అరుణాచలేశ్వర కోవెలలో స్వామి అర్చామూర్తి. శిలాకృతి. సాలంకృత సదానంద స్ఫూర్తి. ఆ బొమ్మా పలుకదు. పర్వత సానువుల్లో నివసించిన భగవాన్ రమణులు మౌనస్వామి.
పలుకు... బంగారమైన ప్రదేశమిది.
'భగవాన్! మీరు అరుణాచలాన్ని శివుడు అంటారే! ఆయన కొండ కావడంలో ఆంతర్యం?' అని ఒకరు ప్రశ్నించినప్పుడు, మనమందరం మానవదేహం ధరించినట్లే శివుడూ కొండగా ఉండాలనుకున్నాడు.
అదంతే!' అని రమణులు జవాబిచ్చారు. తిరువారూరులో జన్మమెత్తినా, చిదంబరంలో నటరాజునిదర్శించినా, కాశీలో మరణించినా ముక్తి తథ్యం. అయితే అరుణాచలాన్ని స్మరిస్తే చాలు, పరముక్తి లభించడం నిశ్చయం.
అందుకే రమణులు, అరుణాచలాన్ని గిరి రూపమైన కరుణాసముద్రంగా కీర్తించారు. తిరువణ్ణామలై పుణ్యక్షేత్రంలో.. మౌనం మూడు ముఖాలుగా అభివ్యక్తమవుతుంది.
అరుణాచలేశ్వర కోవెలలో స్వామి అర్చామూర్తి. శిలాకృతి. సాలంకృత సదానంద స్ఫూర్తి. ఆ బొమ్మా పలుకదు. పర్వత సానువుల్లో నివసించిన భగవాన్ రమణులు మౌనస్వామి. పలుకు… బంగారమైన ప్రదేశమిది.
రమణులు, వారికంటే ముందే గుడి, దానికంటే ముందు అరుణగిరి… ఇది పరంపర. అరుణగిరి ప్రదక్షిణ ప్రాముఖ్యాన్ని భగవాన్ రమణులు స్వయంగా ప్రపంచానికి తెలియజేస్తూ, గిరి ప్రదక్షిణ చేయవలసిందిగా సాధకులను ప్రోత్సహించారు. ఎందుకంటే, దక్షిణాపథంలో ఉన్న పంచలింగ క్షేత్రాల్లో ఇది తేజోలింగం.
అగ్నిక్షేత్రం. గౌతమ, అగస్త్యాది మహర్షులు దర్శించిన శోణాచలమిది. 43 కోణాలున్న శ్రీ చక్రాకారం ఉన్నది కనుక ఇది సుదర్శనగిరి. శంకర భగవత్పాదులు దీనిని 'మేరువు' అన్నారు. అనేక పురాణాల్లో అరుణాచల ప్రస్తావన స్పష్టంగా ఉంది.
జ్ఞానసంబంధుల వారు, తిరునావుక్కరసు, మాణిక్యవాచకులు, జ్ఞానదేవుల తండ్రి సిద్ధోజిపంతు, నామదేవ్, సమర్థ రామదాసు, విరూపాక్ష దేవులు, అరుణగిరి నాథులు, కొండప్ప దేశికులు, షణ్ముఖ యోగిని, అమ్మణ్ని అమ్మాళ్ వంటి మహనీయులు దర్శించి ఆత్మానుభూతి పొందిన పూర్ణాద్వైతపీఠం అరుణాచలం. ఇది అచలపీఠం. బ్రహ్మానంద నిలయం.
కొండపై ఉన్న గుహలన్నీ తపోవనాలు, స్వాత్మానంద బృందావనం. సదాశివ సమాశ్రితాలు. ఆదికాలం నుంచి తపస్వులకు తపోభూమిగా నిలిచిన అరుణాచలం, జ్యోతిర్లింగ స్వరూపం. అందువల్లే గిరి ప్రదక్షిణ చేయటం ప్రధానమైన ఒక ఆధ్యాత్మిక సాధనంగా రూపుదిద్దుకున్నది.
పార్వతీదేవి పరమేశ్వరుడి వామాంగిని అయినది ఇక్కడే. కనుక ఇది.. శివ-శక్తి గిరి. కొండంతా నిండిన అనేక దివ్య ఔషధ వృక్షాలు, సాధకుడికి శారీరక ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయి.
అష్ట దిక్పాలకులు పూజించే లింగాలన్నీ శక్తిమయాలు. అరుణాచల ప్రదక్షిణం నిజానికి శివశివానులకు చేసే సాక్షాత్ ప్రదక్షిణే!
ప్ర – అంటే పాపసంహారం
ద – కామ్యసిద్ధి
క్షి – జన్మరాహిత్యం
ణ – జ్ఞానమార్గంలో ముక్తి
పురాసంస్కృతికి అరుణాచలం ఒక గొప్ప స్మృతి. అరుణాచలం, జీవుడికి దేవుడికి ఉన్న దివ్య ప్రబంధం, కనబడే పూలు, కనబడని దారం కలిసి ఉన్నట్లు! శివ కుటుంబమంతా, కొలువుదీరిన కైలాసమే అరుణాచలం!
వెన్నెలలో అరుణాచల దర్శనం ఒక అపురూప ఆధ్యాత్మిక అనుభవం. మనసు నిశ్చలం చేసుకొని, నెమ్మదిగా నడుస్తూ, గిరిని చూస్తూ, వెన్నెల్లో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పరమశివ భంగిమలు, ఆకృతులు, ఆవిష్కృతమవుతూ లోచూపును విశాలం చేస్తూ, అంతరంగ స్పర్శను అనుగ్రహిస్తాయి. క్రమ వైరాగ్యాన్ని, క్రమ సన్యాసాన్ని అనుగ్రహించి, మనసును పరమేశ్వరాయత్తం చేయగల శక్తి, గిరి ప్రదక్షిణలో ఉన్నది.
బిరబిరా నడిచేది, గిరగిరా తిరిగేది ప్రదక్షిణ కాదు. శ్రీరమణాశ్రమం నుంచి ప్రారంభించి, పాలితీర్థం, అగస్త్యతీర్థం, ద్రౌపది గుడి, స్కందాలయం, యమలింగం, సిద్ధాశ్రమం, శోణతీర్థం, నైరుతి లింగం, హనుమాన్ గుడి, ఉణ్నామలై అమ్మగుడి, ఉణ్నామలై తీర్థం, రామలింగేశ్వరాలయం, ప్రతిధ్వని మంటపం, గోశాల, రాజరాజేశ్వరి ఆలయం, గౌతమ ఆశ్రమం, సూర్యలింగం, వరుణ లింగం, ఆదిఅణ్నామలై ఆలయం, రేణుకాలయం, వాయులింగం, అక్షర మంటపం, ఈశాన్యలింగం, ప్రవాళ పర్వతం, అరుణాచలేశ్వరాలయం, ఇంద్రలింగం, గురుమూర్తం, మామిడితోట, అగ్నిలింగం, శేషాద్రిస్వామి ఆశ్రమం, దక్షిణామూర్తి దేవాలయంతో ముగిస్తే, అది ప్రదక్షిణం. గిరి ప్రదక్షిణలో సాధకుడికి గిరిపైన ఉన్న స్కందాశ్రమం, విరూపాక్ష గుహ, పాదతీర్థం, గురు నమఃశివాయ సమాధి, రామదాసు గుహ, జడస్వామి ఆశ్రమం… వీటన్నిటినీ ప్రదక్షిణం చేసుకున్న ఆనందమూ లభిస్తుంది.
శేషాద్రిస్వామి రమణుల సమకాలీనులు. వారు ఉన్మత్తులు. మహామహిమోపేతులు, సిద్ధపురుషులు. గిరి ప్రదక్షిణ నిజానికి ఆత్మ ప్రదక్షిణే! ప్రపంచానికి హృదయస్థానం, అరుణాచలం. మానవ హృదయం చైతన్యస్థలి. అది ఆత్మారామం.
గిరిప్రదక్షిణ నిజానికి ఈశ్వర- గురు ప్రదక్షిణ. అయిదు ముఖాలుగా గోచరించే సదాశివ స్వరూపం, సాధకుణ్ని అంతర్ముఖుణ్ని చేసి, జ్యోతిర్మయమైన లోవెలుగును ఆత్మగా దర్శనీయం జేసి ఆత్మనిష్ఠలో నిలకడ చెందించే పరమాద్భుత సాధన, గిరి ప్రదక్షిణ! గిరి, గురువు, గురి ఏకమై నిలిచిన అరుణాచల దర్శనం ఆత్మదర్శనం కంటే భిన్నం కాదు.
అరుణాచల స్మరణమే ముక్తి! ప్రదక్షిణ అనుగ్రహించే శాంతి, శక్తి, వైరాగ్యం, జ్ఞానం, పరమానందం అనిర్వచనీయం. అది అనుభవైక వేద్యం. హృదయంగమం. జీవాత్మ, పరమాత్మల నిత్య సంగమం!
0 Comments:
Post a Comment