Health Tips - వారానికి 150 నిమిషాలు వెచ్చించండి... మీ ఆయుష్షు పెరగడం ఖాయం..
జీవితం ఎంతో విలువైంది. ఆరోగ్యం అరుదైనది. సంతోషం సదా రక్షించేది. అందుకే, ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ, సంతోషాన్ని సదా కాపాడుకుంటూ, ఆయుష్షును అన్నివేళలా పెంచుకుంటూ ముందుకు సాగితే ఆనందకరమైన జీవితం మన సొంతమవుతుంది. నిత్యం ఉరుకులు పరుగులు తప్పవు. మన వృత్తిరీత్యా మనకుండే అనేకానేక టెన్షన్లు తప్పవు. ఉదయం మనం నిద్ర లేచిన దగ్గర నుండీ రాత్రి నిద్రించబోయే వరకూ మనల్ని ప్రేమగా పలకరించేవారూ, గట్టిగా కోప్పడేవారూ, అసూయపడేవారూ, కసరుకునేవారూ... ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ప్రవర్తిస్తారు. వారి స్పందనలకు మనం ప్రతిస్పందిస్తాం. ఈ నేపథ్యంలో మనం సంతోషిస్తాం, ఆవేశానికి లోనవుతాం, బాధపడుతాం, ఏడుస్తాం, నవ్వుతాం...
అన్నీ చేస్తాం. ఇవన్నీ మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయన్నది నూటికి నూరుపాళ్లూ ఖచ్చితమైన విషయం. మరి, మనం ఏంచేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవేంటో తెలుసుకుందాం.
శరీర ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరమనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజూ ఎక్సర్ సైజులు చేస్తే శరీరం ఎంత ఆరోగ్యంగా వుంటుందో చెప్పాలా...!! అయితే, మన జీవితంలో వ్యాయామాలకు ఎంతో ప్రత్యేకత వుందని ఓ అధ్యయనం వెల్లడించింది. కానీ, వ్యాయామాలు ఎంతసేపు చేయాలీ, ఎన్ని రోజులకోసారి చేయాలీ అన్న విషయాలపై ఎప్పటికప్పుడు అందరికీ సందేహాలు కలుగుతూంటాయి. ఆ సందేహాలకు తెర వేస్తూ ఉదయం లేచింది మొదలు గంటలు గంటలు వ్యామాలు చేయాల్సిన అవసరం లేదనీ, కేవలం వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే చాలని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఆయుష్షు పెరుగుతుందిట.
అయితే, ఇదేదో ఆషామాషీ అధ్యయనం కాదు సుమండీ...!! ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా ముప్పై ఏళ్లపాటు ఆరోగ్య రంగానికి చెందిన 1.16 లక్షల మందిపై 1988 నుండి 2018 వరకు నిశితమైన పరిశీలన సాగించారు. వారి భౌతిక కార్యాచరణపై కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా వారి నుంచి కీలక సమాచారం రాబట్టారు.
నిత్యం వ్యాయామం చేసేవారిలో, అన్ని రకాల అనారోగ్య సంబంధిత మరణాల నుంచి ముప్పు చాలావరకు తగ్గినట్టు గుర్తించారు. వారానికి 150 నుంచి 599 నిమిషాల పాటు వ్యాయామం చేసే వారిలో ప్రాణగండం రేటు బాగా తగ్గిపోయిందట. 150 నుంచి 299 నిమిషాల పాటు వ్యాయామం చేసేవారిలో డెత్ రేటు 2 శాతం నుంచి 4 శాతం తగ్గిపోగా... 300 నుంచి 599 నిమిషాల పాటు వ్యాయామం చేసేవారిలో 3 నుంచి 13 శాతం తగ్గిపోయిందని అధ్యయనంలో పేర్కొన్నారు. అదండీ, విషయం. వారానికి కేవలం 150 నిమిషాలంటే తక్కువ సమయమే గదా... రోజులో కొంత సమయమైనా వ్యాయామానికి సమయాన్ని కేటాయిస్తే ఎంత ఉపయోగమో అర్థమైందిగా... రోజూ వ్యాయామం చేద్దాం, ఆరోగ్యంగా వుందాం.
0 Comments:
Post a Comment