దివంగత కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ తొలి వర్ధంతికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పునీత్ భారీ విగ్రహాన్ని తయారు చేయించారు. ఏపీలోని తెనాలిలో ఈ విగ్రహం తయారైంది.
దీన్ని ఇవాళ బెంగళూరుకు తరలిస్తున్నారు. ఇవాళ పునీత్ వర్ధంతి రోజు.
పిన్న వయసులోనే గుండెపోటుతో కన్నుమూసిన పునీత్ రాజ్ కుమార్ కు కర్నాటకతో పాటు వివిధ రాష్ట్రాల్లో అభిమానులున్నారు. ఆయన సినిమాలు కూడా కర్నాటకతో పాటు పలు రాష్టాల్లో ప్రదర్శితమయ్యేవి. ఆయన సామాజిక కార్యక్రమాలు లెక్కలేనివి.
అలాంటిది ఏడాది క్రితం పునీత్ అందరినీ విడిచి వెళ్లిపోవడంతో ఇంకా ఆ షాక్ నుంచి అభిమానులు తేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పునీత్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు.
పునీత్ జ్ఞాపకార్థం గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని తయారు చేశారు. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి ఈ భారీ విగ్రహాన్ని రెడీ చేశారు.
21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీతో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. కాగా బెంగళూరులో తరలించనున్న ఈ విగ్రహ తయారీకి దాదాపు నాలుగు నెలల సమయం పట్టిందని శిల్పులు తెలిపారు.
ప్రస్తుతం తెనాలిలోని సూర్య శిల్పశాల వద్ద పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శనగా ఉంచారు. నవంబర్ 1న పునీత్ రాజ్ కుమార్ గౌరవార్థం కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మక కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రదానం చేయనుంది.
ఈ కార్యక్రమంలో పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శించనున్నారని తెలుస్తోంది. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథులుగా పాల్గొనబోతున్నారు.
0 Comments:
Post a Comment