America: అగ్రరాజ్యంలో దూసుకెళ్తున్న 'తెలుగు'.. 10ఏళ్లలో రెండింతలైన తెలుగు మాట్లాడేవారి సంఖ్య
దశాబ్దకాలంలో 150శాతం మేర పెరుగుదల
అగ్రరాజ్యం అమెరికాలో (America) తెలుగు భాష (Telugu Language) దూసుకెళ్తోంది.
అక్కడ తెలుగు మాట్లాడేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతుండడంతో తెలుగు భాష అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోంది. ప్రతియేటా ఉన్నత చదువుల కోసం యూఎస్ (US) వెళ్లి.. అక్కడే స్థిరపడుతున్న తెలుగు వారి సంఖ్య రోజు రోజుకూ పెరగడమే దీనికి కారణమని వెంచర్ క్యాపిటలిస్ట్ అవిరల్ భట్నాగర్ (Venture Capitalist Aviral Bhatnagar) సర్వేలో వెల్లడైంది. గత దశాబ్ద కాలంలో 150శాతం వృద్ధి సాధించడంతో తెలుగు మాట్లాడేవారి సంఖ్య రెండింతలు అయినట్లు ఈ సర్వే పేర్కొంది. ముఖ్యంగా 2010, 2017లో తెలుగు మాట్లాడేవారే సంఖ్య ఏకంగా 86శాతం వృద్ధిని నమోదు చేసిందట.
ఇక తెలుగు తర్వాత 62శాతం వృద్ధితో రెండో స్థానంలో అరబిక్ ఉంది. ఆ తర్వాత వరుసగా హిందీ(61శాతం), ఉర్ధూ(45శాతం), చైనీస్(35శాతం),గుజరాతీ(31శాతం) ఉన్నాయి. కాగా, భారతీయ భాషల పరంగా చూసుకుంటే తెలుగు తర్వాత రెండో స్థానంలో హిందీ కొనసాగుతోంది. అలాగే మూడో స్థానంలో గుజరాతీ ఉంది. ఇలా అమెరికాలో తెలుగు వెలుగొందడంపై సుజయ్ హెబ్బార్ అనే ట్విటర్ వినియోగదారుడు స్పందిస్తూ.. "అమెరికా వెళ్లడమే జీవితంలో అత్యున్నత విజయమని తల్లిదండ్రులు ఇప్పటికీ భావిస్తున్న చాలా మంది తెలుగు స్నేహితులు నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఈ భావన అన్ని చోట్లా ఉంటుంది కానీ తెలుగువారిలో ఆ క్రేజ్ సాటిలేనిది" అని ట్వీట్ చేశారు.
0 Comments:
Post a Comment