✍️ఉపాధ్యాయ పదోన్నతుల్లో ‘రివర్స్’
♦️30 వేల నుంచి 4 వేలకు!.. ఫిబ్రవరిలో 30 వేల అంచనా
♦️ఆగస్టుకు 10 వేలకు కుదింపు.. చివరికి ఇచ్చింది నాలుగు వేలే
♦️దశాబ్దాల కల తీర్చామని ప్రచారం.. సర్కారు వ్యూహంతో టీచర్లు షాక్
♦️పదోన్నతి వచ్చినా అక్కడే.. పీరియడ్లు పెంపు, మీడియంల కుదింపు
🌻(అమరావతి-ఆంధ్రజ్యోతి):* ఫిబ్రవరిలో 30 వేల మందికి పదోన్నతులు ఇస్తున్నట్టు అంచనా వేశారు. ఆగస్టు నాటికి ఈ అంచనా 10 వేలకు పడిపోయింది. చివరికి వాస్తవంగా ఇచ్చిన పదోన్నతులు నాలుగు వేలు. ఇదీ వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన పదోన్నతుల బహుమతి! ఇంకేముంది టీచర్లు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు కనీవినీ ఎరుగని రీతిలో 30 వేల మందికి రాబోతున్నాయంటూ ప్రచారం చేసుకున్న జగన్ ప్రభుత్వం చివరికి మొండిచేయి చూపింది. అప్పుడెప్పుడో అంచనా వేశాం కానీ వాస్తవంలో ఇంతేనంటూ 4 వేల నుంచి 5 వేల మధ్యలో పదోన్నతులు ఇస్తోంది. దీంతో పదోన్నతులు వస్తాయని భారీ సంఖ్యలో ఎదురుచూసిన టీచర్లకు నిరాశే ఎదురైంది. గత ఏడాది కాలం నుంచి ఇస్తామని ప్రచారం చేసుకున్న పదోన్నతుల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాల ప్రకారం తీసుకుంటే ఒక్కో జిల్లాకు సుమారు 2 నుంచి 3 వేల మందికి పదోన్నతులు రావాల్సి ఉండగా, ఇప్పుడు కేవలం 300 నుంచి 400 మంది మాత్రమే వచ్చాయి. అందులోనూ కొన్నిచోట్ల భాషా పండితులకు సంబంధించి ఉపాధ్యాయుల కొరతతో పదోన్నతులు నిలిచిపోయాయి. దీంతో ఇప్పటి వరకు చాలా మందికి పదోన్నతులు వస్తాయని పెట్టుకున్న టీచర్ల ఆశలన్నీ ఆవిరయ్యాయి.
♦️పీరియడ్లు పెంపే కారణం!
పదోన్నతులు ఎక్కువ సంఖ్యలో రాకపోవడానికి పలు కారణాలు దోహదం చేశాయి. వీటిలో ప్రధాన కారణం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో 117 ద్వారా టీచర్లపై పనిభారం పెంచడం. అంటే గతంలో వారానికి 30 పీరియడ్లు బోధించే టీచర్లు ఇప్పుడు 36 పీరియడ్లు బోధించాలనే నిబంధన తెచ్చారు. అంటే సగటున ఒక టీచర్‌కు రోజులో కేవలం ఒక్క పీరియడ్ సమయం మాత్రమే ఖాళీ ఉంటుంది. అదే పాత విధానం అమల్లో ఉంటే ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల అవసరం ఇంకా ఎక్కువ ఉండేది. అప్పుడు ఎక్కువ మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇచ్చే అవకాశం ఉండేది. అలాగే పాఠశాలల్లో తెలుగు మీడియం పూర్తిగా తీసేయడం వల్ల కూడా స్కూల్ అసిస్టెంట్ల అవసరం తగ్గిపోయింది. ఈ కారణాలతో ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల అవసరం బాగా తగ్గిపోయింది. మరోవైపు ప్రభుత్వం వేసిన అంచ నా ప్రకారం పదివేల కంటే ఎక్కువ పాఠశాలల్లో తరగతులు విలీనం అవుతాయని భావించారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత, ఇతర కారణాలతో అది 5,400కు పడిపోయింది. తరగతుల విలీనం తగ్గడంతో ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల అవసరం తగ్గింది.
♦️పదోన్నతి పొందినా అక్కడే
సాధారణంగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను ఎక్కడ అవసరమో అక్కడికి వెంటనే బదిలీ చేస్తారు. కానీ, తాజా ప్రక్రియలో పదోన్నతి పొందిన వారికి ఎక్కడ ఖాళీలున్నాయో చూపించలేదు. దీంతో పదోన్నతి పొందిన వారు ప్రస్తుతానికి అక్కడే కొనసాగుతారు.
♦️మరోవైపు రెండు సబ్జెక్టుల్లో అర్హత ఉండి ఒక సబ్జెక్టులోనే పదోన్నతి కోరుకున్న ఉపాధ్యాయులకు ఈసారి పదోన్నతి ఇవ్వలేదు. వారికి ఏడాది తర్వాత పదోన్నతులు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దీంతో నచ్చిన సబ్జెక్టులోనే పదోన్నతి కావాలనుకున్నవారు ఈ పదోన్నతులకు దూరమయ్యారు.
0 Comments:
Post a Comment