Retirement : నలభైల్లోపే రిటైర్ అవ్వండి.. ఇలా జీవితంలో కొత్త ఆనందాన్ని వెతుక్కోండి
Retirement Plans | దీపం ఉన్నప్పుడు ఇల్లు మాత్రమే కాదు, భవిష్యత్తును చక్కదిద్దుకొని ఎర్లీగా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. నడి వయసులోనే స్వచ్ఛందంగా కొలువుకు టాటా చెప్పి..
నచ్చినట్టు జీవిస్తున్నారు.
Early Retirement Plans | అన్ని బాధ్యతలు తీరి, కృష్ణారామా అనుకుంటూ కాలం గడపడమే శేషజీవితమని అందరి నమ్మకం. అరవై దాటాక ఆరోగ్యంగా ఉంటే దాన్ని వి'శేష' జీవితం అని గొప్పగా అభివర్ణిస్తారు. కానీ, కాలంతో పరిగెత్తకుండా నచ్చిన పనులను బేషరతుగా చేయడమే నిజమైన పదవీవిరమణఅంటున్నారు ఆధునికులు.
దీపం ఉన్నప్పుడు ఇల్లు మాత్రమే కాదు, భవిష్యత్తును చక్కదిద్దుకొని ఎర్లీగా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. నడి వయసులోనే స్వచ్ఛందంగా కొలువుకు టాటా చెప్పి.. నచ్చినట్టు జీవిస్తున్నారు. కచ్చితంగా ప్లాన్ చేసుకుంటే అలాంటి జీవితం మీకూ సాధ్యమే!
కొలువులో చేరిన నాడే సగటు ఉద్యోగి రిటైర్మెంట్ ప్లాన్ వేసుకుంటాడు. తీరిక దొరికినప్పుడల్లా కుర్చీలో సాగిలపడి 'ఆఫ్టర్ రిటైర్మెంట్..' అనుకుంటూ ఏవేవో ఊహించేసుకుంటాడు. చిన్నపొలం, అందులో ఓ కుటీరం, మంచు కురిసే ఉదయం, చిక్కటి కాఫీ సిప్ చేస్తూ భార్యతో కులాసాగా కబుర్లాడటం.. ఇలా సహోద్యోగి తట్టి లేపే వరకూ పగటి కలల్లో మునిగిపోతాడు. పక్కాగా ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ సాధ్యమే! నలభై ఏండ్లు గొడ్డులా చాకిరి చేసి, అరవై ఏండ్లకు పదవీ విరమణ పొందిన సగటు ఉద్యోగికి చిన్నపొలం పెద్ద విషయం కాదు. అందులో కుటీరమూ ఊహించిన దానికన్నా గొప్పగా కట్టుకోవచ్చు. కానీ, దట్టంగా కురిసే మంచు ఆ వయసులో శరీరానికి పడకపోవచ్చు! చిక్కటి కాఫీ సిప్ చేయడానికి ముందు 'షుగర్ టాబ్లెట్ వేసుకున్నారా?' అని జీవిత భాగస్వామి గుర్తు చేయాల్సి రావొచ్చు! మరి ఇన్ని సంపాదించి ఏం ప్రయోజనం? ఈ ప్రశ్నకు సమాధానంగా స్వచ్ఛంద పదవీ విరమణ దిశగా అడుగులు వేస్తున్నారు నేటి ఉద్యోగులు. రిటైర్మెంట్ నిర్వచనాన్ని మార్చేసిమరీ శేష జీవితాన్ని విశేషంగా గడపాలని ఫిక్స్ అవుతున్నారు. 'ఫైర్’తో తమ జీవితాల్లో కొత్త ఆనందాన్ని వెతుక్కుంటున్నారు.
ఆనందం కోసం..
'ఏదైనా సాధించాలంటే ఫైర్ ఉండాలి' అంటుంటారు పెద్దలు. అదే ఫైర్‌తో జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్-రిటైర్ ఎర్లీ (ఫైర్).. ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. పదవీ విరమణ అంటే పనికి విరమణ కాదు. భారంగా బతుకీడ్చడం అంతకన్నా కాదు. కుటుంబ అవసరాలు, బాధ్యతలు అన్నిటికీ సరిపడా ఆర్థిక వనరులు ముందస్తుగా సిద్ధం చేసుకోవడం. అలాగని, పదికోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి పనీపాటా లేకుండా వడ్డీ మీద జల్సారాయుడిలా బతకడం అస్సలు కాదు. ఆర్థికంగా కావాల్సినంత వెసులుబాటు ఉండాలి. ఉద్యోగమూ చేయాలి. 'రిటైర్ అయ్యాక ఇంకా ఉద్యోగం ఏమిటి?' అంటారా! ఇన్నాళ్లూ చేసింది పొట్టకూటికి, ఇప్పుడు చేసేది ఆత్మతృప్తికి. 9 టు 5.. జాబ్ చేయాలనేం లేదు. మీ శక్తియుక్తులు చాటుకునే ఉద్యోగం ఏదైనా చేయవచ్చు. ఒకరకంగా అది పెయిడ్ లీవ్ అన్నమాట! ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బాధ్యతల కోసం పనిచేయాల్సిన పనిలేదు. విశ్రాంతి తీసుకుంటూ కాలక్షేపానికి కొలువు చేయాలి. డబ్బు కోసం కాకుండా ఆనందం కోసం చేయాలి. నచ్చిన పని చేసుకుపోవడమే. నచ్చనప్పుడు మానేయడం. నచ్చిన చోటుకు వెళ్లిపోవడం. నచ్చినన్ని రోజులు గడపడం. వీటన్నిటికీ సరిపడా ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించడమే ఫైర్!
అసాధ్యం కాదు
అరవైలో రిటైర్మెంట్ సహజమే! కానీ, పాతికేండ్ల వయసులో ఉద్యోగంలో చేరినవాళ్లు 20 ఏండ్లు పనిచేసి 45కే కొలువుకు టాటా చెబుతున్నారు. పిల్లల చదువులు, పెండ్లిండ్లకు సరిపడా డబ్బును బాండ్లు, ఎఫ్‌డీ రూపంలో దాస్తున్నారు. రాబడి వచ్చే స్థిరాస్తులు పోగు చేసుకుంటున్నారు. నడివయసులోనే బాధ్యతలన్నీ తీర్చేసుకొని జీవితాన్ని తీరిగ్గా అనుభవిస్తున్నారు. చిన్నప్పటి కలలన్నిటినీ నెరవేర్చుకుంటున్నారు. 'తాతలు ఆస్తులు కూడబెడితే ఇలాంటి విన్యాసాలు ఎన్నయినా చేయొచ్చు?' అని కొట్టిపారేయొద్దు. ఉద్యోగంలో చేరి మొదటి జీతం అందుకున్నప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటే 'ఫైర్’ అసాధ్యమేమీ కాదు. ముందస్తు పదవీ విరమణ వల్ల.. వెల కట్టలేని సమయం మీ చేతుల్లో ఉంటుంది. కాలాన్ని ఆరోగ్యవంతంగా, ఆహ్లాదకరంగా ఆస్వాదించడమే కదా వి'శేష జీవితం'.
ముప్పయ్ ఏండ్ల తర్వాత..
» ఆర్థిక అవసరాలను తక్కువ అంచనా వేయడం కూడా మంచిది కాదు. 1990లో కిలోబియ్యం ధర రూ.5. ఇప్పుడు రూ.50 పైమాటే! అంటే పదింతలు పెరిగింది. ఇదే సూత్రాన్ని ఇంటి ఖర్చులకు అన్వయిస్తే 1990 ప్రాంతంలో రిటైర్ అయిన భార్యాభర్తల జీవనయానానికి రూ.1,000 లోపే ఖర్చేయ్యేది. 2020కి వచ్చేసరికి అది కాస్తా రూ.10,000 వరకు ఉంది. ముప్పయ్ ఏండ్ల తర్వాత ఈ మొత్తం లక్షన్నర రూపాయలకు చేరుకుంటుందంటే ఆశ్చర్యం కలగవచ్చు.
» ఇరవై ఏండ్ల తర్వాత.. అంటే 2042లో రిటైర్మెంట్ అనుకుంటే, తర్వాత మరో ఇరవై ఏండ్ల జీవితం ఉంటుంది. అంటే 2062లో ఇద్దరు బతకడానికి రూ.3లక్షలు అవసరం కావచ్చు. అందుకు తగ్గట్టుగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం తప్పనిసరి
» ఏడాదికి రూ.మూడు లక్షలు వచ్చే పాలసీ చేసి, పాతికేండ్ల తర్వాత ఫర్వాలేదులే అనుకుంటే ఎలా? అప్పుడు మీ అవసరాలకు తగ్గట్టుగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి.
0 Comments:
Post a Comment