Meteorological Department: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందనీ, దీని కారణంగా తుఫాను సంభవించే అవకాశముందని వాతావరణ విభాగం అధికారులు పేర్కొంటున్నారు.
అలాగే, నవంబర్ 25 నాటికి నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చునని అంచనా వేస్తున్నారు.
వివరాల్లోకెల్తే.. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 19 న దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలపై అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశకు ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. "ఈ వ్యవస్థ తుఫానుగా మారుతుందో లేదో చెప్పడం ప్రస్తుత పరిస్థితులతో ఒక నిర్ణయానికి రాలేము.. " అని రాష్ట్ర ఐఎండి డైరెక్టర్ స్టెల్లా ఎస్ అన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావంతో శుక్రవారం నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ తీరం దాటే వరకు శ్రీలంక, తమిళనాడుపై సముద్ర పరిస్థితులు కఠినంగా ఉంటాయని కూడా వాతావరణ విభాగం అధికారులు పేర్కొంటున్నారు.
ఈ వ్యవస్థ తీరం దాటే వరకు శ్రీలంక, తమిళనాడులో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొంటున్న వాతావరణ అధికారులు.. మత్స్యకారులను హెచ్చరిస్తున్నారు. నవంబర్ 25 నాటికి నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. అయితే, దాని ట్రాక్, తీవ్రతను ఇప్పుడే అంచనా వేయడం కష్టమని తెలిపింది. నెల్లూరు జిల్లాలో నవంబర్ 19, 21 మధ్య ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే సూచనల దృష్ట్యా నెల్లూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే ప్రజలు సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 1077 కు కాల్ చేయాలని కోరారు.
ఈ మూడు రోజుల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. నవంబర్ 10 నుంచి 15వ తేదీ మధ్య కురిసిన భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలమై సాధారణ స్థితికి చేరుకున్న సంగతి తెలిసిందే. జిల్లాలో దాదాపు 28 మండలాల్లో సగటున 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, భారీ వర్షాల కారణంగా జిల్లాలోని దాదాపు అన్ని చెరువులు నిండాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచన ప్రకారం, బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన లోతైన అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో మళ్లీ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తర, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పడిపోయినప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వర్షపాతం అంచనా..
అండమాన్ నికోబార్ దీవులలో నవంబర్ 17 న మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబర్ 17, 18 తేదీల్లో అండమాన్ నికోబార్ దీవులపై గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.
నవంబర్ 20-22 మధ్య కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో నవంబర్ 21, 22 తేదీలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబర్ 21న తమిళనాడు ఉత్తర కోస్తా ప్రాంతాల్లో, నవంబర్ 22న ఉత్తర తమిళనాడులో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ ప్రభావంతో జమ్మూ, కాశ్మీర్, లడఖ్, గిల్గిత్ బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్లలో నవంబర్ 18, 19 తేదీల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా హిమపాతం సంభవించే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది.
0 Comments:
Post a Comment