Vishwanadha puram school story ఊరంతా కలిసి .. 'ఉన్నతం'గా నిలిపారు !
అది నిత్యం కరువు కటాకాలతో అల్లాడుతున్న మారుమూల గ్రామం. అభివృద్ధికి ఆమడ దూరంలో విసిరేసినట్లు ఉంటుంది. ఆ గ్రామ జనాభా సుమారు నాలుగు వేల మంది అయినా వలస కుటుంబాలే ఎక్కువ.
ఉన్నవారంతా చెరుకు, ఇటుక బట్టీల పనులకు వెళ్లి పొట్టపోసుకుంటారు. తమతో పాటు తమ పిల్లల్నీ వెంట తీసుకొనిపోతారు. ఈ క్రమంలో గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను ఎత్తివేయాలని ఆదేశాలు వచ్చాయి. దాంతో అప్రమత్తం అయిన ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులూ సమిష్టి కృషితో ఇంటింటికి తిరిగి పిల్లల సంఖ్య పెంచారు. దాతల సహాయంతో ప్రాథమికోతన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలగా మార్చుకోగలిగారు. నూతన టెక్నాలజీ, సౌకర్యాలను ఈ పాఠశాల విద్యార్థులకు విద్యాబోధన అందిస్తోంది.
ప్రత్యేక శ్రద్ధ కనబరిచి...
స్కూలు మరొక ఊరుకు తరలిపోతుందన్న ఆలోచనతో ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్‌కు నిద్ర పట్టలేదు. గిరిజన కుటుంబాలకు చెందిన పిల్లల పరిస్థితి ఏంటి? ఆలోచించారు. తోటి టీచర్లతో చర్చలు జరిపారు. పాఠశాల్లో పిల్లల సంఖ్య పెరిగేలా ప్రణాళిక రూపొందించారు. వీరంతా యువ టీచర్లు కావడంతో రాజేశేఖర్‌కు సహకరించేందుకు ముందుకు వచ్చారు. బృందం మొత్తం కలిసి ఊరంతా తిరిగారు. సర్పంచ్‌తో మాట్లాడారు. గ్రామస్తులతో సమావేశం వేశారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడం మన బాధ్యత అని సందేశం ఇచ్చారు. సాయంత్రం వేళల్లో ఇల్లిల్లు తిరుగుతూ ఎందుకు ప్రయివేటు స్కూలుకు పంపుతున్నారో తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం విశ్వనాధపురం గ్రామంలో యుపి పాఠశాల ఉంది. ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఏడో తరగతి వరకూ విద్యాబోధన చేస్తున్నారు. ఆ ఊరికి చెందిన కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను త్రిపురాంతకం, యర్రగొండపాలెం, కుంట ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తారు. ఆ ఊరికి ప్రయివేటు స్కూలు బస్సులు వస్తున్నాయి. ఊరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పేద, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు వంది మంది వస్తున్నారు. ఏడో తరగతిలో11 మందే ఉన్నారు. ఉపాధ్యాయుల కొరత ఉన్నా ఉన్న వారే అన్ని సబ్జెక్టులూ బోధిస్తూ విద్యార్థుల ఉన్నతికి పాటుపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల్లో పిల్లల శాతం చాలా తక్కువగా ఉందంటూ పాఠశాల మూసేయాలని ఉన్నత అధికారులు ఒత్తిడి చేయసాగారు. దీంతో, ఎలాగైనా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించాలని, విద్యార్థులకు ప్రాథమిక విద్యను దూరం కాకుండా చేయాలని ఎంఈవో తులసి మల్లిఖార్జున నాయక్ స్కూలు హెడ్ మాస్టారు కట్టా రాజశేఖర్‌కు... సూచించారు.
ఇంగ్లీషులో క్లాసులు
విద్యార్థులకు పాఠాలతో పాటు స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు నిర్వహించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఇంగ్లీషులో మాట్లాడేలా ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ప్రతి సబ్జెక్టులోనూ వారంలో ఒకసారి స్లిప్‌టెస్టులు నిర్వహించి, మెయిన్ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చేలా విద్యార్థులను ప్రోత్సహించారు. నెలలో ఒకసారి పేరెంట్స్ మీటింగ్ పెట్టి, పిల్లల ఆలోచనలు, వారి అభిరుచులు గురించి వివరించడం, ఇంటి దగ్గర ఎలా చదివించాలో, హోం వర్క్ ఎలా చేయించాలో సూచించేవారు. వెనకబడిన పిల్లలకు మూడు గంటల పాటు అదనంగా క్లాసులు నిర్వహించారు. ఏ క్లాసులో ఏఏ సబ్జెక్టులో పిల్లలు వెనకబడుతున్నారో గుర్తించి, వారికి ఓర్పుతో ఆ పాఠాలను మళ్లీ వివరంగా చెప్పేవారు. బట్టీ విధానాన్ని మాన్పించారు. సైన్సు పాఠాలను ప్రయోగాత్మంగా వివరించారు. మూడు నెలలకోసారి క్షేత్ర పర్యటనలకు బయటకు తీసుకెళ్లారు. దాంతో మూడు నెలల్లో పిల్లల చదువులో, ప్రవర్తనలో మెరుగుదల కనిపించింది. ప్రయివేటు స్కూలు పిల్లలతో సమానంగా ఇంగ్లీషులో మాట్లాడసాగారు. గ్రామంలోని తల్లిదండ్రుల ఆలోచనల్లోనూ మార్పు వచ్చింది. 'టీచర్లు పాఠాలు బాగా చెబుతున్నారు' అని ఊరంతా అనుకున్నారు. ఉపాధ్యాయలు కూడా తమ పిల్లల్ని అదే పాఠశాలలో చేర్చారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేటు స్కూళ్లకు పంపటం మాన్పించి, ప్రభుత్వ పాఠశాలలో చేర్చారు. స్కూలు మానుకుని పనులకు, ఇళ్ల దగ్గర ఉంటున్న పిల్లలు సైతం బడిబాట పట్టారు. ఒకప్పుడు 113 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య ఇప్పుడు 282కి చేరింది. దాంతో ఈ సంవత్సరం పదో తరగతి వరకూ స్కూలు అప్ గ్రేడ్ అయింది. తరగతులు తరలిపోకుండా తమ వంతు కృషి చేసిన టీచర్లను ఎంఈవో తులసి మల్లికార్జున అభినందించారు.
గ్రామస్తులంతా ఏకమై ...
' ప్రభుత్వ పాఠశాల్లో టీచర్లందరూ పిల్లలకు పాఠాలు బాగా చెబుతున్నారు. ప్రయివేటు స్కూళ్లకు వేలకు వేలు ఫీజులు కట్టి బాగుచేయడం ఎందుకు?' అనుకున్నారు గ్రామస్తులు. అదే డబ్బుతో మన పాఠశాలను మనమే అభివృద్ధి చేసుకుందాం. ప్రభుత్వ పాఠశాలను నిలుపుకుందాం అనుకున్నారు. సర్పంచ్ శేషం మాధవీ లత ఆధ్వర్యంలో గ్రామస్తులంతా కలిసి రూ. 8 లక్షలు విరాళాలు సేకరించారు. దాంతో 32.50 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. గ్రామస్తులైన గడిమెట్ల బాల రంగయ్య, గాలెయ్య, శేషం రంగయ్య, గల్లా రాములు ముందుకు వచ్చి 1.50 ఎకరాల స్థలాన్ని దానంగా ఇచ్చారు. పిల్లలు అంతా కలిసి కూర్చునేలా షెడ్, వంటగది, అదనపు తరగతి గదులు, డయాస్, నిర్మించారు. విద్యా కమిటీి చైర్మన్ దాసరి వీరనారాయణ భోజనశాల సౌకర్యం కల్పించారు.
నాడు నేడు ద్వారా..
నాడు నేడు ద్వారా మంత్రి సురేష్ సహకారంతో అదనపు గదులు, ప్రహరీ గోడ నిర్మించారు. ఆర్వో ప్లాంట్, టివి, కంప్యూటర్ వంటి అధునాతన సౌకర్యాలు కల్పించారు. శేషం రంగబాబు పాఠశాల ముఖద్వారాన్ని నిర్మించారు. ఉపాధ్యాయులు కూడా స్కూలు కోసం విరాళాలు ఇచ్చారు. సిహెచ్ ఏడు కొండలు రూ. 50 వేలతో కటాంజనం సౌకర్యం కల్పించారు. కటికి శంకర్ రూ. 50 వేలతో రేకుల షెడ్డు నిర్మించారు. శేషం రంగారావు గ్రామస్తులను ఏకం చేసి ఉపాధ్యాయులను ఉత్తేజ పరుస్తూ స్కూలు అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించారు. ఊరందరూ కలిసి ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా తీర్చిద్దుకున్నారు. ఆ కృషి ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.
- రాజా రామయ్య,
త్రిపురాంతకం విలేకరి
0 Comments:
Post a Comment