✍️డీఏ ఎప్పటికో?
♦️ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల వెతలు
♦️2018 నుంచి బకాయిలు
♦️ఏడు డీఏలపై నిర్లక్ష్య వైఖరి
♦️జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యలు
🌻విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:
దీపావళి కానుకగా బకాయిపడిన కరవు భత్య(డీఏ)మైనా ప్రకటిస్తారని వేచిస్తున్న ఉద్యోగులకు నిరాశే మిగిలింది. పది లక్షల మంది ఉద్యోగులు ప్రయోజనాలపై జగన్ ప్రభుత్వం కక్ష. సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డీఏలు రానందున ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛను నిరుత్సాహంగా ఉన్నారు. ఆది నుంచి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. న్యాయపరంగా రావాల్సిన ప్రయోజనాలపైనా ఉక్కుపాదం మోపుతోంది. దీనికి ప్రధాన కారణంగా ఉద్యోగులు ఉద్యమబాట పట్టడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. దానిని ఓర్వలేక ఈ తరహాగా ఇబ్బందులకు గురిచేస్తుందనే విమర్శలున్నాయి. ఉద్యోగుల పీఆర్సీ తదితర సమస్యల కోసం గతంలో చలో విజయవాడ విజయవంతమైనప్పటి నుంచీ, జగన్ ప్రభుత్వ వైఖరిలో స్పష్టంగా మార్పు కనిపిస్తోంది. ఇప్పటికే కొంతమంది కీలక ఉద్యోగ సంఘాల నేతలను పనికట్టుకుని మారుమూల ప్రాంతాలకు ప్రభుత్వం బదిలీచేసి, పైశాచిక ఆనందం పొందుతోంది. ఆ తర్వాత కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుపై ఉద్యోగులు పెద్దఎత్తున గళమెత్తడంపైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఉద్యోగులు పీఎఫ్పై పెట్టుకున్న రుణాలను సైతం ఏళ్ల కొద్దీ పెండింగ్లో ఉంచుతూ నానా ఇబ్బందులకు గురిచేస్తోంది. తమ పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం ఎంతోకొంత రుణాలు వస్తాయని ఆశించిన ఉద్యోగులు భంగపాటుకు గురవుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ ఈ తరహాగా ఉద్యోగుల ప్రయోజనాలను నిలుపుదల చేయలేదనే విమర్శలున్నాయి.
♦️2018 నుంచి నిలిచిన డీఏ బకాయిలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 2018 నుంచి బకాయిపడిన డీఏలకు చెందిన కోట్లాది రూపాయలు ఇప్పటికీ చెల్లించలేదు. ఆర్థికపరమైన ఏ అంశాన్ని పరిష్కరించకపోయినా ఉద్యోగులు ఓపికతో ఎదురు చూస్తున్నారు. సీఎం జగను, ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఉద్యోగ సంఘాల నేతలు చాలా సార్లు వినతిపత్రాలు అందజేసినప్పటికీ స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వంతోపాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు డీఏతోపాటు దీపావళి కానుకగా అదనంగా బోనస్లూ ప్రకటించాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. తమిళనాడు, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలు కూడా దసరా, దీపావళి పండుగలకు కొత్త డీఏలు ఇవ్వడంతోపాటు ఉద్యోగులకు చెందిన నిలిచిన బకాయిలన్నీ చెల్లించాయి. 2018 జులై నుంచి డిసెంబరు వరకు రావాల్సిన ఏడు పాత డీఏ బకాయిలతోపాటు ఈ ఏడాది, 2022 జనవరి, జులై రెండు డీఏల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని చెల్లించాలంటూ అమరావతి జేఏసీ, ఎస్టీయూ తదితర సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బులు, వారికి రావాల్సిన ప్రయోజనాలను ఏళ్ల తరబడి ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
♦️ఉపాధ్యాయ ప్రయోజనాలపై వివక్ష
పీఆర్సీ - 2020 అమలు సమయంలో 27 శాతం ఐఆర్ ఇస్తున్నప్పటికీ, ఫిక్సేషన్ 23 శాతానికే పరిమితం చేసి ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఆర్ధికంగా ప్రభుత్వం నష్టం చేకూర్చింది. హెచ్ఆర్ఎ స్లాబులను తగ్గించడంతో ఉపాధ్యాయ వర్గానికి తీవ్ర నిరాశ మిగిల్చింది. 2018 జులై నుంచి 2021 డిసెంబరు వరకు ఇచ్చిన ఏడు విడతల దీఏల బకాయిలను ఉద్యోగులకు చెల్లించలేదు. ఈ ఏడాది జనవరి డీఏ, జులై డీఏల చెల్లింపుపై ఇంతవరకూ ఉత్తర్వులు ఇవ్వలేవు. సరెండరు లీవ్, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), ఏపీబీఎల్బ రుణాలు, పదవీ విరమణ తుది చెల్లింపుల విషయంలో తీవ్ర జాప్యం నెలకొంది. 2003-డీఎస్సీ ద్వారా ఎంపికై, 2004లో విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) వర్తింపజేస్తామని జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారితోపాటు డీఎస్సీ-2002 ద్వారా ఎంపికైన 400 మంది హిందీ పండిట్లకు సైతం పాత పెన్షన్ వర్తింపచేయాల్సి ఉంది. కరోనాతో మరణించిన ఉపాధ్యాయ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాన్ని చేపట్టలేదు. ఆర్థికంగా చాలా బాగున్నామని చెబుతున్న సీఎం, తక్షణమే ఉద్యోగుల ప్రయోజనాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ దీపావళికైనా నిలిచిన డీఏలను ప్రభుత్వం ప్రకటించాలని, లేకుంటే తమ హక్కుల సాధన కోసం ఉద్యమబాట పడతామని హెచ్చరిస్తున్నారు.
0 Comments:
Post a Comment