Seetakka అనసూయ ఎలా ఎమ్మెల్యే సీతక్కగా మారింది..!
సీతక్క ఎమ్మెల్యే అయినా కూడా చాలా సింపుల్ గా ఉంటారు.. ఆమె ఎలాంటి ఆడంబరాలకు వెళ్లరు. కరోనా సమయంలో అటవీ ప్రాంతంలో కనీసం టూ వీలర్ కూడా వెళ్లలేని మార్గంలో నడుచుకుంటూ వెళ్లి సీతక్క వెళ్లి ప్రజలకు నిత్యావసర సరుకులు, ఆహారం ఇచ్చారు. కరోనా సమయంలో గిరిజనులకు పట్టెడు అన్నం పెట్టి వారితో కలిసి భోజనం చేసిన ఏకైక ఎమ్మెల్యే సీతక్క అంటే ప్రతి ఒక్కరికి కూడా అభిమానం.
1971, జూలై 9న సమ్మక్క సమ్మయ్య దంపతులకు వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో జన్మించారు దనసారి అనసూయ అలియాస్ సీతక్క. సీతక్క ఏడు సంవత్సరాల వయసులో విద్యాభ్యాసం మొదలు పెట్టారు. 7వ తరగతి నుండి హాస్టల్ లో సీతక్క ఉండేవారు. ఆ సమయంలో పురుగుల అన్నం పెడుతూ అమ్మాయిల ఆరోగ్యంతో ఆడుకుంటున్న వార్డెన్ కు బుద్ది చెప్పాలనే ఉద్దేశ్యంతో సీతక్క ఆందోళన మొదలు పెట్టింది.
ఆ సమయంలో హాస్టల్ వార్డెన్ పై స్నేహితురాళ్ళతో కలిసి తిరగబడింది.
సీతక్క అన్నయ్య మరియు బావ లు పీపుల్స్ వార్ లో ఉండే వారు. హాస్టల్ లో జరుగుతున్న ఆందోళన గురించి వారికి తెలిసి హాస్టల్ వార్డెన్ ను వారు హెచ్చరించారు. అలా సీతక్క మొదటి ఉద్యమం విజయం సాధించి తన తోటి అమ్మాయిలకు మంచి జరిగింది. 1988 జూన్ లో సీతక్క అడవి బాట పట్టారు. నక్సలైట్ ఉద్యమంలో సీతక్క అడుగు పెట్టడం కు మరో ప్రధాన కారణం ఆమె మేన బావ రాము. అతను ముందు నుండే ప్రజా ఉద్యమంలో ఉండటం... అతని భావాల పట్ల ఆకర్షితులు అయ్యి.. అతనంటే ఇష్టం పెరిగి ప్రేమగా మారడంతో రాము కోసం కూడా సీతక్క అడవుల బాట పట్టారు.
మేనబావ పేరు రాము అవ్వడం.. అతడితో పెళ్లి నేపథ్యంలో అనసూయ పేరును అన్నలు సీతక్క గా మార్చారు. నక్సలైట్ ఉద్యమంలో అతి తక్కువ సమయం లోనే మంచి పేరు దక్కించుకుంది. ఉద్యమంలో చేరి ఏడాదికే ఒక కూంబింగ్ ఆపరేషన్ లో పోలీసుల చేతికి సీతక్క మరియు కొందరు ఉద్యమకారులు పట్టుబడ్డారు. జైల్లో ఉన్న సమయంలో పదో తరగతి పూర్తి చేశారు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత మళ్లీ ప్రజా ఉద్యమం వైపు వెళ్లారు. సీతక్క జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మేనబావ రాముతో దళ సభ్యులు వివాహం చేశారు. కొన్నాళ్లకు వీరికి ఒక బాబు జన్మించాడు. ఆ బాబుకు ప్రతిఘటన అనే పేరు పెట్టారు.
ఉద్యమంలో పలు విభాగాల్లో పని చేసి ఎన్నో ప్రజా పోరాటాలు నిర్వహించిన సీతక్క కొన్నాళ్లకు భర్త రాముతో విభేదాల కారణంగా విడి పోయారు. భర్త తో విడిపోయిన సీతక్క కొన్నాళ్లకే అంటే 1996 లో సీతక్క ప్రజా ఉద్యమం నుండి బయటకు వచ్చేశారు. స్వచ్ఛంద సంస్థలో ఉద్యోగం చేస్తూనే ఇంటర్ మరియు డిగ్రీ ని పూర్తి చేసిన సీతక్క లా కోర్సులు కూడా ముగించింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గిరిజనుల కోసం తీసుకు వచ్చిన పథకాలు మరియు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి సీతక్క ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నారు.
అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ప్రకటించారు. దాంతో ములుగు నియోజకవర్గం నుంచి 1999 లో తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసింది. కాని అప్పుడే పార్టీలో జాయిన్ అవ్వడంతో పాటు ప్రజల్లో ఆమెకు ఇంకా గుర్తింపు లేక పోవడంతో పార్టీ అధినాయకత్వం ఆమెకు సీటు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అయినా కూడా తెలుగు దేశం పార్టీలోనే పని చేస్తూ వచ్చింది సీతక్క. పార్టీ కోసం సీతక్క పాటు పడుతున్న విధానం.. అలాగే ములుగులో ఆమెకు ఉన్న పేరు ప్రతిష్టల నేపథ్యంలో 2004లో ఎమ్మెల్యే సీటు ను చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనం కొనసాగింది. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య గెలుపొందాడు.
మెల్ల మెల్లగా తెలుగు దేశం పార్టీ నాయకులు అధికార టీఆర్‌ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్న సమయంలో సీతక్క మాత్రం చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చారు. కాని భవిష్యత్తు లేని తెలుగుదేశం పార్టీలో ఉంటే ప్రజలకు సేవ చేయడం ఎలా అనుకుని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయిన సమయంలో ఆయన దారిలోనే సీతక్క కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ టీమ్ లో జాయిన్ అయ్యారు. 2018 లో కాంగ్రెస్ తరపున ములుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్‌ఎస్ ధాటికి రేవంత్ రెడ్డి వంటి హేమా హేమీలు కూడా ఓడి పోయిన సమయంలో సీతక్క మాత్రం గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు.
0 Comments:
Post a Comment