AP High Court: 'ఏపీపీఎస్సీ'కి షాకిచ్చిన హైకోర్టు, మూడు నోటిఫికేషన్లపై 'స్టే'
ఎపీలో ఉద్యోగాల నియామకాలపై హైకోర్టు 'స్టే'ల పర్వం కొనసాగుతోంది. అంతకు ముందు ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు, ఇతర పోస్టుల నియామక ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేయగా..
తాజాగా వివిధ పోస్టుల భర్తీ కోసం కేవలం ఇంగ్లిష్ భాషలోనే రాతపరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ చర్యలు చేపట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించిన మూడు నోటిఫికేషన్లను నిలిపివేసింది. రాతపరీక్షలో ప్రశ్నలను తెలుగులోనూ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది.
హైకోర్టులో దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మేరకు నవంబరు 21న ఉత్తర్వులు జారీచేశారు. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30న ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ కాశీ ప్రసన్న కుమార్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు నోటిషికేషన్ తదుపరి చర్యలను నిలిపేస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కౌంటరు దాఖలు చేయాలని ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ విచారణను 3 వారాలకు వాయిదా వేశారు. అసిస్టెంట్ ఇంజినీర్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లపై కూడా హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.
అసిస్టెంట్ ఇంజినీర్ నోటిఫికేషన్ కూడా..
అలాగే వివిధ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం పోటీ పరీక్షను ఆంగ్లంలోనే నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సెప్టెంబరు 28న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ బి.చరణ్, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్..
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ సెప్టెంబరు 26న ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ డి.శివశంకర్ రెడ్డి హైకోర్టులో ఇంకొక వ్యాజ్యం వేశారు. న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఆ రెండు నోటిఫికేషన్లలో తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు. విచారణను డిసెంబరు 1కి వాయిదా వేశారు.
0 Comments:
Post a Comment