Mahmud Begada | మహమూద్ బెగాడ అసలు పేరు మహమూద్ షా. 15వ శతాబ్దంలో బెగాడ గుజరాత్‌ను పరిపాలించాడు. కేవలం 13 ఏండ్లకే సింహాసనం అధిష్ఠించిన బెగాడ..
53 ఏండ్ల పాటు చక్రవర్తిగా కొనసాగాడు.
Mahmud Begada | దాదాపు 35 కిలోల అన్నం.. 150 అరటి పండ్లు.. ఒక పెద్ద గిన్నెడు తేనే.. మరో గిన్నెడు వెన్న.. మధ్యమధ్యలో ఆకలిస్తే తినడానికి 4.5 కిలోల పరమాన్నం.. ఏంటి ఇవన్నీ ఏదో ఫంక్షన్ కోసం చెబుతున్న లిస్ట్ అనుకుంటున్నారా ? అయితే పప్పులో కాలేసినట్టే.
మరి చూడ్డానికి ఓ వంద మంది తినే భోజనంలానే అనిపిస్తుంది కదా.. కానీ వందమంది కోసం కాదు.. ఒకే ఒక్కడు ఒక్క రోజులో తినే ఆహారమిది. అమ్మో అంత తింటాడా అని మీరు నోరెళ్లబెడుతున్నారేమో కానీ ఇది మాత్రం ఆయనకు సరిపోదు.
మధ్యరాత్రిలో ఆకలేస్తే తినడానికి మటన్ సమోసాలు బెడ్ పక్కన ఉండాల్సిందేనట. బకాసురుడిలా అంత తిండి తినే వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తున్నారా? అతనెవరో కాదు.. గుజరాత్ చక్రవర్తి మహమూద్ బెగాడ.
మహమూద్ బెగాడ అసలు పేరు మహమూద్ షా. 15వ శతాబ్దంలో బెగాడ గుజరాత్‌ను పరిపాలించాడు. కేవలం 13 ఏండ్లకే సింహాసనం అధిష్ఠించిన బెగాడ.. 53 ఏండ్ల పాటు చక్రవర్తిగా కొనసాగాడు. ఎక్కువ కాలం రాజ్యాన్ని పాలించిన రాజుల్లో ఒకడిగా నిలిచాడు.
శారీరకంగా ఎంతో ఫిట్‌గా ఉండే బెగాడ.. భోజనప్రియుడు. ఆయన ముందు ఎంత పెడితే అంత అవళీలగా తినేస్తాడు. ఆయన లేవగానే ఒక పెద్ద గిన్నె నిండా తేనె, మరో పెద్ద గిన్నె నిండా వెన్న తినేవాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి 100 నుంచి 150 వరకు అరటి పండ్లను అల్పాహారంగా ఆరగించేవాడు. ఇక మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు కిలోల కొద్ది ఆహారాన్ని భుజించేవాడట.
ఇంత తిన్న తర్వాత కూడా ఆకలేసినట్టు అనిపిస్తే.. కనీసం నాలుగైదు కిలోల పరమాన్నం లేదా ఏవైనా స్వీట్స్ వండి బెగాడ రాజుగారికి వడ్డించేవారట. అయినా సరే రాత్రిళ్లు ఆకలేస్తోందేమోనని.. ఆయన మంచానికి అటు ఇటు మటన్ సమోసాలను సిబ్బంది ఉంచేవారట. పొద్దున సిబ్బంది వెళ్లి చూసేసరికి అవన్నీ ఖాళీ అయ్యేవని యూరోపియన్ చరిత్రకారులు చెబుతున్నారు.
విషం కూడా ఆహారమే
గుజరాత్‌ను పాలిస్తున్న సమయంలో బెగాడపై శత్రువులు విషప్రయోగం చేశారు. కానీ అదృష్టవశాత్తూ ఆ కుట్ర నుంచి బెగాడ ప్రాణాలతో బయటపడ్డాడు.
అప్పట్నుంచి విషాన్ని కూడా తట్టుకునే శక్తి కోసం రోజూ కొంత విషాన్ని ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టాడని చరిత్రకారులు చెబుతున్నారు.
ఇలా రోజు విషాన్ని ఆహారంగా తీసుకోవడంతో ఆయన విప్పేసిన బట్టలను ముట్టుకోవాలన్నా భయపడేవాళ్లట. బెగాడ వేసుకున్న బట్టలు విషపూరితమై ఉంటాయని.. ఏ రోజుకు ఆ రోజు ఆయన విడిచిన దుస్తులను దూరంగా తీసుకెళ్లి కాల్చేసేవారట.
0 Comments:
Post a Comment