Weather Forecast : కరోనాకి ముందు ఎండాకాలంలో ఎండలు, వానాకాలంలో వానలు వచ్చేవి. కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సంవత్సరమంతా వానలు పడుతున్నాయి.
ముఖ్యంగా నవంబర్‌లో వానలు వచ్చే సందర్భం తక్కువ. కానీ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్ష సూచన ఉంది. తెలంగాణను పరిశీలిస్తే.. అక్కడ తూర్పు, ఈశాన్య భారత్ నుంచి.. చల్లని గాలులు వీస్తున్నాయి.
వాటి వల్ల వాతావరణం అతి చల్లగా మారి.. బుధ, గురువారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టుకునే రైతులు ఈ విషయంలో జాగ్రత్త పడాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కి మాత్రం భారీ వర్షాల సూచన ఉంది. బంగాళాఖాతంలో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం.. దక్షిణ కోస్తాంధ్ర వైపు వస్తోందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.
అందువల్ల ఏపీలో ఇవాళ, రేపు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. మరికొన్ని చోట్ల తేలికపాటి వానలు కురవనున్నాయి. వాయుగుండం క్రమంగా ఉత్తర తమిళనాడు , దక్షిణ కోస్తా వైపు వెళ్తోంది. అందువల్ల రాయలసీమ జిల్లాలపై ఎక్కువ ప్రభావం పడుతుందనే అంచనా ఉంది.
చలి గాలులు:
ఈ వాయుగుండం.. తుఫానుగా మారే అవకాశాలు కనిపించట్లేదు. ఇది ఇవాళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత అది అల్పపీడనంగా మారుతుంది. కాకపోతే.. దీని వల్ల తీర ప్రాంతాల్లో చలి గాలుల వేగం పెరుగుతుంది.
అందువల్ల ప్రకాశం , నెల్లూరు , రాయలసీమ జిల్లాల్లో ప్రజలు.. వర్షం, చలి నుంచి తమను తాము కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటం వల్ల.. చేపలు పట్టేవారు ఇవాళ వేటకు వెళ్లవద్దని వాతావరణ అధికారులు కోరుతున్నారు. అలాగే రైతులు కూడా వర్షం నుంచి పంట దిగుబడులను కాపాడుకునేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
ఆరోగ్యం జాగ్రత్త:
చలికాలం చాలా తేలిగ్గా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. జలుబు, దగ్గు, జ్వరం సమస్యలు పెరుగుతాయి. ఆస్తమా బాధితులకు చాలా ఇబ్బంది. కాబట్టి.. ఇలాంటి సమయంలో ఆరోగ్యం పట్ట ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
వీలైనంతవరకూ చలిగాలులు మన శరీరానికి తగలకుండా చూసుకోవాలి. బయట తిరగడం తగ్గించుకోవాలి. ఏవైనా పనులు ఉంటే.. ఉదయం పది తర్వాత.. సాయంత్రం ఐదు లోపు ముగించుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
0 Comments:
Post a Comment