డాక్టర్ ఆర్కాట్ జి. రంగరాజ్ అంటే ఎవరో మన భారతీయులకు తెలియదు. కానీ దక్షిణ కొరియా ప్రజలకు ఆ పేరు సుపరిచితం. ఆయన అసమాన ధైర్యసాహసాలు, రెండు లక్షలమంది సైనికులకు ప్రాణదానం చేసిన వైనం కొట్టినపిండి.
రంగరాజ్ ఫోటోను ఆ దేశంలోని ప్రతి స్కూలులో ఉంచి గౌరవంగా నివాళి అర్పించారంటే ఆయన పట్ల కొరియన్లకు ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు.
1950 నుంచి 1953 మధ్య భీకరంగా సాగిన కొరియన్ యుద్ధంలో రంగరాజ్ ఒక వైద్యుడిగానే కాదు, మనసున్న మనిషిగా చేతనైనంత సాయం చేశారు.
గాయపడి నెత్తురోడుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న 2 లక్షల మంది సైనికులకు అత్యవసర, వైద్యం, సర్జరీలు నిర్వహించారు. మన దేశంలో, ఇతర దేశాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయన మహావీర చక్ర అవార్డు అందించింది. అయితే దక్షిణ కొరియన్లు అంతకు మించిన గౌరవాన్ని తమ హృదయాల్లో నింపుకున్నారు.
1917లో తమిళనాడులోని ఆర్కాట్‌లో జన్మించిన రంగరాజ్ మద్రాస్ మెడికల్ కాలేజీలో చదవి ఆనాటి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో వైద్యుడిగా చేరారు. పారాశ్యూట్ దళంలో పనిచేశారు. ఇండియాలో ఆయన తొలి పారా ట్రూపర్.
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై పోరాడి గాయపడిన భారత సైనికులకు చికిత్స అందించారు. స్వాతంత్ర్యం వచ్చాక 60వ పారాశ్యూట్ ఫీల్డ్ అంబులెన్స్ సారథ్యం చేపట్టారు. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల యుద్ధ సమయంలో ఐరాస వినతిపై భారత్ మానవతా సాయం కోసం రంగరాజ్ బృందాన్ని అక్కడికి పంపింది.
బృందంలోని 364 మంది వైద్య సిబ్బంది తుపాకుల, యుద్ధట్యాంకుల కాల్పుల మధ్య రెండు లక్షల మంది సైనికుల ప్రాణాలు కాపాడారు.
రంగరాజ్ చావుకు భయపడకుండా ప్రమాదకర పరిస్థితుల్లో సైతం క్షతగాత్రులకు వైద్యం, సర్జరీలు నిర్వహించారు. 23 వేల మందికి అత్యవసర సర్జరీలు చేశారు.
యుద్ధం తర్వాత కూడా రంగరాజ్ పలు దేశాల్లో వైద్య సేవలు అందించారు. అఫ్ఘానిస్తాన్‌లో మసూచి నివారణలో పాల్గొన్నారు.
2009లో 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 2020లో కొరియా యుద్ధానికి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దక్షిణ కొరియా ఆయన సేవలను గుర్తుగా 'యుద్ధవీరుడి' పుస్కారంతో గౌరవించింది. దేశంలో ప్రతి స్కూలు వద్ద ఆయన ఫొటోలు ఉంచి నివాళి అర్పించారు.
0 Comments:
Post a Comment