మెల్లకన్ను ఉన్న పిల్లల చేత కంటి వ్యాయామాలు చేయించడం వల్ల ఫలితం ఉంటుంది. ఇందుకోసం కంటికి దగ్గరగా పెన్సిల్‌ను ఉంచి, పెన్సిల్‌ను, దూరంగా ఉన్న ఇంకేదైనా వస్తువును మార్చి మార్చి చూసేలా వ్యాయామాలు చేయించాలి.
పెద్దల్లో లాగే పిల్లల్లో కూడా దృష్టి దోషాలు సహజం. 'పిల్లలు పెరిగేకొద్దీ అన్నీ సర్దుకుంటాయిలే!' అని నిర్లక్ష్యం చేస్తే, శాశ్వతంగా కంటి చూపే పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పిల్లల కంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు కంటి వైద్యులు.
పిల్లల్లో పుట్టుకతో లేదా పెరిగే క్రమంలో కంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని పెద్దలు తేలికగానే కనిపెట్టవచ్చు. కొన్ని సమస్యలు కనుగుడ్లలో స్పష్టంగా కనిపిస్తే, ఇంకొన్ని పిల్లలు ప్రవర్తన ద్వారా బయల్పడుతూ ఉంటాయి. పిల్లల్లో సాధారణంగా తలెత్తే కంటి సమస్యలు ఏవంటే...
కళ్లలో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ (దృష్టి దోషాలు)
దూరం లేదా దగ్గరి వస్తువులు కనిపించని సమస్య ఇది. దూరంగా ఉన్నవి కనిపించవు కాబట్టి పిల్లలు దగ్గరకు వెళ్లి చూస్తూ ఉంటారు. పుస్తకాలను కళ్లకు దగ్గరగా ఉంచుకుని చదవడం, టివి లేదా బ్లాక్‌బోర్డు దగ్గరకు వెళ్లి చూడడం చేస్తూ ఉంటారు.
ఆటలకు కూడా పిల్లలు దూరంగా ఉంటూ ఉంటారు. ఎక్కువ సమయాల పాటు తోటి పిల్లలతో కలవకుండా, అంతర్ముఖులుగా ఇళ్లకు, తమ గదులకే పరిమితమైపోతూ ఉంటారు. చదువులో కూడా వెనకపడిపోతూ ఉంటారు.
పిల్లల్లో ఈ లక్షణాలను గమనించినప్పుడు ఆలస్యం చేయకుండా కంటి వైద్యుల చేత పరీక్ష చేయించాలి. కళ్లలో సమస్య ఉందని తేలినప్పుడు, కళ్లజోడు వాడుకోవలసి ఉంటుంది.
ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే, పిల్లల కంటిచూపు బాగా దెబ్బతిని, అంధత్వం వచ్చే అవకాశం ఉంటుంది. కంటి నంచి మెదడుకు సిగ్నల్స్ అందక కన్ను లేజీ ఐగా మారి, 'ఆంబ్లియోపియా' అనే పరిస్థితి తలెత్తుతుంది. ఈ సమస్యను చికిత్సతో చక్కదిద్ది, కంటిచూపును మెరుగు పరచడం కష్టం.
కాబట్టి సమస్యను ఎంత త్వరగా గుర్తించి, చికిత్స ఇప్పిస్తే, అంతగా మెరుగ్గా కంటిచూపును కాపాడుకోగలిగిన వాళ్లం అవుతాం.
మెల్లకన్ను
ముక్కు వైపు లేదా చెవి వైపుకు ఒక కన్ను తిరిగిపోయి ఉండే సమస్య ఇది. కంట్లోని కండరాల వల్లే కనుగుడ్లు అటూ, ఇటూ తిరుగుతూ ఉంటాయి. ఈ కండరాల్లో సమస్య ఉన్నప్పుడు, మెల్లకన్ను ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో సరిగా ఉన్న కన్ను నుంచి మాత్రమే సిగ్నళ్లు మెదడుకు చేరుకుంటూ ఉంటాయి.
వంకర తిరిగిన కన్ను నుంచి సిగ్నళ్లు మెదడుకు అందక, అంతిమంగా ఆ కన్ను ఆంబ్లియోపియాకు దారి తీస్తుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే మెల్లకన్నును నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.
చికిత్సలో భాగంగా సమస్య ఉన్న కంట్లో ఎక్కువగా పని చేసే కండరాలను బలహీనపరిచి, తక్కువగా పని చేసే కండరాలను బలపరిచే సర్జరీ చేయవలసి ఉంటుంది. దాంతో సమస్య సర్దుకుని, కనుగుడ్డు సాధారణ స్థితికి చేరుకుని, మున్ముందు కంటిచూపు దెబ్బతినకుండా ఉంటుంది.
క్యాటరాక్ట్
సాధారణంగా శుక్లాలు పెద్దలకే వస్తాయనుకుంటాం. కానీ పిల్లల్లోనూ కంటి శుక్లాలు వస్తాయి. పుట్టిన పిల్లల్లోనూ శుక్లాలు (కంజెనైటల్ క్యాటరాక్ట్) ఉండవచ్చు. పెరిగే క్రమంలో (డెవల్‌పమెంటల్ క్యాటరాక్ట్) తలెత్తవచ్చు. మేనరికాలు, దగ్గరి రక్తసంబంధీకులను పెళ్లిళ్లు చేసుకున్నవారికి పుట్టే పిల్లల్లో కంటి శుక్లాలు, గ్లాకోమాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ సమస్య ఉన్న పిల్లల నల్ల కనుగుడ్డు తెల్లగా ఉంటుంది.
ఈ లక్షణాన్ని గుర్తించిన వెంటనే వీలైనంత త్వరగా కంటి వైద్యుల చేత పరీక్ష చేయించాలి. పిల్లల్లో కంటి శుక్లాలకు వయసును బట్టి తగిన చికిత్సను వైద్యులు ఎంచుకుంటారు. అయితే పెరిగే పిల్లల్లో శుక్లాలను (డెవల్‌పమెంట్ క్యాటరాక్ట్) కనిపించకపోవచ్చు. ఇలాంటప్పుడు పిల్లలు తడుముకుంటూ నడవడం, ఫర్నిచర్‌కు గుద్దుకుంటూ పడిపోతూ ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తే కంటి వైద్యుల చేత పరీక్ష చేయించాలి. సాధారణంగా పెద్దల్లో కంటి శుక్లాలను తొలగించి, దాని స్థానంలో ప్లాస్టిక్ అద్దాన్ని అమర్చడం జరుగుతుంది.
కానీ పిల్లల్లో చికిత్సా విధానం కొంత భిన్నంగా ఉంటుంది. పుట్టుకతో, లేదా రెండు నుంచి మూడేళ్ల వయసులోపు పిల్లల్లో శుక్లాలు ఉన్నప్పుడు, వైద్యులు సర్జరీ చేసి, దళసరి అద్దాలను సూచిస్తారు. కొన్నేళ్ల తర్వాత, సర్జరీ చేసి కంట్లో లెన్స్ అమరుస్తారు. కంటిచూపును కరెక్టుగా అంచనా వేయడానికి పిల్లల వయసు కనీసం 12 సంవత్సరాలైనా ఉండాలి.
కాబట్టి పిల్లల క్యాటరాక్ట్ విషయంలో వైద్యులు ఈ రకమైన వైద్య విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. పిల్లల్లో కంటి శుక్లాలను కనిపెట్టి సరిదిద్దకపోతే, అంధత్వం ప్రాప్తించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పెద్దలు అప్రమత్తంగా ఉండాలి.
గ్లాకోమా(నీటి కాసులు)
పెద్దలతో పాటు చిన్న పిల్లల్లో కూడా గ్లాకోమా వస్తుంది. అయితే ఈ సమస్యను సమర్థంగా సరిదిద్దగలిగే సామర్థ్యం కేవలం పీడియాట్రిక్ గ్లాకోమా చికిత్సలో నిష్ణాతులైన కంటి వైద్యులకే సాధ్యపడుతుంది. కాబట్టి వైద్యులను ఎంచుకునేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. మన ఒంట్లో రక్తపోటు ఉన్నట్టుగానే, కంటి లోపల కూడా రక్తపోటు ఉంటుంది.
ఈ ఇంట్రాక్యులర్ ప్రెజర్ పెరిగినప్పుడు, నల్లగుడ్డు లోపల నీరు చేరి, మసకబారిన అద్దంలా మారిపోతుంది. ఈ సమస్య అప్పుడే పుట్టిన పిల్లల్లో ఉండవచ్చు. పెరిగే క్రమంలో కూడా బయల్పడవచ్చు. ఈ సమస్య ఉన్న పిల్లల కళ్ల లోపల ఒత్తిడి పెరిగిపోయి, కనుగుడ్డు పెద్దదిగా మారుతుంది. స్పష్టంగా కనిపించే ఈ లక్షణాన్ని బట్టి గ్లాకోమా ఉందని అనుమానించి, కంటి వైద్యుల చేత పరీక్షలు చేయించాలి. ఈ సమస్యను చుక్కల మందులతో కొంత మేరకు సరిదిద్దే వీలున్నప్పటికీ, ఈ మందులతో చిన్న పిల్లల్లో దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తగు మోతాదుల్లో మందులను వాడుకుంటూ, అవసరాన్ని బట్టి సర్జరీ చేయవలసి ఉంటుంది.
మరీ ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లల్లో చుక్కల మందులతో అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కాబట్టి పిల్లల్లో కనుగుడ్లు పెద్దవిగా పెరిగి, పిల్లలు తడుముకుంటూ నడుస్తూ ఉంటే, గ్లాకోమాగా అనుమానించాలి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే, అది పూర్తి అంధత్వానికి దారి తీస్తుందనే విషయాన్ని పెద్దలు గుర్తు పెట్టుకోవాలి.
కంజెనిటల్ కార్నియల్ ఒపాసిటీ
నల్లగుడ్డులో డిస్ట్రోఫీ పరిస్థితి ఇది. ఇది వంశపారంపర్యంగా సంక్రమించే సమస్య. నల్లగుడ్డులోని వేర్వేరు పొరల్లో ఒపాసిటీలు ఏర్పడతాయి. దాంతో వెలుగు కిరణాలు కనుగుడ్డులోకి ప్రవేశించలేవు. దాంతో మెదడుకు సిగ్నళ్లు అందక కంటిచూపు దెబ్బతింటుంది. పిల్లల్లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు, కార్నియా మార్పిడి తప్ప వేరే ప్రత్యామ్నాయం ఉండదు.
కంటికి దెబ్బలు తగిలితే?
దెబ్బ తగిలిన కంట్లో తల్లిపాలు, నూనెలు లాంటివి వేయడం ప్రమాదకరం. కంటికి దెబ్బ తగిలిన వెంటనే కంటి వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలి.
కంట్లో గుచ్చుకున్న వస్తువులను స్వయంగా లాగడం, నాలుకతో తొలగించడం లాంటివి చేయకూడదు.
రసాయనాలు, బాణాసంచా మందులు, పెయింట్లు లాంటివి కంట్లో పడ్డప్పుడు, కంటి నష్టాన్ని నివారించడం కోసం వెంటనే శుభ్రమైన నీళ్లతో కళ్లను కడగాలి. తర్వాత వైద్యులను కలవాలి.
పిల్లల జోడు వాడకం ఇలా...
పడుకునేటప్పుడు మినహా మిగతా సమయమంతా పిల్లలు జోడు వాడేలా చూసుకోవాలి.
జోడు ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా, జాగ్రత్తగా ఉంచుకునేలా పిల్లలకు అలవాటు చేయాలి.
కళ్లద్దాల మీద గీతలు పడితే పిల్లలు కనిపెట్టలేక, అలాగే వాడేస్తూ ఉంటారు. దాని వల్ల కూడా విజన్ తగ్గి, కంటి చూపు దెబ్బ తింటుంది. కాబట్టి కళ్లద్దాలను పెద్దలు పరిశీలిస్తూ ఉండాలి.
పిల్లల్లో కంటి పవర్ వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అవసరాన్ని బట్టి అద్దాల పవర్‌ను పెంచుతూ ఉండాలి. అలా చేయకపోతే కంటిచూపు దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి ఆరు నెలలకోసారి పిల్లల కంటిచూపును వైద్యుల చేత పరీక్ష చేయిస్తూ ఉండాలి.
కళ్లను దానం చేద్దాం!
కార్నియా డొనేషన్ తక్కువ కాబట్టి మన దేశంలో పిల్లల్లో అంధత్వం ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితిని సరిదిద్దాలంటే ప్రతి ఒక్కరూ కంటి దానానికి పూనుకోవాలి. అందుకోసం ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో పేరు నమోదు చేసుకోవాలి. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియపరచాలి. ఇలా చేయడం వల్ల మన మరణానంతరం, మన కళ్ల ద్వారా పిల్లలకు చూపునూ దాంతో పాటు కొత్త జీవితాన్నీ అందించిన వాళ్లమవుతాం! అయితే చనిపోయిన ఆరు గంటల లోపే కార్నియాను సేకరించవలసి ఉంటుంది. కాబట్టి ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు తెలియపరచడంలో ఆలస్యం చేయకూడదు.
అపోహలు - వాస్తవాలు
మెల్ల కన్ను అదృష్టం కాదు
పిల్లలు మెల్లకన్నుతో పుడితే వాళ్లు అదృష్టవంతులు అనుకుంటే, చేతులారా వాళ్ల కంటిచూపును పోగొట్టినవాళ్లం అవుతాం. మెల్లకన్ను సమస్యను వీలైనంత త్వరగా కంటి వైద్యుల దృష్టికి తీసుకువెళ్లి, సమస్యను సరిదిద్దాలి.
కళ్లజోడు అవసరమా?
పిల్లలకు కంటి వైద్యులు కళ్లజోడు సూచిస్తే, 'ఇంత చిన్న పిల్లలకు అంత లావుపాటి అద్దాలు అవసరమా? పెద్దయితే కంటిచూపు అదే సర్దుకుంటుందిలే'.. అనుకుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ కళ్లజోడు వాడకం ఆపేస్తే, ఏకంగా అంధత్వమే సంప్రాప్తించే ప్రమాదం ఉంటుంది.
క్యారెట్లతో కంటి చూపు మెరుగవదు
కంటి చూపు మెరుగవడం కోసం పిల్లలకు క్యారెట్లను తినిపించాలని కోరుకునే తల్లులు ఎక్కువ. కాని క్యారెట్లతో ఆరోగ్య ప్రయోజనాలు దక్కే మాట వాస్తవమే అయినా, ప్రత్యేకించి కళ్లకు ఎలాంటి మేలూ ఒరగదు. కాబట్టి పిల్లల కంటిచూపు మెరుగ్గా ఉండడం కోసం వైద్యులు సూచించిన జోడునే వాడుకోవాలి.
0 Comments:
Post a Comment