గుట్టుగా...గట్టిగా!
వాలంటీర్లకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు బాధ్యత
ఎడ్యుకేషనల్ సర్వే పేరిట నాడి కనుక్కునే ప్రయత్నాలు
వాలంటీర్లు నిర్వహిస్తున్న సర్వేలోని ఓ పేజీ..
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో దొంగచాటు కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. ఎడ్యుకేషన్ సర్వే పేరిట వాలంటీర్లను రంగంలోకి దింపారు. వీరితో బలవంతంగా సర్వే చేయించి.. ఓటర్ల నమోదు బాధ్యత నుంచి వారి నాడి తెలుసుకోవడంతో పాటు పార్టీ తరఫు అభ్యర్థులకు ఓటేయించే బాధ్యతలు అప్పగించారు. వీరిపై వైకాపా పార్టీ పరంగా పెట్టుకున్న జేఎల్‌ఓ, డీఎల్‌ఓ, ఎంఎల్‌ఓలు పెత్తనం చెలాయిస్తున్నారు. మరోవైపు అనర్హుల్నీ చేర్పించే ప్రయత్నాలు ఎక్కవయ్యాయి.
- ఈనాడు డిజిటల్, కడప, న్యూస్‌టుడే, కడప విద్య
సర్వే ఎలా అంటే?
వాలంటీర్లపై బలవంతంగా ఒత్తిడి పెట్టి వారి దగ్గరున్న సమాచారం మేరకు ఎడ్యుకేషన్ సర్వే యాప్‌ను అప్పగించారు. అనుమానం రాకుండాదనే ఉద్దేశంతో పదోతరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన సభ్యుల వివరాలను సేకరించాలి. ఇతరులవి కాకుండా గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులైన వివరాలను సమగ్రంగా సేకరించేవిధంగా యాప్‌లో రూపొందించారు. వీరు ఏ పార్టీ మద్దతుదారులో తెలపాలని వైకాపా, తెదేపా, జనసేన, భాజపా, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఇతరుల పేరిట ప్రత్యేక పేజీని పెట్టి టిక్ పెట్టేవిధంగా కాలమ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులను సైతం పలకరించి.. మీ కుటుంబంలోని గ్రాడ్యుయేట్ ఏ పార్టీకి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు?. ఇప్పటికే ఓటరుగా నమోదయ్యారా... లేదా అనే వివరాలు సర్వే ద్వారా సేకరిస్తున్నారు. ప్రస్తుతం వాలంటీర్లంతా పార్టీపరంగా జిల్లా, డివిజన్, మండల స్థాయిలో పని చేస్తున్న సమన్వయకర్తల పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు.
ఎవరీ పర్యవేక్షకులు?
వాలంటీర్లపై తక్కువ స్థాయిలో ఒత్తిళ్లు కనిపించడంలేదు. ప్రభుత్వ పరంగా అధికారికంగా జిల్లా, డివిజన్, మండల స్థాయిలో వైకాపా తరఫున జేఎల్‌ఓ, డీఎల్‌ఓ, ఎంఎల్‌ఓలు పనిచేస్తున్నారు. వీరు పరోక్షంగా వాలంటీర్ల ద్వారా వివరాలు సేకరించి పార్టీకి అందించే బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు వాలంటీర్లు ప్రభుత్వంతో పాటు వైకాపాకు పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పార్టీకి అవసరమైన అంశాలను ప్రైవేటుగా నియమించుకున్న జేఎల్‌ఓ, డీఎల్‌ఓ, ఎంఎల్‌ఓలు పర్యవేక్షిస్తున్నారు.
ఫోన్లతో రావొద్దు
అధికార వైకాపాకు అనుకూలంగా తెరచాటు కార్యక్రమాలు కొందరు అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉండటానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలం నుంచి వాలంటీర్లతో పాటు ఇతరత్రా సిబ్బందితో సమావేశాలు నిర్వహించే సమయంలో ఫోన్లు తీసుకురావద్దని.. ఇంటి వద్దే పెట్టి రావాలనే మౌఖిక ఆదేశాలు అధికారులు ఇస్తున్నారు. వాయిస్, వీడియో రికార్డింగ్ చేసే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల కమలాపురం పురపాలక సంఘం కమిషనరు సమావేశానికి ముందు తనిఖీలు నిర్వహించి చరవాణులు లేవని తేలిన తర్వాత పక్షంలోనే కార్యక్రమం ప్రారంభించారు.
బోగస్ ఓటర్ల నమోదు...
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అధికార పార్టీ హడావుడిపై విద్యాశాఖలో, ఉపాధ్యాయుల్లో చర్చ సాగుతోంది. అధికార పార్టీ నేతలు చెప్పిన ప్రకారం నడుచుకోకపోవడం, బోగస్ ఓట్ల నమోదుకు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇద్దరు డీఈవోలను బదిలీ చేశారన్న ప్రచారం జోరందుకోవడంతో జిల్లాలో పరిస్థితి ఏమటని విస్తృతంగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఓట్ల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఈ నెల 7వ తేదీ వరకూ గడువు ఉండగా, అర్హత గల ప్రభుత్వ ఉపాధ్యాయులు నిబంధనల మేరకు ఓటు హక్కుకు నమోదు చేసుకుంటున్నారు. ప్రైవేటు ఉపాధ్యాయుల నమోదుకు సంబంధించి బోగస్ ఓట్ల నమోదు దిశగా కొంతమంది అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఆరేళ్లలో కనీసం మూడేళ్లు పీఎఫ్ జమచేసిన వివరాలు దరఖాస్తుతో పాటు అందించాలన్న నిబంధనలను ఉల్లంఘించి నమోదు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. గుంపగుత్తగా పలు యాజమాన్యాల తరఫున బోగస్ ఓట్ల నమోదుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలున్నాయి. విద్యార్హతలు కలిగి పాఠశాల వ్యాను డ్రైవర్‌గానూ, బోధనేతర సిబ్బందిగానూ పనిచేస్తున్న వారితోనూ దరఖాస్తులు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఓటు నమోదులో పలువురు అధికార పార్టీ నాయకులు ప్రైవేటు యాజమాన్యాలపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. పలు ప్రైవేటు పాఠశాలల్లో దస్త్రాల నిర్వహణ సక్రమంగా లేవని చెబుతున్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు ఈపీఎఫ్ కూడా జమచేయడం లేదు. అక్కడే పనిచేసినట్లు రికార్డులూ నిర్వహించడం లేదు. ఓటు నమోదుకు అవసరమైన అర్హతల రికార్డులు తయారుచేసి పంపాలని నేతలు ఆదేశిస్తున్నారు. అయితే రికార్డులు సక్రమంగా లేక కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ముందు నుయ్యి వెనుక గొయ్యి తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
ప్రైవేటు ఉపాధ్యాయుల ఓటు నమోదుకు సంబంధించి పూర్తిస్థాయిలో జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షణలో ప్రక్రియ జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారోననే చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో పశ్చిమ రాయలసీమ పరిధిలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో సుమారు 20 వేలమందికిపైగా ఓట్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య ఓట్ల నమోదు దశలో 26 వేలపై చిలుకు చేరుకుందని సమాచారం. ఆఖరి రెండు రోజుల్లో ప్రైవేటు యాజమాన్యాలు, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఎన్ని ఓట్లను నమోదు చేయిస్తారోనని ఉత్కంఠగా ఉపాధ్యాయవర్గం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో ఆన్‌లైన్‌లో 5,055, ఆఫ్‌లైన్‌లో 114 మంది ఓట్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. వైయస్‌ఆర్ డీఈఓ దేవరాజు మాట్లాడుతూ ప్రస్తుతం నిబంధనల మేరకు ఓటర్ల నమోదు జరుగుతోందని తెలిపారు.
0 Comments:
Post a Comment