✍️పదింటి కల్లా సీట్లలో ఉండాలి
♦️ఉద్యోగులకు జీఏడీ ఆదేశాలు
🌻అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి)*: రాష్ట్ర సచివాలయం, హెచ్ ఓడీలు, కార్పొరేషన్లు, ఏపీసీఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా సమయానికి రావాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు విధులు నిర్వహించాలని సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) తాజాగా ఆదేశాలిచ్చింది.ఉదయం 10 గంటల కల్లా ఉద్యోగులంతా తమ సీట్లలో ఉండి పని ప్రారంభించాలని సూచిస్తూ జీఏడీ పొలిటికల్ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు నోట్ జారీ చేశారు. మరో 10 నిముషాలు గ్రేస్ టైమ్ ఇస్తున్నట్టు తెలిపారు. ఏదైనా సరైన కారణం ఉంటేనే నెలకు మూడుసార్లు ఉద్యోగులు ఆలస్యంగా విధులకు హాజరుకావచ్చని, ఆ మూడుసార్లు కలిపి అయ్యే ఆలస్యం గ్రేస్ టైమ్ కూడా కలుపుకుని ఒక గంట మించకూడదని పేర్కొన్నారు. ఒక నెలలో వరుసగా మూడు సార్లు అనుమతి లేకుండా ఉద్యోగులు విధులకు ఆలస్యంగా హాజరైతే దాన్ని క్యాజువల్ లీవ్(సీఎల్) కింద పరిగణిస్తామని తెలిపారు. ఒకవేళ ఆ ఏడాది క్యాజువల్ లీవులు ఉద్యోగులు వాడుకుని ఉంటే తదుపరి ఏడాది వచ్చే క్యాజువల్ లీవుల్లో కోత విధిస్తామని చెప్పారు. ఉద్యోగి ఒకవేళ అనుమతి తీసుకుని లేదా అనుమతి తీసుకోకుండా విధులకు గంట ఆలస్యంగా హాజరైతే దాన్ని 'హాఫ్ డే' క్యాజువల్ లీవుగా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత హాజరైతే దాన్ని ఫూర్తి క్యాజువల్ లీవుగా పరిగణిస్తామని నోట్‌లో వివరించారు. సచివాలయంలోని ప్రతి శాఖ.. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల కల్లా తమ శాఖలో ఉద్యోగుల హాజరును ఈ మెయిల్ ద్వారా జీఏడీకి పంపాలని ఆదేశించారు.
♦️ఇది కక్ష సాధింపు: ఉద్యోగులు
తాజా నోట్‌పై.. ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ-ఆఫీస్ అందుబాటులోకి వచ్చాక తాము సెలవు రోజుల్లోను, పనిదినాల్లోనూ.. ఇంటికి వెళ్లాక కూడా ఆన్‌లైన్‌లో వర్క్ చేస్తున్నామని అంటున్నారు. అలాగే, సచివాలయం, హెచ్‌వోడీల్లో ఉన్నతస్థాయిలో సమీక్షలు, సమావేశాలు అన్నీ సాయంత్రమే ఉంటాయని, అవి పూర్తయి ఇళ్లకు వెళ్లే సరికి రాత్రవుతోందని అంటున్నారు. జీఏడీ ఇవన్నీ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
0 Comments:
Post a Comment