UPI యాప్ ద్వారా ATM నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోండిలా..
స్నేహితులకు డబ్బు పంపించాలన్నా, బిల్లు చెల్లించాలన్నా, ఆన్లైన్, ఆఫ్‌లైన్ కొనుగోళ్ల చెల్లింపులు.. ఇలా చాలా వరకు లావాదేవీలు యూనిఫైట్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా సులభంగా చేసేస్తున్నాం.
దీంతో చాలా వాటికి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోతోంది. అలాగని నగదు లేకుండా అన్ని చోట్లా పని జరగదు. అలాంటప్పుడు ATM నుంచి నగదు విత్‌డ్రా చేయాల్సిందే. కాబట్టి డెబిట్ కార్డు చేతిలో ఉండాల్సిందే. కానీ యూపీఐ ద్వారా ATM నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని తెలుసా? డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేకపోయినా గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే వంటి యూపీఐ యాప్‌ల ద్వారా డబ్బు తీసుకోవచ్చని తెలుసా? అదెలాగో చూద్దాం..
కార్డు రహిత నగదు విత్‌డ్రాలను అందుబాటులో ఉంచేందుకు గతంలోనే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ విధానాన్ని ప్రతిపాదించింది. ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇంటరాపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా (ICCW) ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది యూపీఐ ద్వారా ఏటీంఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతిస్తుంది. దీనివల్ల కార్డు స్కిమ్మింగ్, క్లోనింగ్ వంటి మోసాలను నివారించవచ్చని ఆర్బీఐ తెలిపింది. అయితే, కార్డు లేకుండా యూపీఐ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోగల సదుపాయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్( PNB) వంటి కొన్ని బ్యాంకులు మాత్రమే అందిస్తున్నాయి.
యూపీఐ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునే విధానం..
ఇందుకోసం మీ ఫోన్లో ఏదైనా యూపీఐ యాప్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. యాప్ మీ బ్యాంకు ఖాతాతో అనుసంధానించి ఉండాలి. మీ ఫోన్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
యూపీఐ సేవలు అందుబాటులో ఉన్న ఏటీఎం సెంటర్‌కు వెళ్లాలి.
నగదు విత్‌డ్రాను ఎంపిక చేసుకుని స్క్రీన్‌పై కనిపించే యూపీఐ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఆ తర్వాత స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.
ఇప్పుడు మీ ఫోన్లో ఉన్న యూపీఐ (గూగుల్ పే, ఫోన్‌పే, భీమ్, పేటీఎం) యాప్‌లో క్యూఆర్ కోడ్ స్కానర్‌ను యాక్టివేట్ చేసి, ఏటీఎం స్క్రీన్‌పై కనిపిస్తున్న కోడ్‌ను స్కాన్ చేయాలి.
కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత కావాల్సిన మొత్తాన్ని(ఒక లావాదేవీలో రూ. 5000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు) ఎంటర్ చేసి, ప్రొసీడ్‌పై క్లిక్ చేసి యూపీఐ పిన్ నంబర్‌ను ఎంటర్ చేసి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
0 Comments:
Post a Comment