మన దేశంలో ఒక్కో ప్రాంత ప్రజల నమ్మకాలు ఒక్కోలా ఉంటాయి. కొంతమంది ఎంత పెద్ద చదువులు చదువుకున్నా, తమ మూలాలను మర్చిపోరు.
పెద్ద ఉద్యోగాలు చేసేవారు కూడా సంప్రదాయాలు, నమ్మకాల విషయంలో కఠినంగా ఉంటారు. ఈ కోవకే చెందుతాడు కర్ణాటక(Karnataka)కు చెందిన ఒక టెక్కీ. అతడు ఒక ఎద్దును దేవాలయానికి సమర్పించడానికి దాదాపు 300 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాడు.
సుమారు 36 రోజుల పాటు ఎద్దుతో కలిపి ప్రయాణిస్తూ, మధ్యలో ల్యాప్టాప్ ఓపెన్ చేసి జాబ్ చేశాడు. ఇలా సాగిన టెకీ, ఎద్దు ప్రయాణం.. ఎమోషనల్గా ముగిసింది.. ఆ యాత్ర వెనుక ఆసక్తికరమైన విషయాలు ఇవే.
* ఎప్పటి నుంచో కల
చిక్కమగళూరు జిల్లా హొరనాడుకు చెందిన శ్రీయంషా కెడి(32) బెంగళూరు (Bengaluru)లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతనికి ఎప్పటి నుంచో పశువులు అంటే ఇష్టం.
ఏదో ఒక రోజు గిర్ జాతి ఆవును సొంతం చేసుకోవాలని అనుకునేవాడు. చివరికి ఐదు సంవత్సరాల ఆవు, దూడను కొనుగోలు చేశాడు. వాటిని గుజరాత్ నుంచి రైలులో తరలించగా దొడ్డబళ్లాపూర్లో శ్రీయంషా స్వాధీనం చేసుకున్నారు.
అతను భార్యతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ఇంటి పక్కనే ఖాళీగా ఉన్న సైట్ అద్దెకు లభించడంతో.. ఆవును పెంచుకోవాలనే అతని కల నిజమైంది. ఆవు, దూడ కోసం రూ.1 లక్ష 9 వేలు చెల్లించారు.
* ఆహారం, నెట్వర్క్ లభించేలా రూట్ ప్లాన్
ఆవుకు పార్వతి, దూడకు భీష్మ అని పేరు పెట్టారు. 2020లో వాటిని బెంగళూరుకు తీసుకొచ్చినప్పుడు భీష్మ 4 రోజుల దూడ. శ్రీయంష అప్పటికే ధర్మస్థలలోని మంజునాథ స్వామికి ఆవు మొదటి దూడను కానుకగా ఇస్తానని మొక్కుకొని ఉన్నారు.
దీంతో ఇప్పుడు 1 సంవత్సరం 10 నెలలున్న భీష్మను ఆలయానికి అందజేసేందుకు నిశ్చయించుకున్నారు. ఇందుకు కాలినడకన 300 కిలోమీటర్ల ప్రయాణాన్ని ప్రారంభించారు.
దారిలో భీష్మకు ఆహారానికి ఇబ్బంది లేకుండా గ్రామాల మీదుగా ప్రయాణించేలా రూట్ ప్లాన్ చేశారు. తాను వర్క్ చేసుకునేందుకు ఇంటర్నెట్ ఇబ్బంది లేకుండా శ్రీయంష ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
* ప్రయాణంలో రైతుల సాయం
తన ప్రయాణం గురించి న్యూస్18తో శ్రీయంష మాట్లాడారు. అక్టోబర్ 2, ఆదివారం నడక ప్రారంభించినట్లు చెప్పారు. బన్నెరఘట్ట, కనకపుర రోడ్డు, బిడాడి, దొడ్డలదామర, తిప్పగొండనహళ్లి, మాగాడిరోడ్డు, హులియూర్దుర్గ, నాగమంగళ, కంబదహళ్లి, శ్రావణబెళగొళ, చన్నరాయపట్నం, హాసన్, బేలూరు, ముదిగెరె, కొట్టిగెహర, చార్మాడి మీదుగా నవంబర్ 6న ధర్మస్థలకు చేరుకున్నారు.
మార్గంలో ఏ ఇబ్బందులూ ఎదురుకాలేదని, ఆయా గ్రామాల ప్రజలు చేసిన సాయం మరచిపోలేనని పేర్కొన్నారు. దారిపొడవునా పొలాల్లో పని చేసుకుంటున్న రైతులు భీష్మకు ఆహారం ఇచ్చేందుకు ముందుకొచ్చారని తెలిపారు.
తమ ఇళ్లకు పిలిచి భోజనం పెట్టి బస కల్పించారని అన్నారు. ప్రతిచోటా జియో నెట్వర్క్ చాలా బాగుందని, పని చేసుకొనే అవకాశం లభించిందని చెప్పారు.
నవంబర్ 6న ధర్మస్థలికి చేరుకున్నామని, ఆ రోజు విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ఉదయం గుడికి వెళ్లామని, ఈ పర్యటన గురించి తెలుసుకున్న శ్రీ మంజునాథ ఆలయ నిర్వాహకుడు (ధర్మాధికారి) శ్రీ వీరేంద్ర హెగ్గడే స్వాగతం పలికారని తెలిపారు.
ఆ తర్వాత అధికారికంగా భీష్మను ఆలయానికి అప్పగించామన్నారు. వారంపాటు ధర్మస్థలలో ఉండి, ప్రతిరోజూ గోశాల వద్దకు వెళ్లేవాడినని, రెండో రోజు భీష్మ బాధపడటం చూశానని వివరించారు.
'నన్ను చూసి భీష్మ కన్నీళ్లు పెట్టుకోవడం స్పష్టంగా గమనించాను, అది మా ఇద్దరికీ ఎమోషనల్ మూమెంట్' అని తెలిపారు.
0 Comments:
Post a Comment