Irion Cookware : ప్రస్తుత కాలంలో చాలా మంది వంటిళ్లలో అల్యూమినియం ఇంకా నాన్ స్టిక్ వంట పాత్రల వాడకం తగ్గుతుందనే చెప్పవచ్చు.
ఇవి వాడడంలో ఉన్న ఇబ్బందులు అలాగే వాటి వలన తలెత్తే అనారోగ్య సమస్యలు మొదలైన వాటి వలన చాలా మంది ప్రజలు ఇనుముతో చేసిన పాత్రల వైపు మొగ్గుచూపుతున్నారు.
ఇనుముతో అచ్చు పోసిన దోశ ప్యాన్ లు, కళాయిలు, కుకింగ్ ప్యాన్ లు ఇలా వివిధ రూపాల్లో విరివిగా మార్కెట్లోకి వస్తున్నాయి.
ఎక్కువ కాలం మన్నడం, ఆరోగ్యకరం అవడంతోపాటు మిగతా వాటికంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండడంతో చాలా మంది ఐరన్ వంట పాత్రలు కొనడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇతర వంట పాత్రలతో పోల్చినపుడు ఐరన్ పాత్రలను శుభ్రం చేసుకోవడం కాస్త శ్రమతో కూడుకున్నదే అని చెప్పవచ్చు. ఇనుప పాత్రలపై జిడ్డు నూనె మరకలు ఎక్కువగా పేరుకుపోతూ ఉంటాయి.
ఎక్కువ రోజులు వాడకుండా ఉంచినప్పుడు అవి తుప్పు పట్టి దానిని వదిలించుకోవడం కూడా కష్టతరంగా మారుతుంది. సాధారణ డిష్ వాష్ బార్ లతో ఈ మరకలను దూరం చేయడం అంత సులభం కాదు.
వీటిని ఎలా కడగాలో ఎలా శుభ్రం చేయాలో తరువాత ఎక్కువ కాలం మురికి లేదా తుప్పు పట్టకుండా ఉండడానికి ఏం చేయాలో కొందరు షెఫ్ లు మనకు సలహా ఇస్తున్నారు.
Iron Cookware
ఇలాంటి ఇనుముతో చేసిన పాత్రలు శుభ్రం చేయడానికి ముందుగా పాత్రలు కడిగే పీచును సోడా ఉప్పు వేసిన వేడి నీటిలో ముంచి పాత్రపై ఉన్న నూనె, జిడ్డు ఇంకా తుప్పు పోయేలా బాగా రుద్ది కడుక్కోవాలి.
తరువాత తడి అంతా ఆరిపోయేవరకు పాత్రను ఎండనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా ఆవనూనెను తీసుకొని పాత్ర అంతటికి పట్టేలా దానిపై అన్నివైపులా రాయాలి.
ఇలా చేయడం వలన ఐరన్ పాత్రలు ఎక్కువ కాలం మన్నడమే కాకుండా తుప్పు పట్టకుండా ఉంటాయి. ఇదే విధంగా ఇత్తడి, రాగి ఇలా ఇతర లోహాలతో చేసిన పాత్రలను కూడా శుభ్రం చేసుకోవచ్చు.
0 Comments:
Post a Comment