సిద్దవటం అనే మాటని కడప జిల్లా బయట చాలా మంది వినివుండరు. ఉజ్వలమైన చరిత్ర ఉన్న ఒక కోట శిధిలాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీ కృష్ణ దేవరాయలు రెండవ కూతురు సిద్ధవటం కోడలు కూడా. అంటే ఇది ఆమె నివసించిన కోట. ఈ విషయం కూడా అంతగా ప్రచారం కాలేదు.
సిద్దవటం ఫోర్ట్ అని ఇంగ్లీష్ లో గూగుల్ సెర్చ్ చేస్తే కేవలం 68 ఎంట్రీలు మాత్రమే వచ్చాయి.
సిద్దవటం కోట అని తెలుగులో సెర్చ్ చేస్తే 72 రిజల్ట్స్ వచ్చాయి. బ్రిటిష్ వారి స్పెలింగ్ సిధౌట్ ఫోర్ట్ తో ఇంగ్లీష్ సెర్చ్ చేస్తే 74 ఫలితాలు వచ్చాయి. సిద్దవటం ఫోర్ట్ ఏ మాత్రం పాపులర్ కాదనేందుకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?. అందుకే ఈ కోటని ఈ సారి పరిచయం చేస్తున్నా. పెన్నా నది, చుట్టూర కొండలు... అందమయిన ప్రకృతి మధ్య సిద్దవటం కోట ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణా ఏ మూలనుంచయినా సరే ఒకటి లేదా రెండు రోజుల వ్యవధిలో ఈ కోటను, పరిసర ప్రదేశాలను చూసి రావచ్చు.
ఈ విలువైన చారిత్రక సంపదను కాపాడుకోవాలని, ప్రజలందరికి చేరువచేయాలనే ప్రయత్నాలు పెద్దగా జరగలేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ టూరిజం మ్యాప్ లోగాని, ఇంక్రెడిబుల్ ఇండియా టూరిజం మ్యాప్ లోగాని సిద్దవటం కోటకు రావలసినంత పాపులారిటీ రాలేదు.
వెదికి వెదికి ఎక్కడెక్కడో ఉన్న కోట గోడలను, శిధిలాను చూసేందుకు ఉత్సాహం చూపే వారంతా ముందుగాచూడాల్సిన చారిత్రక శకలం మన పక్కనునున్న సిద్దవటం కోట. కడప పట్టణానికి 20 కి.మీ. దూరాన సిద్దవటం వుంటుంది. కడప జిల్లా ఏర్పడినపుడు జిల్లా కేంద్రం సిద్దవటమే. 1817లో జిల్లా కేంద్రం కడప పట్టణానికి మారింది. తర్వాత చాలా కాలం రెవిన్యూ డివిజన్ గా కొనసాగింది. 1914 ఆర్డీవో ఆఫీస్ రాజంపేటకు మారింది.
ఈ ఊరికి ఎందుకు ఆ పేరు వచ్చింది?
పూర్వం ఈ ప్రాంతం అన్నగుండి వంశానికి చెందిన శివశంకర పండిత రాజులు జాగీరుగా ఉండింది. అడవిలో ఒకసారి ఆయనకు ఒకచోట ఒక పుట్ట, శివలింగం , పక్కనే ఒక వట వృక్షం దానికి సేవలు చేస్తున్న రుషులు కనిపించారు. ఆయన క్రీ.శ 1334 ప్రాంతంలో ఒక గుడి కట్టించి దానికి సిద్ధవటేశ్వరాలయం అని పేరు పెట్టాడు. తర్వాత అక్కడ వెలసిన గ్రామమే సిద్ధవటం అని చెబుతారు. తర్వాత ఊరినే ఆయన తన స్ధావరం చేసుకుని కోటను కూడా కట్టించారు.
కడప జిల్లా మీద చాలా కాలం పట్టు ఉండిన మట్లి (మెట్ల)వంశం పాలకులు కట్టించిన కోట ఇది. సిద్ధవటం, జమ్మలమడుగు, చెన్నూరు ప్రాంతాలను వీరు పాలించారు. పడుతూ లేస్తూ దాదాపు 200 సం. పాటు ఈ రాజ వంశం సిద్దవటంని పాలించింది. తాము చోళ రాజుల వారసులమని తమ వంశం పేరు దేవచోడ అని వారు చెప్పుకున్నారు.
వాళ్లకు తెలుగు చోళులకు సంబంధం లేదు. నైజాం రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారికి అప్పగించినపుడు చివర లొంగి పోయిన సంస్థానం ఇదే. మెట్ల రాజులకు విజయనగర రాజులకు బంధుత్వం ఉండేది. తుళువ వంశానికి చెందిన సదాశివరాయలు ఈ కుటుంబ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మెట్ల వరద రాజు శ్రీ కృష్ణ దేవరాయలు రెండవ కూతురు కృష్ణమ్మ ను వివాహమాడారు .
రాయల వారి ఇద్దరు కూతుర్లలో ఒకరిని ఆరవీటి అలియ రామరాయలు వివాహమాడారు. ఆయన మరదలే వరదరాజులు భార్య అని గుంటూరు నాగార్జున యూనివర్శిటీకి చెందిన రీసెర్చర్ వై కిరణ్ కుమార్ 'ఫర్ గాటన్ (మట్లీ స్) చీఫ్ టైన్స్ ఇన్ కడప డిస్ట్రిక్ట్ - ఏ స్టడీ ' అనే పేపర్లో రాశారు. ఈ పేపర్లో శ్రీ కృష్ణ దేవరాయల వియ్యంకుడి వంశ చరిత్ర ఉంది. మెట్ల వరద రాజులే ఈ కోటను బాగా పటిష్ట పరిచాడు. తర్వాత మెట్ల అనంతరాజు ఈ కోటను రాతి గోడలతో ఇంకా శత్రు దుర్బేధ్యం చేశాడు.
ఔరంగజేబు కాలంలో ఈ ప్రాంతం ఢిల్లీ పాదూషాల ఆదీనంలోకి వచ్చింది. ఆయన సేనాని మీర్ జుమ్లా అనే వాడు కోటను వశపర్చుకుని పటిష్టపరిచాడు. ఆ తర్వాత ఆలయం పాడుపడటం మొదలయింది. ముస్లిం ల ఏలుబడిలో అలంఖాన్ పాలకుడుగా ఉన్నపుడు హైదర్ అలీ 1779లో ఈ కోటను స్వాదీనం చేసుకున్నాడు.
అలంఖాన్ ను బంధించి శ్రీరంగపట్టణం జైలుకు తరలించాడు. కోటను బాగా ధ్వంసం చేశాడు. 1799లో ఇది నైజాం కిందకు వచ్చింది. 1800 లో సబ్సిడియరీ అలయన్స్ కింద నైజాం రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి దారాదత్తం చేశాడు. అపుడు కడప జిల్లా కేంద్రం సిద్ధవటమే.
సిద్ధవటం ఎలా చేరుకోవాలి?
సిద్దవటానికి చేరుకోవడం చాలా సులభం. తిరుపతి నుంచి రావచ్చు. కడప నుంచి రావచ్చు. తిరుపతి, కడపలకు బస్సు, రైలు, విమాన సౌకర్యలు చక్కగా ఉన్నాయి. అందువల్ల ప్రయాస లేకుండా సిద్దవటం చేరుకుని, ఇక్కడి చారిత్రప్రదేశాలను చూసి వెళ్లిపోవచ్చు. ఇక్కడికి గండికోట కూడా దగ్గిరే. కడపకు రైల్లో , బస్సులో, విమానంలో రావచ్చు. కడపలో మంచి హోటళ్లున్నాయి.
కోటలో ఏమేమి ఉన్నాయి?
కోటలోపుల విజయనగర రాజులు దుర్గ, రంగనాథస్వామి, సిద్దేశ్వర, బాల బ్రహ్మ ఆలయాలను నిర్మించారు. ఇక్కడ అందమయిన అద్భుతమయిన శిల్ప సంపద ఉంది.
ఇక్కడ ఉన్న దేవుళ్లలో ప్రధానమయినది నరసింహుడు ఆయన దేవేరి లక్ష్మి విగ్రహం. విశేషమేమిటంటే ఇది ఈయన ఉగ్ర నరసింహుడుకాదు. ఈయనభక్తులను ఆశ్వీర్వదించే ప్రసన్నలక్ష్మీనరసింహుడు. ఈ శిల్పాలు గ్రనైట్ లో చెక్కినవి. అందుకే ఆ శిల్పులు గొప్ప పనిమంతులని మెచ్చుకోవాలి.
విజయనగర రాజుల కాలంలో ఒక పెద్ద నందిని కూడా నిర్మించారు. దీనిని ధ్వంసం చేశారు. చైతన్య ప్రభు కూడా ఈ కోటని సందర్శించారు.
ఈ కోటని కాపాడుకునేందుకు స్థానిక పాలకులు ఎపుడూ యుద్ధాలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఉదయగిరి,రెడ్డిరాజుల నుంచి కోటను కాపాడుకుంటూ వచ్చారు. ముస్లిల పాలనలో ఉన్నపుడు కోట లోపుల మసీదులనునిర్మించారు.కోట లోపల ఎర్రటి రాతి స్థంభాలపై అద్భుతమైన శిల్పకళ మన చూపులను కట్టిపడేస్తాయి. ఇక్కడ రాతి స్తంభంపై చెక్కిన వేంకటేశ్వరున్ని ఇక్కడ రాతి స్తంభంపై చెక్కిన వేంకటేశ్వరున్ని మహమ్మదీయ ప్రార్ధనా నిర్మాణాన్ని ఓకేచోట చూడొచ్చు.
పెన్నా నది వంతెన మీద నుండి చూస్తే ..ఇసుక తిన్నెలను అనుకుని నల్లటి బలమైన రాతి గోడలతో చాలా అందంగా కనిపిస్తుంది సిద్దవటం కోట.
కోటలో కొంత భాగం కాలగర్భంలో కలిసిపోయి ఉంద. మహమ్మదీయుల సమాధులు కూడా కొన్ని ఉన్నాయి. ఈ కోటలో వాడుకలో ఉన్నది కేవలం మసీదుయే.
0 Comments:
Post a Comment