మనలో చాలా మందికి మాంసాహారమంటే ఇష్టం. ముక్క లేనిదే ముద్ద దిగని వారు ఎందరో ఉన్నారు. అందులోనూ మాంసాహార ప్రియులకు చికెన్ (Chicken) బాగా ఇష్టం.
ఐతే చికెన్ వంటకాలు ఎక్కువగా తినే వారి గుండెలు బద్ధలయ్యే వాస్తవం ఒకటి వెలుగులోకి వచ్చింది. చికెన్ ఉడికించి..కర్రీ చేసుకొని తింటే ఓకే. కానీ మంట లేదా నిప్పులపై కాల్చుకొని తింటే మాత్రం క్యాన్సర్ (Cancer) వస్తుందట.
ఇలాంటి మాంసాన్ని (Charred Meat) ఎక్కువగా తింటే ప్రాణాలు పోయే ప్రమాదముందని ఓ అధ్యయనంలో తేలింది. స్టీక్ మీట్ తింటే పాంక్రియాటిక్ క్యాన్సర్ (Pancreatic cancer) ప్రమాదముందని వెల్లడయింది.
బాగా కాల్చిన చికెన్‌ను ఎక్కువగా తినే వారు, తినని వారిపై అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయం సర్వే చేసింది. దాని ప్రకారం.. కాల్చిన మాంస తినని వారితో పోల్చితే.. తినే వారిలో 60 శాతం ఎక్కువ మందికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
మాంసాన్ని నేరుగా మంట మీద పెట్టి కాల్చడం వల్ల దాని పైపొర మీద క్యాన్సర్ సమ్మేళనాలు ఏర్పడే ప్రమాదం ఉంది. బాడీ బిల్డర్స్‌లో శరీర కండరాలు పెరిగేందుకు దోహదపడే క్రియాటిన్ ఆర్గానిక్ యాసిడ్.. అధిక మంట మీద వేడి చేసినప్పుడు హెటెరోసైక్లిక్ అమైన్ అనే క్యాన్సర్ కారకంగా మారుతుందట.
అంతేకాదు మాంసం మంటపై కాలుతున్నప్పుడు వాటి కొవ్వు నిప్పుల మీద పడి.. పాలీసైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రోకార్బన్‌కి దారితీస్తుంది. ఇది మానవ ఆరోగ్యానికి అత్యంత హానికరమని నిపుణులు వెల్లడించారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ని ప్రారంభ దశలో గుర్తించడం చాలా కష్టం.
ఇది మనకు వచ్చినా బయటకు కనిపించదు. అది బయటపడే లోపే.. ఇతర అవయవాలకు వ్యాపించి.. మరింత తీవ్రమవుతుంది. అనంతరం ప్రాణాలు కూడా పోయే అవకాశముందని నిపుణులు పేర్కొన్నారు.
ఐతే ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాంసాన్ని బార్బిక్యూ లేదా తందూర్ పద్దతిలో వండుకోవాలని అనుకున్నప్పుడు.. దానిని మేరినేట్ చేయాలి.
నిప్పులపై కాల్చడానికి ముందు కనీసం 30 నిమిషాల పాటు మేరినేషన్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ మాంసం రుచిగా ఉండడంతో పాటు.. ఆ మేరినేషన్ మాంసానికి, నిప్పుల వేడికి మధ్య అడ్డుగోడలా పనిచేస్తుంది.
నిప్పుల మంట నేరుగా మాంసానికి తగలకపోవడం వల్ల.. క్యాన్సర్ కారకాలు ఏర్పడేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. ఇక వంట చేసే ముందు గ్రిల్‌ని బాగా శుభ్రం చేసుకోవాలి.
అంతకుముందు చేసిన వంట నుంచి మిగిలిపోయిన, మాడిపోయిన పదార్థాల్లోనూ క్యాన్సర్ కారకాలు ఉండవచ్చు. అందువల్ల గ్రిల్‌ను బాగా శుభ్రం చేసిన తర్వాతే.. తదుపరి వంటకు వినియోగించాలి.
ఈ జాగ్రత్తలు పాటిస్తేనే.. కాల్చిన చికెన్ తినాలి. లేదండే ఉడికించి.. తీసుకోవడమే బెటర్ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
0 Comments:
Post a Comment