ఆరోగ్యకరమైన ఆహారం జాబితాలో తప్పనిసరిగా చేర్చవలసినవి మొలకలు. వివిధ రకాల ధాన్యాలను మొలకలుగా ఆహారంలో జోడించడం ఆరోగ్య సంరక్షణలో భాగం. ముఖ్యంగా పెసర మొలకల్లో తక్కువ కేలరీలు, ఫైబర్, విటమిన్ బి, సి, కె పుష్కలంగా ఉంటాయి.
బరువు తగ్గడానికి సహాయపడతాయి. ప్రతిరోజు ఈ మొలకలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం..
సమృద్ధిగా కె, సి విటమిన్లు : రక్తం గడ్డకట్టే ప్రక్రియకు విటమిన్ కె అవసరం. ఇది ఎముక ఖనిజీకరణనూ నియంత్రిస్తుంది. ఎముక సాంద్రతను పెంచుతుంది. పెసర మొలకలు రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి కె మిటమిన్ సమృద్ధిగా అందుతుంది.
అధికంగా ఉండే విటమిన్ సి అంటువ్యాధులు, సాధారణ జబ్బులతో పోరాడడంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఒక కప్పు పెసర మొలకల ద్వారా 14 మిల్లీ గ్రాముల విటమిన్ సి శరీరానికి సులువుగా అందించవచ్చు.
ప్రోటీన్ల గని : గ్లోబులిన్, అల్బుమిన్ అనే ప్రధాన ప్రోటీన్లు పెసర మొలకల్లోని అమైనో ఆమ్లాల్లో 85 శాతానికి పైగా ఉన్నాయి. కణజాలాలను నిర్మించడానికి, మరమ్మతు చేయడానికి ప్రోటీన్ చాలా ముఖ్యం.
ఎముకలు, కండరాలు, మృదులాస్థి, చర్మం, రక్తం మొదలైన వాటి నిర్మాణంలో ప్రాధాన్యత వహించే ప్రోటీన్లను పెసర మొలకల ద్వారా పొందవచ్చు.
రక్త ప్రసరణకు : వీటిలోని ఐరన్, కాపర్ ఎర్ర రక్తకణాల సంఖ్యను, రక్త ప్రసరణను పెంచడంలో దోహదం చేస్తాయి. వివిధ అవయవాలు, కణాల పనితీరును నియంత్రణ చేయడానికి ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఇది మరింత సహాయపడతాయి.
జీర్ణక్రియకు : ఈ మొలకలు జీవన ఎంజైమ్‌లను అధిక స్థాయిలో కలిగి ఉంటాయి. ఇవి జీవక్రియ ప్రక్రియలను పెంచడంలో, శరీరంలో రసాయన ప్రతిచర్యలను మెరుగుపరచడంలో మరింత సహాయపడతాయి.
ప్రత్యేకంగా జీర్ణక్రియకు సంబంధించి ఎంజైమ్‌లు ఆహారాన్ని సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడానికి, జీర్ణవ్యవస్థ ద్వారా పోషకాలను గ్రహించడానికి సహాయపడతాయి.
బరువు తగ్గడంలో : పెసర మొలకలు అధిక పోషకాలను, తక్కువ కేలరీలను కలిగివుంటాయి. అంటే బరువు పెరుగుతామనే భయం అవసరం లేకుండా పెసర మొలకలు తినవచ్చు.
వీటిలో అధిక మొత్తంలో ఫైబర్ ఉండడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది. ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ గ్రెలిన్ విడుదలను నిరోధిస్తుంది.
విటమిన్లు, ఖనిజాలు : ప్రతిరోజూ ఒక కప్పు పెసర మొలకలు తీసుకుంటే మన శరీరానికి అవసరమైన ఫోలేట్ వంద శాతం అందుతుంది. ఫోలేట్‌ను విటమిన్ బి9 అని కూడా పిలుస్తారు.
ఇది కణ, కణజాల పెరుగుదల, హార్మోన్ల సమతుల్యత, పునరుత్పత్తికి ముఖ్యమైన విటమిన్. మహిళలు గర్భధారణ సమయంలో తగినంత ఫోలేట్ తీసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి పెసర మొలకలు తీసుకోవడం ఎంతో మంచిది. మహిళకు అవసరమైన రోజువారీ మెగ్నీషియంను 36 శాతం పెసర మొలకలు అందించగలవు.
0 Comments:
Post a Comment