పైగా జీవజాతులు అంతరించే ప్రమాదంలో ఉన్నాయి. ప్రకృతిలోకి అతిగా చొరబడటం వల్ల జూనిటిక్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. కొవిడ్_19, సార్స్, ఎబోలా ఇందుకు ఉదాహరణలు. అయితే ఈ జనాభా పెరుగుదలను నియంత్రించాలంటే 'ఒకరు ముద్దు. ఇద్దరు వద్దు' అనే నినాదాన్ని నిక్కచ్చిగా అమలులో పెట్టడమే ఉత్తమ మార్గం.
0 Comments:
Post a Comment