Tamilisai Versus TS Government: రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్.. తమిళి సై కామెంట్స్‌తో ముదిరిన వివాదం.. కేసీఆర్ స్పందిస్తారా ?
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై (Tamili Sai)సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందని.. తన ప్రైవసీకి భంగం కలుగుతోందని వ్యాఖ్యానించారు.
దీంతో తెలంగాణలో కొంతకాలం నుంచి గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న గ్యాప్ మరింత పెరిగినట్టు కనిపిస్తోంది. గతంలో తన ఏడీసీగా పని చేసిన తుషార్‌ను ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో టార్గెట్ చేయడం.. ఈ క్రమంలో రాజ్ భవన్(Raj Bhavan) పేరును కూడా ప్రస్తావించడాన్ని గవర్నర్ తమిళిసై తీవ్రంగా తప్పుబట్టారు. తాను ఎవరొచ్చినా చర్చిస్తానని.. తలుపులు మూసి ఉంచేందుకు రాజ్ భవన్ ప్రగతి భవన్ కాదంటూ పరోక్షంగా కేసీఆర్‌ను (KCR) టార్గెట్ చేశారు. గతంలోనూ తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ పరోక్షంగా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ఆమె తెలంగాణ ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టడం సంచలనం సృష్టిస్తోంది.
బిల్లుల్ని తానే ఆపానని తప్పుగా ప్రచారం చేస్తున్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఒక్కో బిల్లును కూలంకషంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుకే తొలి ప్రాధాన్యత ఇచ్చానని అన్నారు. కొత్త రిక్రూట్'మెంట్ బోర్డు అంశంలో క్లారిటీ కావాలని అడిగానని వివరించారు. దానికి నేనేదో బిల్లును ఆపానని ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు.
కొత్తగా రిక్రూట్'మెంట్ బోర్డు ఎందుకని ఆమె ప్రశ్నించారు. కొత్తగా రిక్రూట్‌మెంట్ బోర్డు పెడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్నది తన సందేహమని అన్నారు. తెలంగాణకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే తాను క్లారిఫికేషన్ అడిగానని అన్నారు. ఈ విషయంలో మంత్రి అవగాహన లేకుండా మాట్లాడారని కామెంట్ చేశారు. యూనివర్సిటీల పరిస్థితులు కళ్లారా చూశానని అన్నారు.
యూనివర్సిటీ మెస్‌లలో తినడానికి తిండి లేదని చెప్పుకొచ్చారు. అక్కడి పరిస్థితులను ప్రభుత్వం మెరుగుపరచాలని సూచించారు. బిల్లును సమగ్రంగా పరిశీలించేందుకే సమయం తీసుకున్నానని అన్నారు. ఫామ్ హౌస్ కేసులోనూ రాజ్ భవన్‌ను లాగాలని చూశారని ఆరోపించారు. తుషార్ గతంలో నా ఏడీసీగా పని చేశారని.. తుషార్ పేరును ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారని అన్నారు. ఆయన తన ఏడీసీగా పని చేసినంత మాత్రానా రాజ్ భవన్‌ను ఈ కేసులోకి లాగుతారా ? అని ప్రశ్నించారు.
అయితే గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ ముఖ్యనేతలు లేదా సీఎం కేసీఆర్ కౌంటర్ ఇస్తారా ? అనే చర్చ జరుగుతోంది. పరిస్థితి ఇంతవరకు వచ్చిన తరువాత కేసీఆర్ తనదైన శైలిలో స్పందిస్తేనే అసలేం జరుగుతోందనే అంశాలపై ప్రజలకు కూడా క్లారిటీ వస్తుందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ఏ విషయంలో అయినా వ్యూహాత్మకంగా వ్యవహరించే కేసీఆర్.. ఈ విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
0 Comments:
Post a Comment