Tamilnadu: మన జీవితంలో తల్లిదండ్రుల స్థానం ఎప్పటికీ ఉన్నతమే. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడి మనల్ని పెద్ద చేయడానికి వారు ఎంతో కష్టపడుతుంటారు.
అలాంటి తల్లిదండ్రులు ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఆ లోటు ఎవ్వరూ తీర్చలేరు. అలా లేని వారికి సంబంధించిన జ్ఞాపకాలు ఏమైనా ఉంటే వాటిని ఎంతో అపురూపంగా పదిలపరుచుకుంటాం.
అందుకే ఓ వ్యక్తి 56 ఏళ్ల వయసులోనూ తన తండ్రి సమాధిని(Father grave) వెతుక్కుంటూ ఏకంగా మలేషియా(Malaysia) వరకూ వెళ్లాడు. తనకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు చనిపోయిన తండ్రి జ్ఞాపకాన్ని వెతికి పట్టకుని, చివరికి ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. ఆ వ్యక్తి ఆసక్తికర ప్రయాణం గురించి చదివేయండి.
తమిళనాడు(Tamilnadu)కు చెందిన తిరుమారన్ అనే వ్యక్తికి ఇప్పుడు యాభై ఆరేళ్లు. రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లా వెంకడంపట్టి గ్రామంలో ఉంటున్న ఈ యాక్టివిస్ట్‌కు తండ్రి ఎలా ఉంటారో తెలియదు.
ఎందుకంటే ఆయనకు ఆరు నెలల వయసున్నప్పుడే తండ్రి కె. రామ సుందరం అలియాస్ పూంగుంట్రాన్ మలేషియాలో మరణించారు. తిరుమారన్ పుట్టేనాటికి రామసుందరం మలేషియాలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. చనిపోయేనాటికి ఆయన వయసు 37 సంవత్సరాలు.
1967లో తీవ్ర అనారోగ్యంతో మరణించారు. దీంతో అమ్మ రాధాభాయ్ ఆయనను అక్కడ పాతిపెట్టి సమాధి చేశారు. పసివాడైన తిరుమారన్‌ని తీసుకుని తిరిగి భారత దేశానికి వచ్చేశారు. ఆమె కూడా మరణించి ఇప్పటికి 35 సంవత్సరాలు అయింది.
తన తండ్రి సమాధి గురించి తాను ఎలా సెర్చ్ చేశానో తిరుమారన్ ఇలా చెప్పుకొచ్చారు. 'నాకు నా తండ్రి సమాధిని వెతికి పట్టుకోవాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. ఆయన మలేషియాలో కెర్లింగ్‌లో... కెర్లింగ్ తొట్టా థెసియా వాకై తమిళ్ పల్లి అనే స్కూల్‌లో పని చేసేవారని నాకు తెలుసు.
అంతకంటే నా దగ్గర పెద్దగా ఆధారాలు ఏమీ లేవు. ఆ పాఠశాల పేరును గూగుల్‌లో సెర్చ్ చేసి వెతికాను. ఆ క్రమంలో నా తండ్రికి సంబంధించిన కొంత సమాచారం దొరికింది. ప్రస్తుతం ఆ స్కూలు ప్రిన్సిపల్ చిదంబరం ఈమెయిల్ అడ్రస్ సంపాదించాను.
ఆయన ద్వారా, ప్రస్తుతం 80ల్లో వయసు ఉన్న మా నాన్న ఓల్డ్ స్టూడెంట్స్ మోహనరావు, నాగప్పన్‌లతో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ కెర్లింగ్‌లోని మా నాన్న సమాధిని గుర్తించి నాకు సమాచారం అందించారు.' అని వివరించారు.
మొత్తానికి నేను నవంబర్ 8న మలేషియాకు వెళ్లాను. పొదల్లో దాగి ఉన్న మా నాన్న సమాధిని చూశాను. ఏదేమైనా ఆయన జ్ఞాపకాన్ని చివరికి చూడగలిగాను. అది చాలా పాతది అయిపోయింది.
అయినప్పటికీ సమాధి ఫలకం మీద మా నాన్న చిత్రం, పేరు, జనన మరణ తేదీలు అన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. వాటిని సరిచూసుకుని నాన్న సమాధి దగ్గర చాలా సార్లు ప్రార్థనలు చేశాను. సమాధిని గుర్తించడంలో సాయపడిన నాగప్పన్, ఇతర ఓల్డ్ స్టూడెంట్స్ కూడా మా నాన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
తమను ఇలా తీర్చిదిద్దడంలో రామ సుందరం మాస్టారి పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ జ్ఞాపకాలన్నింటినీ పోగేసుకుని నేను నవంబర్ 16న తిరిగి భారత్‌కు బయలుదేరాను' అంటూ తన ప్రయాణ వివరాలను చెప్పుకొచ్చారు తిరుమారన్.
తల్లిదండ్రల్ని కోల్పోయిన తనకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసని తిరుమారన్ అంటున్నారు. అందుకే తానిప్పుడు తమిళనాడులో అనాథ శరణాలయం నడుపుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 60 మంది అనాథలకు పెళ్లిళ్లు చేశానని, 100మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించానని తెలిపారు.
0 Comments:
Post a Comment