తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై, కార్యాలయాలపై, కళాశాలలపై, ఆయన కుమారులు, కుమార్తె, బంధువుల ఇళ్ల పై ఐటీ అధికారులు దాడులు చేయడం తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా మంత్రి మల్లారెడ్డి ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలతో, ఆదాయపన్ను శాఖ అధికారుల మీద సంచలన వ్యాఖ్యలు చేసి వారి పైన కేసులు పెట్టడం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి మల్లారెడ్డి ఐటీ దాడుల నేపథ్యంలో చేసిన ఓవరాక్షన్ ఆయనను మరింత పీకల్లోతు కష్టాల్లోకి నెడుతుందేమో అన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది.
ఐటీ దాడులతో మంత్రి మల్లారెడ్డి హంగామా.. ఐటీ అధికారులపై ఓవరాక్షన్
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తమ ఆస్తులపై దాడులు చేసిన ఐటీ అధికారులతో చాలా దారుణంగా వ్యవహరించారు. ఐటీ అధికారుల ల్యాప్ టాప్ లాక్కోవడం, ఐటీ అధికారులు తన కుమారుడిని కొట్టారని సంచలన ఆరోపణలు చేయడం, తన కుమారుడితో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు అంటూ ఆరోపించడం, పైగా ఐటీ అధికారుల పైన కేసులు పెట్టడం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఐటీ అధికారుల దాడులకు తాము భయపడేది లేదని చెబుతూనే, అధికారుల దాడులను అడ్డుకోవడం కోసం మంత్రి మల్లారెడ్డి నానా హంగామా చేశారు.
మల్లారెడ్డి సంచలన ఆరోపణలు, ఫిర్యాదులు ... ఐటీ అధికారులు రివర్స్ కంప్లైంట్
వైద్య కళాశాలకు మూడేళ్లలో 100 కోట్ల రూపాయల మేర వసూలు చేసినట్టు తన కుమారుడితో బలవంతంగా సంతకం చేయించుకున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. సి ఆర్ పి ఎఫ్ పోలీసులతో తన కుమారుడిని తీవ్రంగా కొట్టారని, అందుకే తన కుమారుడు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఐటి అధికారులు దిండిగల్ పోలీస్ స్టేషన్ లో మంత్రి మల్లారెడ్డి పై కంప్లైంట్ ఇచ్చారు. తమ అధికారిని మంత్రి మల్లారెడ్డి నిర్బంధించారని, అధికారి నుండి ల్యాప్ టాప్ కూడా లాక్కున్నారని, తమ విధులు తమను నిర్వర్తించకుండా మంత్రి మల్లారెడ్డి అడ్డుకున్నారని వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మల్లారెడ్డి ఆస్తులపై దాడుల అనంతరం ఈడీకి లేఖ రాసిన ఐటీ అధికారులు
ఇక అంతటితో ఊరుకోని ఐటి అధికారులు తాము మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై సాగించిన ఐటీ దాడుల్లో భాగంగా గుర్తించిన అంశాలతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు సమగ్రంగా లేఖ రాశారు. ఐటీ దాడుల్లో భాగంగా మనీలాండరింగ్ జరిగినట్లుగా అనుమానం ఉందని, మల్లారెడ్డి ఆస్తులపై విచారణ జరపాలని ఐటీ అధికారులు రాసిన లేఖతో ఈడీ కూడా రంగంలోకి దిగుతుంది ఏమో అన్న అనుమానం కలుగుతుంది. మల్లారెడ్డి చేసిన ఓవరాక్షన్ మల్లారెడ్డి కొంపముంచే పరిస్థితి కనిపిస్తుంది.
ఈడీ రంగంలోకి దిగితే మల్లారెడ్డికి పీకల్లోతు కష్టాలే
ఐటీ అధికారులు తమ దాడులలో ఆదాయపు పన్ను ఎగవేత అంశాలు ఏవైనా ఉంటే గుర్తించి ఫైన్ విధిస్తారు. అక్కడితో ఆ ఇష్యూ క్లోజ్ అవుతుంది. కానీ మల్లారెడ్డి చేసిన హంగామా కారణంగా ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగితే మల్లారెడ్డి సంస్థల్లోకి అక్రమ మార్గంలో వచ్చిన నగదుకు సంబంధించిన గుట్టు బయట పడే అవకాశం ఉంటుంది. ఇక ఈడీ రంగంలోకి దిగితే, అక్రమ నగదు బదిలీలు జరిగాయి అని నిర్ధారణకు వస్తే కేసులు పెట్టి అరెస్టు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే మంత్రి మల్లారెడ్డి ఆర్థిక వనరుల మీద ఊహించని దెబ్బ పడుతుంది. ఆయన కళాశాలలకు, ఆయన వ్యాపార సంస్థలకు ఈడీ దాడులు చేస్తే తీవ్ర ప్రభావం ఉండటం పక్కా అని తెలుస్తుంది.
0 Comments:
Post a Comment