Omega 3- మెదడు ఆరోగ్యానికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చాలా అవసరం.. ఇవి ఏయే ఆహారాల్లో ఉంటాయంటే..
బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండటానికి షార్ప్ గా పనిచేయడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు చాలా అవసరమని ఎన్నో అధ్యయనాలు వెల్లడిచాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు నిరాశ, ఆందోళన, ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మన శరీరంలో అనేక విధులకు అవసరమైన కొవ్వులలో ఒకటి. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మెదడుకు. మెదడు ఆరోగ్యానికి ఒమేగా -3 ఆమ్లాలు చాలా అవసరమని అనేక అధ్యయనాలు కూడా వెల్లడించాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఒత్తిడిని, నిరాశను, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె, చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అవిసె గింజలు
అవిసె గింజల్లో మెగ్నీషియం, ఐరన్, కాల్సియం, విటమిన్ డి, ఫోలేట్, ఫైబర్ వంటి పోషకాలతో పాటుగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజలు బ్రెయిన్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు ఈ గింజలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. అలాగే జీర్ణవ్యస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
సోయా బీన్స్
సోయా బీన్స్ లో ఫైబర్, విటమిన్ కె, మెగ్నీషియం, పొటాషియంతో పాటు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. సోయా బీన్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే ఇవి మన శరీరానికి అవసరమయ్యే రకరకాల పోషకాలను అందజేస్తాయి.
సాల్మన్ చేపలు
సాల్మన్ చేపలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు అద్భుతమైన మూలం. వీటిలో విటమిన్ డి, విటమిన్ బి తో పాటుగా ఇతర ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బ్రెయిన్ హెల్త్ బాగుండటమే కాదు.. గుండె ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటిలో ఉండే విటమిన్లు కాలెయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
వాల్ నట్స్
వాల్ నట్స్ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు మంచి వనరు. వాల్ నట్స్ లో మెగ్నీషియం, రాగి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ వాల్ నట్స్ ను రోజూ కొన్ని తింటే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. అలాగే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
గుడ్లు
గుడ్లు సంపూర్ణ ఆహారం. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే గుడ్లు తినడం వల్ల మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును తింటే మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది
చియా సీడ్స్
చియా సీడ్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విత్తనాల్లో ఫైబర్, కాల్షియం, ఐరన్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడానికి, మధుమేహాన్ని నియంత్రించడానికి కూడా సహాయపడతాయి.
0 Comments:
Post a Comment