జగన్ సర్కార్ కు రూ.5 కోట్ల ఫైన్ -ఎన్టీటీ సంచలన తీర్పు- కారణమిదే..
ఏపీ లో సహజ వనరుల విధ్వంసం విషయంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ సంచలన తీర్పు వెలువరించింది. పేదల ఇళ్ల స్ధలాల కోసమంటూ కాకినాడ జిల్లాలో తుపానులు, సునామీ నుంచి తీర ప్రాంతాల్ని కాపాడుతున్న మడ అడవుల్ని అధికారులు గతంలో విధ్వంసం చేశారు.
దీనిపై కొందరు జనసేన నేతలు జాతీయ హరిత ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ రూ.5 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించింది.
ఇళ్ల స్ధలాల కోసం అడవుల విధ్వంసం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇళ్లస్ధలాలు కేటాయిస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే భూముల సేకరణ చేపట్టింది. పలు జిల్లాల్లో భూముల లభ్యత తక్కువగా ఉండటంతో మడ అడవుల్ని సైతం నరికేశారు. కుంగిపోయే ఆవ భూములను సైతం సేకరించారు. వాటిని అట్టహాసంగా పేదలకు పంచేశారు.అయితే ఈ వ్యవహారం పర్యావరణ నిబంధనలకు విరుద్ధం కావడంతో జాతీయ హరిత ట్రైబ్యునల్ లో పిటిషన్లు దాఖలయ్యాయి.
కాకినాడ జిల్లాలో విధ్వంసం
కాకినాడ శివారు దమ్మాలపేట సమీపంలో 116 ఎకరాల్లో సీఆర్.జడ్ పరిధిలోకి వచ్చే భూముల్లో 416 మందికి ప్రభుత్వం ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని భావించింది. ఇందుకోసం అధికారులు భూముల సేకరణ చేపట్టారు.ఇక్కడ మడ అడవులు ఉన్నప్పటికీ వాటిని నరికేసి చదును చేసేశారు. దీనిపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణతో పాటు మరొకరు జాతీయ హరిత ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. పేదలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చే పేరుతో మడ అడవుల విధ్వంసం కుదరదని ఎన్జీటీ దృష్టికి తెచ్చారు. వెంటనే మడ అడవుల విధ్వంసం ఆపాలని, నరికేసిన వాటిని పునరుద్ధరించాలని కోరారు. దీనిపై ట్రైబ్యునల్ విచారణ జరిపింది.
జగన్ సర్కార్ కు రూ.5 కోట్ల జరిమానా
కాకినాడ సమీపంలోని మడ అడవుల్ని ఇళ్ల స్ధలాల కోసమంటూ నరికేయడాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ తప్పుబట్టింది. దీనికి పరిహారంగా రూ.5 కోట్ల రూపాయలు జరిమానా విధించింది. ఈ మొత్తంతో తిరిగి మడ అడవుల్ని పునరుద్ధరించాలని ఆదేశించింది. ఇందుకు ఐదేళ్ల గడువు ఇచ్చింది. ఐదేళ్లలో 85 శాతం మడ అడవులు పునరుద్ధరించాలని ఆదేశాలు ఇచ్చింది. పునరుద్ధరణ పనులపై ఆరునెలలకోసారి నివేదిక ఇవ్వాలని సీఎస్ కు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు ఈ ప్రక్రియ పర్యవేక్షించేందుకు ఎన్జీటీ ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. వాస్తవంగా అక్కడేం జరిగిందో ఆరునెలల్లో నివేదిక ఇవ్వాలని వారిని ఆదేశించింది.
By Syed Ahmed Oneindia
0 Comments:
Post a Comment