డిగ్రీలో ఫస్ట్‌క్లాస్ వస్తుందని ఆశపడితే అత్తెసరు మార్కులు! పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సాధించే ప్రయత్నానిదీ అదే తీరు.
ఇలాంటి ప్రతికూల ఫలితాలను పదేపదే గుర్తుచేసుకుంటూ చాలామంది విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంటారు. ఇలాంటప్పుడు నిపుణులు చెప్పే విషయాలను శ్రద్ధగా ఆచరిస్తే.. అనుకూల ఫలితాలను అందుకోవచ్చు.
అవేమిటంటే...
1 ఫెయిల్ కావడం, పదేపదే ప్రతికూల ఫలితాలు రావడం అనేది ఎవరినైనా బాధించే విషయమే.. కాదనడం లేదు. కానీ అంతటితో మాత్రం ప్రయాణం ఆగిపోకూడదు. దృష్టి ఎప్పుడూ ఈ దశను దాటి ముందుకు వెళ్లడం మీదే ఉండాలి.
2 ఆలోచనలన్నీ ప్రతికూల ఫలితాల చుట్టూనే తిరుగుతూ పదేపదే వాటి గురించి ఆలోచించడం వల్ల మనసంతా బాధతో నిండిపోతుంది. కోపం, చిరాకు, విచారం, భయం, అసహనం, అవమానం... లాంటి భావోద్వేగాలు కలుగుతుంటాయి.
చాలామంది విషయంలో ఇలాగే జరుగుతుంటుంది. అయినాసరే పూర్తిగా నిరాశతో కుంగిపోకూడదు. ఎందుకంటే ఆ ప్రభావం ఆరోగ్యం మీదా పడుతుంది. దాంతో విపరీతమైన ఒత్తిడికి గురికావడం, సరిగా నిద్రపట్టకపోవడం లాంటి ఇబ్బందులూ ఎదురవుతాయి. అందుకే సాధ్యమైనంత త్వరగా ఆ సమస్య నుంచి బయటపడటానికి శాయశక్తులా ప్రయత్నించాలి.
3 ఈ విచారం నుంచి బయటపడటానికి కొందరికి కొన్ని రోజులు పడితే, మరికొందరికి నెలలే పట్టొచ్చు. ఈ బాధను మర్చిపోలేకపోతే పేపరు మీద వివరంగా రాసుకుంటే కొంత ఊరటగా ఉండవచ్చు.
ఇంకా సాంత్వన పొందకలేకపోతే స్నేహితులూ, కుటుంబసభ్యులతోనూ భారాన్ని పంచుకోవచ్చు. వారి సలహాలూ, సూచనలను పాటించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
4 ప్రతికూల ఫలితాలు రాగానే బాధపడుతూ అక్కడే ఆగిపోకుండా.. ముందుగా కారణాలను అన్వేషించాలి. వాటికి అందుబాటులో ఉన్న పరిష్కారాల మీదా దృష్టి పెట్టాలి. ఒకవేళ చదివిన పద్ధతి, పరీక్షలకు సిద్ధమైన విధానం.. వేటిలో లోపాలున్నాయో తోటి స్నేహితులను అడిగి తెలుసుకోవాలి.
వాళ్లయితే మీ లోపాలను నిర్మొహమాటంగా చెప్పగలుగుతారు. పాఠ్యాంశాలను సరిగా అర్థంచేసుకోలేకపోతే అధ్యాపకుల, నిపుణుల సలహాలను తీసుకోవాలి.
5 లక్ష్యాలు ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. మీరు ఊహించిన దానికీ.. వాస్తవంగా జరిగేదానికీ చాలా తేడా ఉంటుంది. పరీక్షల్లో మీకు ఎప్పుడూ 60 శాతం మార్కులే వస్తాయనుకుందాం. వెంటనే 99 శాతం మార్కులు రావాలనుకోకూడదు.
ఒకేసారి కాకుండా అంచెలంచెలుగా లక్ష్యాన్ని పెంచుకుంటూ.. దాన్ని చేరుకోవడానికి కష్టపడి ప్రయత్నించాలి. అంతేగానీ వాస్తవానికి దూరంగా ఉండే లక్ష్యాలను పెట్టుకుని ఆశించిన ఫలితాలు రాలేదని నిరాశచెందడం వల్ల ప్రయోజనం ఉండదు.
6 నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మనసులో ముందుగానే ఊహించుకోవాలి. సాధనలో వాస్తవంగా ఎదురయ్యే అవరోధాల గురించీ ఆలోచించాలి. వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికనూ రూపొందించుకోవాలి.
సరైన ప్రణాళిక లేకుండా అనుకున్నదే తడవుగా అనుకూల ఫలితాలను సాధించాలనుకోవడం గాలిలో దీపం పెట్టడం లాంటిదే.
7 గతంలో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతికూల ఫలితాలకు కారణమైన పాత పద్ధతులనే మళ్లీ అనుసరిస్తూ.. ఫలితాలు మాత్రం అనుకూలంగా రావాలని కోరుకోకూడదు కదా? లక్ష్యాన్ని చేరుకోవడానికి కొత్త ప్రణాళికను రూపొందించుకోవాలి.
ఇప్పటివరకూ అనుసరిస్తోన్న విధానం సరికాదనిపిస్తే.. మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకానీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదని ముందుకు వెళ్లకుండా.. సమీక్షించుకుని తప్పులు సరిదిద్దుకోవాలి.
8 క్రమం తప్పకుండావ్యాయామాలు చేయడం, పోషకాహారం తీసుకోవడం, ధ్యానం చేయడం వల్ల శారీరకంగానే కాదు... మానసికంగానూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచడానికి ధ్యానం తోడ్పడుతుందని అధ్యయనాలూ చెబుతున్నాయి.
0 Comments:
Post a Comment