✍️పీఆర్సీలో అన్యాయం జరిగితే సంతకాలెందుకు పెట్టారు?
♦️ఉద్యోగ సంఘాల నాయకులను ప్రశ్నించిన మంత్రి బొత్స
♦️ఉద్యోగులవి తీరే కోర్కెలు అయితే మంచిదని వ్యాఖ్య
♦️సంక్షేమ పథకాల బటన్ నొక్కుడుతో ఉద్యోగులు పోల్చుకోవద్దు: సజ్జల
🌻ఈనాడు, అమరావతి: పీఆర్సీలో అన్యాయం జరిగిందని అనడం ధర్మం కాదని, అలా జరిగిందనుకుంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు సంతకాలు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. పీఆర్సీపై అర్ధరాత్రి వరకు చర్చలు నిర్వహించామని, అందులో నాయకులు భాగస్వాములేనని పేర్కొన్నారు. సచివాలయంలో గురువారం ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డికి నూతనంగా కేటాయించిన ఛాంబర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిలతో కలిసి మంత్రి బొత్స ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడారు. ‘ఉద్యోగుల్ని ఒప్పించే పీఆర్సీ అమలు చేశాం. బలవంతం చేయలేదు కదా? తెలంగాణకు తీసిపోని విధంగా పీఆర్సీ ప్రయోజనాలిచ్చాం. పీఆర్సీలో నష్టం జరగలేదు. ఉద్యోగులు అనుకున్నంత ఇవ్వలేకపోయాం. ఉద్యోగుల సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. అవి తీరే కోర్కెలు అయితే మంచిది. అడగటం మీ హక్కు.. దానికి మేం వ్యతిరేకం కాదు. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించడంపై చర్చలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 10ఏళ్ల సర్వీసు, రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్, త్రిసభ్య కమిటీ ద్వారా ఎంపిక జరిగి ఉండాలి. సీపీఎస్ స్థానంలో ఓపీఎస్‌ను యథావిధిగా అమలు చేయడం కష్టం. కొన్ని మార్పులు చేసి, జీపీఎస్‌ను ఉద్యోగుల ముందు పెట్టాం. రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.2.25 లక్షల కోట్లయితే ఇందులో రూ.80వేల కోట్లు జీతాలకే ఇస్తున్నాం. ప్రభుత్వానికి ఉద్యోగులకు.. సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి వారధిగా పని చేస్తారు’ అని వెల్లడించారు.
♦️చివరి ఎన్నికలంటే దేవతలు తథాస్తు అంటారు..
‘తెదేపా అధినేత చంద్రబాబు ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని చెబితే పైనున్న దేవతలు తథాస్తు అంటారు. ఇవే చివరి ఎన్నికలవుతాయి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సీఎం కాకూడదు. అసెంబ్లీలో చంద్రబాబును ఎవరు అవమానించారు? రికార్డుల్లో లేకుండా ఎవరో వెనుక నుంచి ఏదో అంటే పదేపదే తన భార్యను అవమానించారంటూ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరికాదు’ అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.
♦️సంఘాలను రాజకీయాలకు వాడుకోవడం లేదు: సజ్జల
సంక్షేమ పథకాలకు బటన్ నొక్కుతున్న సీఎం జగన్ ఉద్యోగులకూ ఒక బటన్ నొక్కాలంటూ పోల్చుకోవడం సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ‘ఉద్యోగ సంఘాల నాయకుల్లో ఇలాంటి ఆలోచన ఉంటే తీసేయాలి. ప్రభుత్వం ఇస్తున్న రూ.వేల కోట్ల సహాయం వృథాగా పోవడం లేదు. అనర్హులకు చేరితే ప్రశ్నించొచ్చు. ఉద్యోగ సంఘాలను రాజకీయాలకు వాడుకోవాలని ప్రభుత్వం చూడటం లేదు’ అని పేర్కొన్నారు. ‘చివరి అవకాశం ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు దింపుడు కళ్లం ఆశతో అడుగుతున్నారు. కానీ ప్రజలు చంద్రబాబును నమ్మబోరు. నేనేమీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు’ అని పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment