ఢిల్లీలో రోజురోజుకి పెరుగుతున్న వాయు కాలుష్యం తీవ్రతరం అవుతోంది. పొగమంచు కారణంగా శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా రోగులలో లక్షణాలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
అలాగే ముక్కు కారడం, తుమ్ములు, ముక్కు దిబ్బడ, గొంతు చిరాకు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వంటివి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని వారు చెబుతున్నారు.
వాయు కాలుష్య తీవ్రత ఇలాగే ఉంటే న్యూమోనియా, ఇతర ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు.
దయచేసి మాస్క్ ధరించండి
ప్రజలు వీలైనంత వరకు బయటకు వెళ్లడం మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కాలుష్య స్థాయి తక్కువగా ఉన్నప్పుడు అంటే మధ్యాహ్న సమయంలో మాత్రమే బయటకు వెళ్లాలని అంటున్నారు.
బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని డాక్టర్లు చెబుతున్నారు. కొద్ది రోజుల పాటు కూరగాయాలు, పండ్లతో కూడిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఉపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలంటున్నారు. మరోవైపు.. గాలి కాలుష్యం కారణంగా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని కొద్ది రోజుల పాటు పాఠశాలలు మూసివేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో ఆన్ లైన్లో క్లాసులు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
గాలి నాణ్యత
ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 400 మార్క్‌ను దాటింది. SAFAR ప్రకారం.. ఢిల్లీలో తీవ్రస్థాయికి చేరగా.. ఏక్యూఐ 408గా నమోదైంది.
సెంట్రల్ ఢిల్లీలోని మందిర్ మార్గ్ వంటి కొన్నింటిని మినహాయించి రాజధానిలోని చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 300 కంటే ఎక్కువగా నమోదైంది.
ఈ పరిస్థితుల్లో ఆరోగ్యవంతమైన వ్యక్తులు కూడా అనారోగ్యానికి గురవుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాలుష్యం తీవ్రతరం కావడంతో ఇప్పటికే.. ఢిల్లీలో అన్ని నిర్మాణ పనులను, కూల్చివేతలను అధికారులు నిలిపివేయించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కార్యకలాపాలపై ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment