ఎవరు ఏమనుకున్నాగానీ, డాక్టర్ కిలారి ఆనంద పాల్ అలియాస్ కేఏ పాల్ తన పని తాను చేసుకుపోతున్నారు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో. ఉంగరం గుర్తుకు ఓటెయ్యండి.. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తా.. రైతుల్ని ఆదుకుంటా.. ఆసుపత్రులు కట్టిస్తా.. కాలేజీలు కట్టిస్తా..' అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు కేఏ పాల్.
తాజాగా కేఏ పాల్, మునుగోడులో సరికొత్త గెటప్‌లో సందడి చేశారు. పంచె కట్టారు.. ఫుల్ బనియన్‌తో కనిపించారు. పత్తి చేలో దిగారు. సైకిల్ కూడా తొక్కేశారు.. ఆ పంచె కట్టుతోనే. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్నారనీ.. పెట్టుబడి పెరిగిపోతోందనీ కేఏ పాల్ చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రినీ, ప్రధాన మంత్రినీ ఓడించండి..
మునుగోడు ఉప ఎన్నికతో ముఖ్యమంత్రి పార్టీనీ, ప్రధాన మంత్రి పార్టీనీ ఓడించండి.. తద్వారా ఆ ఇద్దరినీ ఓడించినట్లవుతుందని ఓటర్లకు పిలుపునిస్తున్నారు కేఏ పాల్.
కాగా, కేఏ పాల్ సైకిల్ తొక్కేందుకు ఆపసోపాలు పడుతోంటే, అది చూసినవారంతా ఫక్కున నవ్వుకుంటున్నారు. ఎవరెలా నవ్వుకున్నాసరే.. తగ్గేదే లే.. అన్నట్లు కిలారి ఆనంద పాల్ ప్రచారంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూనే వున్నారు.
0 Comments:
Post a Comment