Smart phone @ Heart Attack - స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడితే గుండెపోటే..
ఖాళీగా ఉన్నాం కదా అని స్మార్ట్ ఫోన్‌లో యూట్యూబ్ వీడియోలు, ఓటీటీ సినిమాలు చూసేవాళ్లు, తరచూ ఆన్ లైన్ బెట్టింగ్, చాటింగ్ చేసేవాళ్లు ఈ విషయం గురించి ముందే తెలుసుకోండి.
లేదంటే గుండె జబ్బుల బారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి చాలా దగ్గర్లోనే ఉందని సాక్షాత్తూ డాక్టర్లే చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్‌లు ఎక్కువగా వాడితే కంటి సమస్యలు వస్తాయని మాత్రమే చాలామందికి తెలుసు. కానీ దాని ప్రభావం కంటితో పాటు శరీర భాగాల్లోని మిగతా అవయవాల మీద కూడా పడి చివరకు గుండెపోటుకి గురయ్యే ప్రమాదం ఉంది.
స్మార్ట్ ఫోన్ ను చేత్తో పట్టుకుని చూసినంత సేపు మెడను అలా బెండ్ చేసి ఉంచడం వల్ల వెన్నుపాముపై ప్రభావం పడుతోంది. ఫలితంగా దీర్ఘకాలిక మెడ, వెన్ను నొప్పుల సమస్యల బాధితులు పెరిగిపోతున్నారు. తాజాగా స్మార్ట్ ఫోన్లతో గుండె ఆరోగ్యానికి కూడా నష్టం కలుగుతుందని కార్డియాలజిస్టులు హెచ్చరించారు. కేరళ కార్డియాలజిస్టుల సొసైటీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఈ అంశంపై వైద్యులు మాట్లాడారు. అధిక ఒత్తిళ్లు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు గుండె జబ్బులకు కారణమవుతున్నట్టు కేరళ కార్డియాలజీ సొసైటీ ప్రెసిడెంట్ ప్రభానాని గుప్తా పేర్కొన్నారు. అధికంగా స్మార్ట్ ఫోన్ ను వినియోగించడం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలతో గుండె జబ్బుల రిస్క్ పెరగడం కొత్త రిస్క్'' అని ఆయన తెలిపారు. కాబట్టి స్మార్ట్ ఫోన్‌ను పరిమిత సమయం పాటు చూడడమే సమస్యకు పరిష్కారమని చెబుతున్నారు.
0 Comments:
Post a Comment