ధరలు పెరగడంతో, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతోంది. దాంతో, ప్రజల ఆలోచనా విధానంలో కూడా మార్పు వస్తున్నదని, సెకండ్ హ్యాండ్ బట్టలపై మోజు పెరుగుతోందని వాటిని అమ్మే దుకాణాలు చెబుతున్నాయి.
"పర్యావరణానికి మేలు చేస్తుంది, మీ జేబులకూ మేలు చేస్తుంది" అని సెకండ్ హ్యాండ్ బట్టల కొనుగోలుదారులు అంటున్నారు.
లారెన్ నాప్‌మన్ తరచూ సెకండ్ హ్యాండ్ దుకాణాల్లో బట్టలు కొంటారు. వాటి గురించి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు.
వ్యయాలు పెరిగిపోవడం ఒక కారణం అయితే, పర్యావరణ అనుకూల జీవిత విధానాన్ని సాధించడం మరో కారణమని 28 ఏళ్ల లారెన్ అంటున్నారు.
"గతంలో సెకండ్ హ్యాండ్ బట్టలపై చిన్నచూపు ఉండేది. అవి వేసుకుంటే మనల్ని పేదవాళ్లుగా చూస్తారేమోనన్న భావన వల్ల కావచ్చు. కానీ, ఇప్పుడు ఆలోచనా విధానం మారుతోంది. ఎందుకంటే, దీనివల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది. అలాగే, భూమికి భారం తగ్గుతుంది. వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి" అని లారెన్ అంటున్నారు.
ఏప్రిల్‌లో లారెన్‌కు వివాహం అయింది. సెకండ్ హ్యాండ్ వైన్ గ్లాసులు, క్యాండిల్ స్టాండ్, కేక్ స్టాండ్స్ కోసం ఆమె ఊరంతా గాలించారు.
"కాస్త వెతికితే అన్నీ సెకండ్ హ్యాండ్‌లో దొరుకుతాయి. కొత్తవి కొనుక్కోనక్కర్లేదు. మా అవసరం తీరిపోయాక వాటన్నిటినీ అమ్మేశాం కూడా. ఇంట్లో వస్తువులు పేరుకుపోకుండా జాగ్రత్తపడ్డాం" అన్ని చెప్పారామె.
మరో ఔత్సాహికురాలు కెల్లీ అలెన్ (40) కూడా సస్టైనబుల్ ఫ్యాషన్ (పర్యావరణ అనుకూల ఫ్యాషన్) గురించి ఒక బ్లాగ్ రాస్తున్నారు.
సస్టైనబుల్ ఫ్యాషన్ అంటే సెకండ్ హ్యాండ్ బట్టలు కొని వేసుకోవడం.
"ఇదొక ట్రెజర్ హంట్ లాంటిది. ఆ దుకాణాలకు వెళ్లినప్పుడు కొన్ని రత్నాలు కనిపిస్తాయి. వీటిని అమ్ముకోవడానికి కష్టపడుతున్న దుకాణదారులకు సహాయంగా ఉంటుంది. కొంచం ఫ్యాషనబుల్‌గా కూడా ఉంటుంది" అంటున్నారామె.
బ్రిటన్‌లో సెకండ్ హ్యండ్ బట్టలు అమ్మే దుకాణాలు చారిటీ దుకాణాలుగా ఉంటాయి. అంటే వీటికి వచ్చే ఆదాయాన్ని చారిటీకి ఉపయోగిస్తారు.
బ్రిటన్‌లో ఇటీవల క్యాన్సర్ రిసెర్చ్ యూకే నెటర్క్ చారిటీ షాపుల (సెకండ్ హ్యాండ్ షాప్స్) అమ్మకాల్లో 14 శాతం పెరుగుదల కనిపించింది.
వేల్స్‌లోని అతిపెద్ద సెకండ్ హ్యాండ్ షాప్ అయిన కార్డిఫ్ సూపర్‌స్టోర్‌లో 10 శాతం పెరుగుదల కనిపించింది.
చాలామంది సెకండ్ హ్యాండ్ దుస్తుల వైపు మొగ్గు చూపడానికి కారణం "అవసరం, తమ డబ్బు సద్వినియోగం అవుతుందన్న భావన కూడా" అని క్యాన్సర్ రిసెర్చ్ యూకే డైరెక్టర్ ఆఫ్ ట్రేడింగ్ జూలీ బైర్డ్ అన్నారు.
మరోవైపు, చారిటీ సంస్థలకు వస్తున్న డొనేషన్లు తగ్గుతున్నాయని, కారణం కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడమేనని ఆమె అన్నారు.
BBCరైస్ జోన్స్
సెరెడిజియన్‌లోని లాంపేటర్‌లో ఉన్న ది క్లైమేట్ షాప్‌లో, సెకండ్ హ్యాండ్ బట్టలకు పౌండ్లలో కాక చెట్లలో ధరలు ఉంటాయి. ఎందుకంటే కెన్యాలో చెట్లను పెంచే ప్రయత్నాలకు ఈ స్వచ్ఛంద సంస్థ నిధులు సమకూరుస్తోంది.
ఆ దుకాణంలో వలంటీర్‌గా పనిచేస్తున్న పట్టణ డిప్యూటీ మేయర్ రైస్ జోన్స్ మాట్లాడుతూ, ఇక్కడకు వస్తున్నవాళ్లల్లో చాలామంది తమ అవసరాలు తీర్చుకోవడానికి కూడా కష్టపడుతున్నవారు" అని అన్నారు.
"ప్రజలు త్యాగాలకు పూనుకుంటున్నారు. అయితే, సెకండ్ హ్యాండ్ బట్టలు వేసుకోవడమేం తప్పు కాదు అని కూడా అనుకుంటున్నారు. కరోనా మహమ్మారి వల్ల ప్రజలు స్థానికంగా బట్టలు కొనడం ఎక్కువైంది. దాంతో, కొనుగోలు ప్రవర్తన కూడా మారింది. 'స్థానిక సమాజానికి నేనేం చేయగలను, అలాగే భూమిని కాపాడడానికి నేనేం చేయగలను ' అని ఆలోచిస్తున్నారు" అని ఆయన చెప్పారు.
బట్టలకే కాదు తలుపులు, కిటికీలకు కర్టెన్లు వంటివి కూడా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొంటున్నారని మరో వలంటీర్ సారా అవిలా చెప్పారు.
పాత టీ-షర్ట్, బెడ్‌షీట్ కలిపి తన స్నేహితురాలు తన కోసం దుస్తులు తయారుచేశారని ఫ్యాషన్ బ్లాగర్ కెల్లీ అలెన్ చెప్పారు. ఇంటి బడ్జెట్ పెరిగిపోవడం వలన ప్రజలు సెకండ్ హ్యాండ్ దుస్తుల వైపు మొగ్గు చూపుతున్నారని కెల్లీ అన్నారు.
"కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం వలనే ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పులు వస్తున్నాయి. పర్యావరణ నిపుణులు ఎప్పటి నుంచో ఇలాంటి మార్పు కోసమే పిలుపునిస్తున్నారు" అని రిపేర్ కేఫ్ వేల్స్ డైరెక్టర్ ఫోబ్ బ్రౌన్ అన్నారు.
"ఆర్థిక కష్టాలు ప్రజల ప్రవర్తనలో బలవంతంగా మార్పులు తెస్తున్నాయన్నది సిగ్గుపడాల్సిన విషయం. కానీ, అదే నిజం. అదే జరుగుతోంది" అని ఆమె అన్నారు.
"ఇలాంటి మార్పు కోసమే ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాం. ఈ వైఖరి కొనసాగుతుందని ఆశిస్తున్నాం" అన్నారామె.
0 Comments:
Post a Comment