LIC Facts: రూ.2.25 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు.. గుడ్‌బై చెప్పిన రిటైలర్స్.. ఏమవుతోంది..?
LIC Facts: ఎల్ఐసీ అంటేనే ఒక నమ్మకం.. దేశంలో చాలా మంది కళ్లు మూసుకుని తమ డబ్బును దాచుకునే ఒక ప్రదేశంగా ఎల్ఐసీని చెప్పుకోవచ్చు. కానీ ఐపీవో మార్కెట్లోకి వచ్చిన తర్వాత దానిపై ఇన్వెస్టర్లకు మెల్లమెల్లగా నమ్మకం సన్నగిల్లుతోంది.
రాంగ్ టైంలో మార్కెట్లోకి షేర్లను తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వం అంటూ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐదు నెలల్లో..
ఎల్ఐసీ మీద ఉన్న నమ్మకంతో చాలా మంది చిన్న ఇన్వెస్టర్లు ఎల్ఐసీలో పెట్టుబడులు పెట్టారు. కానీ గడచిన 5 నెలలు చూస్తే.. షేర్ ఈ క్రమంలో 35 శాతం పడిపోయింది. ఐపీవో వచ్చినప్పుడు సంస్థ మార్కెట్ క్యాప్ రూ.6 లక్షల కోట్లు ఉండగా.. ప్రస్తుతం అది రూ.3.75 లక్షల కోట్లకు చేరుకుంది. ఒకప్పుడు చిన్న మదుపరుల సంపదను ప్రభుత్వ ప్రాజెక్టులు, బాండ్లు, ప్రభుత్వ కంపెనీల్లో పెట్టుబడి పెడుతూ.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది ఎల్ఐసీ.
దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు..
చాలా మంది చిన్న రిటైల్ పెట్టుబడిదారులు ఎల్ఐసీ విషయంలో తమ దీర్ఘకాలిక ఆలోచనలను పక్కనపెట్టి.. నష్టాల్లోనే షేర్లను వదిలించుకుంటున్నారు. కేంద్రం తన డిస్ ఇన్వెస్ట్ మెంట్ లక్ష్యాల కోసం మార్కెట్లు సానుకూలంగా లేనప్పటికీ ఆర్థిక మంత్రిత్వశాఖ ఐపీవోను ఫ్లోట్ చేసింది. దీంతో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఇప్పుడు పూర్తిగా నమ్మకం కోల్పోయి LIC షేర్లకు గుడ్ బై చెప్పేస్తున్నారు.
ఐపీవో గందరగోళం..
ముందుగా రూ.14 నుంచి రూ.15 లక్షల కోట్ల విలువతో మార్కెట్లోకి ఐపీవోను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం తొలుత ప్లాన్ చేసింది. అయితే అనుకోకుండా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రావటంతో దానిని రూ.6 లక్షల కోట్లుకు పరిమితం చేసింది. ఒక విధంగా ఇది ఇన్వెస్టర్లను రక్షించిందనే చెప్పుకోవాలి. లిస్టింగ్ తర్వాత అత్యుత్తమ ప్రభుత్వరంగ కంపెనీగా మారుతుందని అందరూ భావించినప్పటికీ.. దాని మార్కెట్ క్యాప్ ప్రకారం 14వ స్థానానికి పరిమితమైంది.
వ్యాల్యుయేషన్..
గత ఏడాది కాలంలో కేవలం ఎల్ఐసీ మాత్రమే కాక అనేక స్టార్టప్, ప్రైవేటు కంపెనీలు అధిక వ్యాల్యుయేషన్ల కారణంగా లిస్టింగ్ తరువాత భారీగా విలువను కోల్పోయాయి. ఇలాంటి క్రమంలో అప్పటికే ట్రేడవుతున్న ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థల కంటే ఎక్కువ ధరతో ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ జారీచేసినట్లు జీసీఎల్ సెక్యూరిటీస్ సీఈవో రవి సింఘాల్ అభిప్రాయపడ్డారు.
ఈ కారణాలతో డబ్బు కోల్పోయిన 4.5 లక్షల మంది ఎల్ఐసీ ఇన్వెస్టర్లు 4 నెలల్లోనే తమ వాటాలను అమ్మేసుకున్నారు. రూ.949 ధరతో వచ్చిన ఐపీవో ఇప్పుడు రూ.593 వద్ద ట్రేడ్ అవుతోంది.
డివిడెండ్ ప్రకటన..
ఇన్వెస్టర్లు నమ్మకం కోల్పోతున్న ప్రస్తుత తరుణంలో వారిలో విశ్వాసాన్ని నింపేందుకు డివిడెండ్, బోనస్ అందించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్ఐసీ షేర్ల ధరలను సైతం తిరిగి గాడిలోకి తీసుకురావాలని చూస్తున్నట్లు ఒక అధికారి వెల్లడించారు. ఇందుకోసం నాన్-పార్టిసిపేటింగ్ ఫండ్ లోని రూ.1.81 లక్షల కోట్లు వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.
0 Comments:
Post a Comment