BBC సూపర్ ఖండం 'అమాసియా'
మహాసముద్రాలు, విస్తారమైన ఖండాలతో భూమి నిరంతరం మారుతూ ఉంటుంది.
కొత్త ఖండాలు ఏర్పడడం, పాత ఖండాలు విచ్ఛిన్నం కావడం భౌగోళిక చక్రంలో భాగం. అయితే, ఆస్ట్రేలియాలో ఉన్న పరిశోధకులు కంప్యూటర్ మోడల్స్ ఉపయోగించి తదుపరి కొత్త ఖండం ఎప్పుడు, ఎలా ఏర్పడుతుందన్నది అంచనా వేశారు.
పసిఫిక్ సముద్రం పూర్తిగా కనుమరుగైపోతుందని, ఖండాలన్నీ దగ్గరగా జరిగి ఉత్తర ధ్రువం సమీపంలో కొత్త సూపర్ ఖండం 'అమాసియా' ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ, ఇది జరగడానికి 20 లేదా 30 కోట్ల సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు.
ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీ, చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ మోడల్ అంచనాల ప్రకారం, అమెరికా పశ్చిమం వైపు, ఆసియా తూర్పు వైపు కదులుతుంది.
అంటార్కిటికా ఖండం దక్షిణ అమెరికా వైపు కదులుతుంది. ఆఫ్రికా ఒకవైపు ఆసియాకు, మరొకవైపు యూరోప్‌కు అతుక్కుని 'అమాసియా' ఏర్పడుతుంది.
ఈ పరిశోధనా పత్రాన్ని 'నేషనల్ సైన్స్ రివ్యూ'లో ప్రచురించారు.
ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచం గతంలో ఏర్పడిన సూపర్ ఖండం విచ్ఛిన్నం కావడం వలన ఏర్పడినది.
సూపర్ ఖండం
"భూమి ఆవరణ శీతలీకరణం చెందడంతో మహాసముద్రాల మొత్తం బలం తగ్గిపోతుంది. పసిఫిక్ మహాసముద్రం కుంచించుకుపోతుంది. అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కంటే చిన్నదైపోతుందని మా పరిశోధన ఫలితాల్లో వెల్లడైంది" అని ప్రధాన పరిశోధకులు డాక్టర్ చువాన్ హువాంగ్ తెలిపారు.
డాక్టర్ హువాంగ్, కర్టిన్ ఎర్త్ డైనమిక్స్ రీసెర్చ్ గ్రూప్, స్కూల్ ఆఫ్ ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్సెస్‌లలో పరిశోధకులుగా ఉన్నారు.
అమెరికా, ఆసియాతో కలిసిపోతుంది కాబట్టి కొత్త ఖండానికి 'అమాసియా' అని పేరు పెట్టారు.
భూమిపై చివరిగా ఏర్పడిన సూపర్ ఖండం 'పాంగియా' 18 కోట్ల సంవత్సరాల క్రితం చిన్న చిన్న ఖండాలుగా విచ్ఛినం అయింది. అది భూమిపై ఉన్న దాదాపు అన్ని భాగాలను కలుపుకుని ఏర్పడింది. దాని చుట్టూ 'పాంతలాసా' అనే మహాసముద్రం ఉండేది.
Dr Chuan Huangడాక్టర్ చువాన్ హువాంగ్
తాజా పరిశోధనలో, ఒక సూపర్ కంప్యూటర్‌ను ఉపయోగించి సూపర్ ఖండాలు ఎలా ఏర్పడతాయో పరిశోధకులు అంచనా వేశారు.
పసిఫిక్ మహాసముద్రం ఇప్పటికే ఏడాదికి కొన్ని సెంటీమీటర్ల చొప్పున కుంచించుకుపోతోందని ఈ కంప్యూటర్ మోడలింగ్ చూపిస్తోంది.
పసిఫిక్ సముద్రం కనుమరుగైపోగానే, ఆస్ట్రేలియా మొదట ఆసియాతో, ఆ తరువాత అమెరికాతో కలిసిపోతుందని డాక్టర్ హువాంగ్ అంచనా వేస్తున్నారు.
ఇతర అంచనాలు
గతంలో శాస్త్రవేత్తలు అమాసియా కాకుండా మరో మూడు రకాల ఖండాలు ఏర్పడతాయని అంచనా వేశారు. అవి.. నోవోపాంగియా, పాంగియా అల్టిమా, ఆరికా.
అయితే, తాజా పరిశోధన వీటి సాధ్యాసాధ్యాలపై సందేహాలు వ్యక్తం చేసింది.
"సైన్స్‌లో '100 శాతం కచ్చితంగా జరుగుతుంది' అన్న వాక్యాన్ని అరుదుగా ఉపయోగిస్తాం. ప్రత్యేకించి, సంక్లిష్టమైన భూమి పరిణామ విధానం గురించి మాట్లాడుతున్నప్పుడు. దీన్ని మనం ఇప్పుడిప్పుడే పూర్తిగా అర్థం చేసుకోవడం ప్రారంభించాం" అని అధ్యయనకర్తల్లో ఒకరైన జెంగ్-జియాంగ్ లీ వివరించారు.
"మా మోడల్ సహా ఇతర మోడల్స్ అన్నీ కేవలం ప్రతిపాదనలే. మా అంచనాలు ఇప్పటికి మనకు తెలిసిన సమాచారం, జ్ఞానాన్ని ఉపయోగించి తయారుచేసిన మోడల్స్‌పై ఆధారపడి వచ్చినవే" అని ఆయన అన్నారు.
భూమికి సుమారు 450 సంవత్సరాల వయసు ఉంటుందని అంచనా. భౌగోళిక చక్రంలో ఖండాల కదలికలు, విచ్ఛిన్నం తరచూ జరిగేదే. మహాసముద్రాల క్రింద ఉండే టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వలన ఖండాలు కదులుతుంటాయి.
"మేం సూపర్ కంప్యూటర్లను ఉపయోగించి భూమి లాంటి గోళాకార వ్యవస్థను రూపొందించాం. ఇందులో భూమి అంతర్గత నిర్మాణాలు, లక్షణాలు, టెక్టోనిక్స్ ప్లేట్లు, భూమి
ఆవరణపై ఉష్ణప్రసరణ వంటి ప్రక్రియలను అనుకరించాం. సూపర్ ఖండం ఏర్పడడానికి ఏ అంశాలు తోడ్పడతాయో తెలుసుకునేందుకు అనేక రకాల ప్రయోగాలు నిర్వహించాం" అని జెంగ్-జియాంగ్ లీ వివరించారు.
Zheng-Xiang Liజెంగ్-జియాంగ్ లీ
సముద్రాల కింద కదలికలు
సూపర్ ఖండం ఎలా ఏర్పడుతుందనే దానిపై ఓషనిక్ లిథోస్పియర్ బలం అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుందని ఈ మోడల్ ఫలితాలు వెల్లడించాయి. ఓషనిక్ లిథోస్పియర్ అంటే సముద్రం అడుగున 100కిమీ లోతులో ఉండే మందపాటి శిలావరణం లేదా టెక్టోనిక్ ప్లేట్.
కోట్ల సంవత్సరాలుగా భూమి తన అంతర్గత ఉష్ణోగ్రతను నెమ్మదిగా కోల్పోతోంది. సముద్రపు అడుగున 7-8 కిమీల మందంతో ఉండే శిలావరణం కాలక్రమేణా సన్నగిల్లుతున్నట్టు కనిపిస్తోంది. భూమి ఆవరణ నెమ్మదిగా చల్లబడడం, సముద్రం మధ్యలో చీలికలు కారణంగా ఇది జరుగుతోంది.
"అందుకే, పసిఫిక్ మహాసముద్రం కనుమరుగైతేనే అమాసియా ఏర్పడుతుందని మా మోడల్ ఫలితాలు చెబుతున్నాయి" అని లీ వివరించారు.
సూపర్ ఖండాలు ఏర్పడడం, విచ్ఛిన్నం కావడం అనేది భూమి వాతావరణం, పర్యావరణంపై పెద్ద ప్రభావాన్నే చూపుతుంది.
సాధారణంగా, సూపర్ ఖండం ఏర్పడితే సముద్రమట్టాలు తగ్గిపోతాయి. అంటే జీవవైవిధ్యం తగ్గిపోతుంది. సూపర్ ఖండంపై నీళ్లు లేని, ఎండిన భూములు ఏర్పడతాయి.
అదే సూపర్ ఖండం విచ్చిన్నం అయితే, సముద్ర మట్టాలు పెరుగుతాయి. జీవవైవిధ్యం మెరుగుపడుతుంది. మానవ మనుగడకు అవకాశం ఉండే చిన్న చిన్న ఖండాలు ఎన్నో ఏర్పడతాయి.
"కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత భూమిపై మానవ జీవితం ఎలా ఉంటుందన్నది ఊహించడం చాలా కష్టం. కానీ, ఈ జీవగోళంలో భాగంగా, మానవులు నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటారు. గతంలో లాగే, మనిషి అమోఘమైన మేధస్సు, సాంకేతిక సామర్థ్యం భవిష్యత్తులో వచ్చే మార్పులను స్వీకరించడానికి సహకరిస్తుందని విశ్వసిస్తున్నాను" అన్నారు జెంగ్-జియాంగ్ లీ.
0 Comments:
Post a Comment