Winter Season: శీతాకాలంలో పిల్లలకు అనారోగ్య సమస్యలు.. ఈ సూచనలతో చెక్ పెట్టేయండి..
శీతాకాలం(Winter) వచ్చిందంటే ఇటు పెద్దలకు, అటు పిల్లలకు కూడా అనారోగ్యాలు సమస్యలు తప్పవు.
పిల్లలకు జలుబు, దగ్గు(Cough), గొంతు వాపు, చెవి నొప్పుల్లాంటివి సర్వ సాధారణంగా వచ్చేస్తుంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు, అనారోగ్యాల నుంచి కాపాడేందుకు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అలాంటి కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సరైన నిద్ర అవసరం
రోగ నిరోధక వ్యవస్థపై నిద్ర చాలా ప్రభావం చూపుతుంది. నిద్ర సక్రమంగా లేకపోతే అది పిల్లల ఫిజికల్, మెంటల్ హెల్త్‌లపై ప్రభావం చూపిస్తుంది. హార్ట్ రేట్, శరీర ఉష్ణోగ్రతలు, ల్యుకోసైట్, సైటోకైన్ ఉత్పత్తిపైనా ప్రభావం కనిపిస్తుంది. అన్నింటికీ మించి రోగ నిరోధక శక్తి బలహీనం అవుతుంది. దీంతో పిల్లల్లో బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం పెరుగుతుంది. కాబట్టి పిల్లలు తగినంత సమయం నిద్ర పోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
తగినంత నీరు అవసరం
చలి కాలంలో ఎవరూ మంచి నీళ్లు తాగడంపై దృష్టి పెట్టరు. కానీ ఈ కాలంలో తగినంత లిక్విడ్‌లు తీసుకోవడం ఎంతో ముఖ్యం. పరిసరాల్లో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత పెరిగి డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. పిల్లలు దాహం వేసి నీరు తాగకపోయినా గుర్తుంచుకుని వారికి మంచి నీటిని తాగించాలి.
సమతుల ఆహారం
ఈ కాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే బ్యాలెన్స్‌డ్ డైట్ ఎంతో ముఖ్యం. పిల్లలు తీసుకొనే ఆహార పదార్థాలపై వారి రోగనిరోధక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. మంచి డైట్ ద్వారానే మంచి ఆరోగ్యం అనే విషయాన్ని గుర్తించాలి. ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు, మసాలాలను చేర్చాలి.
డ్రస్సింగ్ బాగుండాలి
పిల్లల తల, చెస్ట్‌ని దుస్తులు పూర్తిగా కప్పి ఉండేలా జాగ్రత్త పడాలి. ఒంటి నుంచి బయటకి వెళ్లే వేడిలో 30 శాతం తలలోంచే బయటకు వెళుతుంది. అందువల్ల తలను కవర్ చేయడం తప్పనిసరి. పొడవు చేతులు ఉన్న టాప్, ప్యాంట్లు వేయడం శ్రేయస్కరం.
చక్కెర తగ్గించాలి
సెలవులు, వేడుకల్లో పిల్లలు తీపి పదార్థాల్ని ఎక్కువగా తినేస్తుంటారు. ఈ కాలంలో వాటిని కొంచెం తగ్గించడం మంచిది. ఇవి రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇన్ఫ్లమేషన్లను పెంచుతాయి. ఎక్కువగా తీపి పదార్థాలు తినే పిల్లలకు తేలికగా జలుబు, ఫ్లూ లాంటివి వచ్చే అవకాశాలుంటాయి. అందువల్ల ఇవి ఇవ్వడం తప్పకుండా తగ్గించాలి.
శుభ్రత ప్రధానం
పిల్లల దుస్తులు, సాక్సులు, బొమ్మలు, స్కూల్ బ్యాగ్లలాంటివి శుభ్రంగా పొడిగా ఉండాలి. చుట్టు పక్కల వాతావరణాన్ని శుభ్రంగా ఉంచాలి. చలి వాతావరణంలో పిల్లలు ఎక్కువగా ఇంటి లోపల గడిపేందుకే ఇష్టపడతారు. అందు వల్ల ఇంట్లో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటిని క్రమం తప్పకుండా డిసిన్ఫెక్ట్ చేయడం మంచిది. ఇంట్లో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందు వల్ల ఇంట్లో పొడి వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
0 Comments:
Post a Comment