SA vs NED : దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ బిగ్ షాక్.. టోర్నీ నుంచి సౌతాఫ్రికా అవుట్.. పాకిస్తాన్ కు ఊపిరిపోసిన డచ్ టీం
Svs NED : పోతూ పోతూ నెదర్లాండ్స్ (Netherlands) బిగ్ షాక్ ఇచ్చింది. సెమీఫైనల్ కు చేరుతుందని భావించిన సౌతాఫ్రికా (South Africa)ను నెదర్లాండ్స్ ముంచేసింది.
చోకర్స్ గా ఉన్న సౌతాఫ్రికా జట్టు మరోసారి కీలక పోరులో చిత్తయ్యింది. దాంతో సెమీస్ చేరకుండానే ఇంటి దారి పట్టింది. సెమీస్ చేరాలంటే తప్పకుండా నెగ్గాల్సిన మ్యాచ్ లో సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ 13 పరుగులతో నెగ్గింది. 159 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు చేసి ఓడింది. దాంతో సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. సౌతాఫ్రికా ఓడిపోవడంతో జింబాబ్వే మ్యాచ్ లో గెలుపోటములతో సంబంధం లేకుండా భారత్ సెమీఫైనల్ కు చేరుకుంది. నెదర్లాండ్స్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ 3 వికెట్లతో సఫారీ నడ్డి విరిచాడు. బాస్ డీ లీడ్ 2, ఫ్రెడ్ క్లాసెన్ రెండేసి వికెట్లు తీశారు. రైలీ రోసో (25) టాప్ స్కోరర్ కావడం విశేషం.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను నెదర్లాండ్స్ బౌలర్లు కట్టడి చేశారు. క్వింటన్ డికాక్ (13), బవుమా (20), మార్కరమ్ (17) క్లాసెన్ (21), మిల్లర్ (17) కట్టకట్టుకుని విఫలం అయ్యారు. కేశవ్ మహరాజ్ ఒంటి కాలితో కుంటుతూ (13) పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఓడటంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీఫైనల్ కు చేరుతుంది.
దాంతో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. కోలిన్ అకర్ మన్ (26 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) నెదర్లాండ్స్ కు అదిరిపోయే ఫినిష్ ఇచ్చాడు. టామ్ కూపర్ (19 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం చేశాడు. ఇక ఓపెనర్లు మైబర్గ్ (37), మ్యాక్స్ ఓ డౌడ్ (29) తమ వంతు పాత్ర పోషించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2 వికెట్లు తీశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ కు ఓపెనర్లు మై బర్గ్, ఓ డౌడ్ లు శుభారంభం చేశారు. ముఖ్యంగా మై బర్గ్ ధాటిగా ఆడాడు. వీరు తొలి వికెట్ కు 58 పరుగులు జోడించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కూపర్ తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడాడు. దాంతో నెదర్లాండ్స్ స్కోరు బోర్డు వేగంగా కదిలింది. అయితే ఓ డౌడ్, కూపర్, బాస్ డీ లీడ్ (1) వెంట వెంటనే పెవిలియన్ కు చేరారు. ఫలితంగా నెదర్లాండ్స్ స్కోరు బోర్డు వేగం తగ్గింది. అయితే చివర్లో అకర్ మన్ సఫారీ పేస్ బౌలింగ్ ను చీల్చి చెండాడు. చివరి రెండు ఓవర్లలో ఏకంగా 31 పరుగులు సాధించాడు. దాంతో నెదర్లాండ్స్ భారీ స్కోరును అందుకుంది.
0 Comments:
Post a Comment