Palm Oil: షాక్.. పెరగనున్న వంట నూనె ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం!
Edible Oil | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పామ్ ఆయిల్‌పై (Palm Oil) దిగుమతి సుంకాలను పెంచేసింది.
దిగుమతి సుంకాల పెంపు 6 నుంచి 11 శాతం వరకు ఉంది. భారత ప్రభుత్వం తాజాగా ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆయిల్‌పై (Oil) దిగుమతి సుంకాల పెంపు నిర్ణయం వల్ల వినియోగదారులపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకం ఇప్పుడు టన్నుకు 952 డాలర్లకు చేరింది. ఇది వరకు ఇది టన్ను 858 డాలర్లుగా ఉండేది. అలాగే ఆర్‌బీడీ పామ్ ఆయిల్ దిగుమతి టారిఫ్ కూడా పైకి చేరింది. ఇదివరకు ఈ పామ్ ఆయిల్‌పై సుంకం టన్నుకు 905 డాలర్లుగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ సుంకం టన్నుకు 962 డాలర్లకు ఎగసింది. ఇతర పామ్ ఆయిల్ టారిఫ్ కూడా టన్నుకు 882 డాలర్ల నుంచి 957 డాలర్లకు పెరిగింది.
అలాగే క్రూడ్ సోయా ఆయిల్‌పై దిగుమతి సుంకం టన్నుకు 1345 డాలర్లకు ఎగసింది. ఇదివరకు ఇది టన్నుకు 1274 డాలర్ల వద్ద ఉండేది. ఇక బంగారంపై దిగుమతి సుంకాలు 531 డాలర్ల వద్దనే ఉన్నాయి. పది గ్రాములకు ఇది వర్తిస్తుంది. ఇంకా వెండిపై అయితే దిగుమతి సుంకం స్వల్పంగా పెరిగింది. ఒక డాలర్ పైకి కదిలింది. వెండిపై దిగుమతి సుంకం కేజీకి 630 డాలర్ల వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ ధరలు పెరిగిపోవడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతి రెండు వారాలకు ఒకసారి బేస్ దిగుమతి సుంకాలను సవరిస్తూ ఉంటుంది. ఎడిబుల్ ఆయిల్స్, గోల్డ్, సిల్వర్ వంటి వాటిపై దిగుమతి సుంకాల మార్పు ఉంటుంది. అయితే ఈసారి మాత్రం బంగారం, వెండిపై సుంకాల్లో మార్పు లేదు. స్థిరంగానే కొనసాగించింది.
కాగా భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతి దేశంగా కొనసాగుతోంది. అలాగే సిల్వర్ విషయంలోనూ అగ్ర స్థానంలో ఉంది. ఇక బంగారం వినియోగంలో మాత్రం రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో చైనా ఉంది. దిగుమతి దారులు ఈ దిగుమతి సుంకాల ఆధారంగానే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు పెరగడం, దిగమతి సుంకాల పెంపు కారణంగా రానున్న కాలంలో వంట నూనె ధరలు పైకి కదిలే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.
0 Comments:
Post a Comment