Canada: వలసలపై కెనడా సంచలన నిర్ణయం.. భారతీయులకు పండగే!
తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న కెనడా (Canada) వలసల విషయంలో తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 2025 నుంచి ప్రతియేటా 5లక్షల మంది వలసదారులను (Immigrants) ఆహ్వానం పలకాలని నిర్ణయించింది.
ఒట్టావా: తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న కెనడా (Canada) వలసల విషయంలో తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 2025 నుంచి ప్రతియేటా 5లక్షల మంది వలసదారులను (Immigrants) ఆహ్వానం పలకాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ (Sean Fraser) మంగళవారం కొత్త ప్రణాళికను వెల్లడించారు. ప్రతియేటా అవసరమైన స్థాయిలో నైపుణ్యం గల కార్మికులను ఆహ్వానించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు సైతం బలం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇక తాజా ప్రణాళిక కారణంగా విదేశాల నుంచి వలసల వరద పారడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా గతేడాది 4.05లక్షల మంది విదేశీయులకు కెనడాలో ఆశ్రయం కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక 2023లో ఈ సంఖ్య 4.65లక్షలకు చేరే అవకాశం ఉందన్నారు. అందుకే 2025 నుంచి ప్రతియేటా 5లక్షల మంది విదేశీ కార్మికులను ఆహ్వానించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. కాగా, కొత్తగా వచ్చిన వారిలో ఎక్కువ మందిని ఎకనామిక్ ఇమ్మిగ్రెంట్స్ అని పేర్కొన్న మంత్రి.. వీరు ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో ఖాళీగా ఉన్న దాదాపు 10లక్షల ఉద్యోగాల్లో కొన్నింటిని భర్తీ చేస్తారని అన్నారు. దేశ శ్రామికశక్తి వృద్ధికి కారణమైన వలస కార్మికులను ఎట్టిపరిస్థితుల్లో విస్మరించబోమని తెలిపారు.
ప్రస్తుతం కెనడియన్ ఆర్థిక వ్యవస్థలో మిలియన్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని చెప్పిన మంత్రి ఫ్రేజర్.. "మేము వలసలను స్వీకరించకపోతే మా ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుకోలేము" అని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. కెనడాకు వలస వెళ్లే వారిలో భారతీయులే (Indians) అధిక సంఖ్యలో ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో కెనడా తీసుకున్న తాజా నిర్ణయం వల్ల మరింత మంది భారత ప్రవాసులు (Indian Expats) ఆ దేశానికి వెళ్లేందుకు మార్గం సుగమమైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కెనడాకు వెళ్లాలనుకునే భారతీయులకు అధిక మేలు చేసే నిర్ణయమని అభివర్ణిస్తున్నారు.
0 Comments:
Post a Comment