గ్రహణ సమయంలో ఇంట్లో వస్తువులపై దర్భ ఎందుకు ఉంచుతారు ?- మారుపాక కృష్ణమూర్తి, గంభీరావుపేట
పవిత్రమైన దర్భకు దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉంటుందని నమ్ముతారు. మహావిష్ణువు అవతారమైన వరాహమూర్తి శరీర కేశాలే దర్భలుగా ఆవిర్భవించాయని వరాహ పురాణం చెబుతున్నది. అందుకే పవిత్రమైన దర్భను శ్రీమహావిష్ణువు రూపంగా భావిస్తారు.
ఏటా భాద్రపద మాసంలో దర్భాష్టమి సందర్భంగా వీటికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. దర్భలు మంత్రాలను శక్తిమంతం చేస్తాయని మన పూర్వికులు విశ్వసించేవారు. అంతేకాదు దర్భలు హానికారక కిరణాలను, తరంగాలను అడ్డుకుంటాయని పలు పరిశోధనల్లోనూ వెల్లడైంది.
సూర్య, చంద్ర గ్రహణ సమయాల్లో హాని కలిగించే కిరణాలు కొన్ని భూమి మీదికి ప్రసారం అవుతుంటాయి. అలాంటి కిరణాల తీవ్రతను దర్భలు అడ్డుకుంటాయని ధర్మశాస్ర్తాలు చెపుతున్నాయి.
ఈ కారణంగా గ్రహణ సమయంలో జలపాత్రలు, ఇతర వస్తువులపై దర్భను ఉంచాలనే విశ్వాసం ఏర్పడింది. అంతేకాదు, దర్భ అతిసార మొదలైన వ్యాధులకు ఔషధంగానూ ఉపయోగపడుతుందని అథర్వణ వేదం చెబుతున్నది.
దీనిని ఉపయోగించడం వల్ల మనిషిలో సత్తగుణం వృద్ధి చెందుతుందని ధర్మశాస్త్రం చెబుతున్నది. అందుకే, వేదాధ్యయన సమయంలో దర్భతో చేసిన ఉంగరాన్ని పెట్టుకుంటారు.
శ్రాద్ధ విధుల్లోనూ దర్భతో చేసిన పవిత్రను ధరిస్తారు. యజ్ఞయాగాది క్రతువుల్లో హోమకుండం చుట్టూ దర్భలను పరుస్తారు.
0 Comments:
Post a Comment