Oral Health | నోరు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత ఆరోగ్యవంతంగా ఉంటామన్నది పచ్చి నిజం. మన నోటిలో ఎన్నో రకాల సూక్ష్మజీవులు తిష్టవేసి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
ముఖ్యంగా గుండె సంబంధ సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి.
Oral Health | నోరు మంచిదైతే ఊరు మంచిదైతది.. ఇది పాత సామెత..! నోరు మంచిదైతే మన ఆరోగ్యం మంచిగుంటది..! ఇది ఇవ్వాల్టి మాట. డాక్టర్లు, పరిశోధకులు ఇదే మాటను చెప్తున్నారు. నోటి ఆరోగ్యం ఎంత బాగుంటుందో అంతగా వ్యాధులు రాకుండా చూసుకోవచ్చునన్న మాట. నోరు, దంతాలు, నాలుక, చిగుళ్లు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
నోట్లో బ్యాక్టీరియా నిండి ఉంటుంది. అయితే, ఇదేం ప్రమాదకరం కాదు. కానీ, ఈ బ్యాక్టీరియా జీర్ణ, శ్వాసకోశ మార్గాల ద్వారా కడుపులోనికి ప్రవేశించి ఇతర వ్యాధులు రావడానికి కారణమవుతుంటాయి. సరైన నోటి పరిశుభ్రత లేకపోవడం వల్ల దంత క్షయం, చిగుళ్ల వ్యాధుల వంటి నోటి ఇన్‌ఫెక్షన్లకు కూడా కారణభూతమవుతుంది. నోటి వ్యాధులు నివారించదగినవే. ఇవి జీవితాంతం మనల్ని ప్రభావితం చేస్తాయని చెప్పవచ్చు. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది నోటి ఆరోగ్యంతో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తన ఇటీవలి ఓరల్ హెల్త్ స్టేటస్ రిపోర్ట్‌లో పేర్కొన్నది. ఎక్కువ మొత్తంలో చక్కెర వినియోగం, పొగాకు నమలడం, మద్యం సేవించడం, సరైన పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో నోటి ఆరోగ్యం దెబ్బతింటున్నదని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.
నోటి ఆరోగ్యం-గుండెకు సంబంధం..
నోటి పరిశుభ్రత సక్రమంగా పాటించని వారిలో అనేక వ్యాధులు రావడానికి కారణమవుతుంటాయి. డయాబెటీస్ మేనేజిమెంట్ క్లిష్టతరం కావడం, గుండె జబ్బుల ప్రమాదం కలిగించడం వంటి అనేక విధాలుగా నోటి ఆరోగ్యం మనకు హాని కలిగిస్తుంది. చిగుళ్ల వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు స్ట్రోక్, గుండెపోటు, ఇతర హృదయ సంబంధ సమస్యలను కలిగి ఉండే అవకాశం కనీసం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రచురించిన ఒక కథనంలో పేర్కొన్నది.
పూర్ ఓరల్ హెల్త్ అనేది రక్తప్రవాహంలో బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ పెరుగుదలతో ముడిపడి ఉంటుంది. ఇది గుండె కవాటాలను ప్రభావితం చేస్తుంది. ఈ సూక్ష్మక్రిములు గుండెకు చేరినప్పుడు ఏదైనా దెబ్బతిన్న కణజాలానికి చేరి గుండె లోపలి పొరకు సంబంధించి ఎండోకార్డిటిస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. నోటిలోని బ్యాక్టీరియా ద్వారా వచ్చే వాపు అథెరోస్క్లెరోసిస్, స్ట్రోక్ వంటి గుండె సంబంధ వ్యాధులతో ముడిపడి ఉంటుంది.
నోటి అనారోగ్యం లక్షణాలిలా ఉంటాయ్..
చిగుళ్లు ముట్టుకోగానే నొప్పి పెడతాయి.
చిగుళ్లు ఎర్రగా మారి వాపు కనిపిస్తాయి.
ఆహారం తీసుకున్నప్పుడు, బ్రష్ చేసినప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది.
చిగుళ్లు, దంతాల చుట్టూ చీము కనిపిస్తుంది.
దంతాల నుంచి గమ్ వేరుపడుతుంది.
నోటిలో పుల్లని రుచి అనుభూతి కలుగుతుంది.
తరచుగా నోటి దుర్వాసన కలిగి ఉంటారు.
దంతాలు వదులుగా అవుతుంటాయి.
ఇవీ నివారణ చర్యలు..
నోటి పరిశుభ్రతపై దృష్టిపెట్టాలి.
నిత్యం కనీసం రెండు సార్లు బ్రష్ చేయాలి.
నిత్యం ఫ్లాసింగ్ చేసుకోవాలి.
దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారాలను తొలగించాలి.
మృధువైన బ్రిస్టల్ బ్రష్‌ను వినియోగించాలి.
ఎప్పటికప్పుడు సాధారణ దంత పరీక్షలు చేయించుకోవాలి.
దంతాల ఆరోగ్యానికి పోష్టికాహారం తీసుకోవాలి.
తీపి పదార్థాలను తినడం తగ్గించుకోవాలి.
తాజా పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, గింజలు తినాలి.
నోటిలోని బ్యాక్టీరియాను నిరోధించే కాన్‌బెర్రీలు తినాలి.
సోడాలు, కెఫిన్ డ్రింక్స్, కార్బేనేటెడ్ డ్రింక్స్ తాగకుండా చూసుకోవాలి.
సిగరెట్ స్మోకింగ్, పొగాకు నమలడం మానుకోవాలి.
ప్రతి 3,4 నెలలకు ఒకసారి టూత్ బ్రష్ మార్చాలి.
0 Comments:
Post a Comment